Thursday, June 30, 2011

ప్రేమ యాతన-(దుల్హాదుల్హన్ హిందీ సిన్మాలోని-“జో ప్యార్ తూనే” ముఖేశ్ గీతానికి స్వేఛ్చానువాదం)

ప్రేమ యాతన-(దుల్హాదుల్హన్ హిందీ సిన్మాలోని-“జో ప్యార్ తూనే” ముఖేశ్ గీతానికి స్వేఛ్చానువాదం)
ఏ ప్రేమ కోసం తపియించినానో
ఆ వంకతోనే బలిచేసినావు
అనురాగరాగం పలికించమంటూ
నమ్మించి నాగొంతు నులిమేసినావు

1. ఏ ఆయుధం నీవు వాడావొ గాని
ఎదనెంత చిత్రంగ నరికేసినావు
నీకెంత కసిఉందొ ఏనాటిదో గాని
ప్రణయాన్ని మొదలంటు పెరికేసినావు

నిన్నెంత నిందించి ఇక ఏమిలాభం
ఏమంటె మాత్రం తొలిగేన శోకం

2. వేధించు వారింక ఇకనీకు ఎవరు
రేపింక నీవెంట పడువారు లేరు
నీ స్వేఛ్ఛలోకాన యువరాణి నీవు
ఇక నీకు నావల్ల ఇబ్బంది లేదు

వీడ్కోలు నేస్తం ఇక జీవితాంతం
అబినందనలునీకు శుభమస్తు నిత్యం

3. ఎవరైన నిను చూస్తె ఈర్ష్యొందు వారేరి
నీహాస చంద్రిక కోరే చకోరేది
మనసెరిగీ నీ కోర్కె తీర్చేటి వారేరి
నీ బాధ తనదంటు వగచేటి వారేరి

దొరకాలి నీకు మరీ మంచివారు
కావాలి భవితే బంగారు తేరు

Sunday, June 19, 2011

త్రిభువనైక మాత-త్రిగుణాతీత

త్రిభువనైక మాత-త్రిగుణాతీత


జై జగజ్జననీ...లోకపావనీ
నీ దయ లేనిదీ అడుగైన కదలదీ అవనీ
పాహిమాం..సదా..పాలయమాం - పాహిమాం..సదా..పాలయమాం

1. దాక్షాయణి మోక్షదాయినీ
కృపా జలనిధీ కైవల్యదాయినీ
అరివర్గభేదినీ మాయామోహినీ భవానీ
పాహిమాం..సదా..పాలయమాం - పాహిమాం..సదా..పాలయమాం

2. క్షీరాబ్ది పుత్రీ కమల నేత్రీ
చంచలప్రవృత్తీ అభినేత్రి
సుందర మందస్మిత మధురగాత్రీ గాయిత్రీ
పాహిమాం..సదా..పాలయమాం - పాహిమాం..సదా..పాలయమాం

3. వరవీణా మృదుపాణీ అక్షర రూపిణీ
వేదాగ్రణి విధిరాణీ సకల కళా కళ్యాణీ
వాణీ గీర్వాణీ పారాయణి హంసవాహినీ
పాహిమాం..సదా..పాలయమాం - పాహిమాం..సదా..పాలయమాం

Sunday, June 12, 2011

కల-కాలం

కల-కాలం

కాలమెంత కఠినమైనది
బ్రతుకెంత జటిలమైనది
స్వర్గారోహణ రీతి తిరిగి చూడదేమైనా
పద్మవ్యూహమల్లే వెనుదిరుగనీయ దెటులైనా

1. తప్పు తెలుసుకున్నామన్నా-మరలిరాదులే గతము
తపములెన్ని చేసినా-మరల రాదు బాల్యము
మళ్ళీమొదలెట్టువీలు కల్పించదు జీవితం
వర్తమానాన్ని నీవు చేజార్చకు నేస్తము

2. నాటినుండి వ్యాయామం - చేస్తె కలుగునా చేటు
సమతులమిత ఆహారం- తింటె వచ్చునా ముప్పు
వ్యసనాలకు దూరముంటె- కలుగకుండుగా హాని
సమయోచిత నిర్ణయమే- భవితకిచ్చు హామీ

3. అమితవేగ చోదనం-అవకరమే మూల్యం
విచ్చలవిడి వ్యవహారం-ఆదాయమె కైంకర్యం
తేరగ దొరకుననే పేరాశ- ఫలితమే పతనం
పట్టుదల శ్రమలు కోర్చు-విజయమే కైవసం

Saturday, June 4, 2011

“జాతి నైజం”

“జాతి నైజం”
ప్రేమగా పెంచుకొన్న మల్లె తీగ
పక్కింటిలోకి పాకి పూలు పూసెగా
ముద్దుగా సాదుకున్న రామచిలుక
రెక్కలొచ్చాకచెప్పకుండ పారిపోయెగా

తిన్నింటి వాసాలే లెక్కించు నీ నైజం
కన్నీటి వరదలనే పారించు నా మోహం

1. ఆశించని నదిని సైతం చేస్తారా అపవిత్రం
ఫలమిచ్చే తరువును కూడ నరికేస్తే అదేమి చోద్యం
పంది మెచ్చు పంకాన్ని ఏల పన్నీటి జలకం
మార్చలేము వక్రమైతే శునకం వాలం వాలకం

అమ్మరొమ్ము గుద్దేటి విశ్వాస ఘాతుకం
వెకిలి నవ్వు నవ్వేటి వికృత పైశాచికం

2. ఇరువురికి మారుతుందా రెండిండ్ల మధ్యదూరం
తలోరీతి అనిపిస్తుందా స్నేహమనే పదానికర్థం
స్వీకారం మాత్రమే బంధాన్ని నిలుపుతుందా
పరస్పరం సూత్రమే పనికి రానిదవుతుందా

అందరినీ అన్నిసార్లు చేయలేముగా దగా
నిజాయితే లేనిచోట అనురాగం ఉండదుగా