Friday, November 12, 2010

మౌన వీణ

మౌన వీణ

ఈ ఉదయ వేళలో-నీ హృదయ సీమలో
నాపై దయ రాదేలనో-ఈ అలక్ష్యమేలనో
శుభోదయం కానేకదమ్మా-నీ బదులే లేకుంటే
అయోమయం అవుతుందోయమ్మా-నువ్వే కనరాకుంటే

1. నా కన్నులకారాటం-నిన్ను చూడాలని
నా మనసుకు ఉబలాటం-ఏదో తెలపాలని
చూపులు మాటాడ లేవు-పెదవులసలు విచ్చుకోవు
గుండె గొంతులోకి వచ్చి-ఊపిరాడకుంటుంది-ఉక్కిరిబిక్కి రవుతుంది
శుభోదయం కానేకదమ్మా-నీ బదులే లేకుంటే
అయోమయం అవుతుందోయమ్మా-నువ్వే కనరాకుంటే


2. ఇంకా తెలియదేమని-ఎక్కడో అనుమానం
తెలిసీ నటిస్తావనీ-నాకు గట్టి నమ్మకం
నేను తప్పుకోలేను-నువ్వు ఒప్పుకోలేవు
అడుగడుగున ఎన్ని మలుపులో-విధి ఆడే నాటకంలో-ఈ వింతనాటకంలో
శుభోదయం కానేకదమ్మా-నీ బదులే లేకుంటే
అయోమయం అవుతుందోయమ్మా-నువ్వే కనరాకుంటే

వీడుకోలు-వేడికోలు

వీడుకోలు-వేడికోలు
నువ్వెళ్లిపోతానంటే –గుండెల్లొ గుబులవుతుంది
నువుకనుమరుగవుతూ ఉంటే-కళ్ళల్లొ వరదవుతుంది
నువ్వులేని ప్రతిక్షణం- వెలితి గానె ఉంటుంది
నీ రాక కోసమే-మది తపించిపోతుంది
ఎలా తెలుపనే చెలిమీ-ఎదలొ అనుభూతిని
ప్రణయమూ పరిణయమేనా- ప్రేమకు పరమావధి

1. మనిషిగా ఎక్కడ ఉన్నా –మనసు నిను గాలిస్తుంది
ఆచూకి పట్టలేక- తల్లడిల్లి పోతుంది
ఏ పని నే చేస్తూ ఉన్నా-ధ్యాసంతా నీదవుతుంది
ఏకాగ్రత కుదరక ఎపుడు- అలజడి చెలరేగుతుంది
ఎలా తెలుపనే చెలిమీ-ఎదలొ అనుభూతిని
ప్రణయమూ పరిణయమేనా- ప్రేమకు పరమావధి

2. అమ్మనైన తలపించే –ఆత్మీయత కురిపిస్తున్నా
ఎనలేని నా అనురాగం -నీకెంత చులకనో
నాన్ననైన మరపించే-ఆప్యాయత పంచుతున్నా
తులలేని నా అభిమానం-నీకెంత పలుచనో
ఎలా తెలుపనే చెలిమీ-ఎదలొ అనుభూతిని
ప్రణయమూ పరిణయమేనా- ప్రేమకు పరమావధి