Wednesday, August 31, 2011

బ్లాగ్వీక్షకులకు,మిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు!! “మోదకామోదకా-వినాయకా నమామ్యహం”



విఘ్నాలు తొలగించు వెనకయ్యా
నీకు వేనవేల వందనాలు అందుకోవయా
గండాలు తొలగించు గణపయ్యా
నీకు కోటి కోటి దండాలు సందుకోవయా
ఎలుకనెక్కి పరుగునొచ్చి గుజ్జు గణపతీ
వేగిరమే మముగావర బొజ్జ గణపతి

1. పేదా గొప్పా భేదమేది నీకు లేదయా
చిన్నాపెద్దా తేడాలేవీ ఎంచబోవయా
చేతులెత్తి మొక్కితే నీకు చాలయా
నినువినా దైవమే వేరు లేదయా
గుంజీలు తీస్తే మన్నింతువు
చెంపలేసుకొంటే క్షమియింతువు

2. గరికలేస్తె సిరులిత్తువు సిద్ది వినాయకా
మందారాల పూజిస్తే వరమిత్తువు కరిముఖా
వెలగపండు నందజేస్తె వేదన తొలగించేవు
మోదకాలు నివేదిస్తె మోక్షమే ఇచ్చేవు
లంబోదరా మము లాలించరా
వక్రతుండ వేగమే మమ్ము బ్రోవరా

Saturday, August 27, 2011

“పాంచజన్యం-అన్నా సౌజన్యం”

“పాంచజన్యం-అన్నా సౌజన్యం”

వినీలవీథిలో విజయ బావుటా
అవినీతి గుండెలో పేలెను తూటా
అన్నాహజారే ఆశయాల పూదోట
విరజిమ్మెను పరిమళాలు విశ్వమంతటా

1. ప్రభుత గాదె క్రింద మెక్కు పందికొక్కులు
ప్రజల ఓట్ల విశ్వాస ఘాతకులౌ కుక్కలు
పథకాలను పక్కదారి పట్టించే నక్కలు
మనభారత క్షేత్రాన మొలిచె కలుపు మొక్కలు

సస్యశ్యామలగు నిక మన భారతదేశం
యువతకిపుడు అన్నా హజారేనే ఆదర్శం

2. తేరగ మ్రింగే పరాన్న బుక్కులే కడతేరగా
బల్లకింద చెయిసాచే బల్లుల బలినీయగా
చీమలపుట్టలమెట్టే పాముల పనిపట్టగా
లంచాల పీడించే జలగల నలిపేయగా

అవతరించె జనలోక్పాల్ శిలాశాసనం
అవుతుందిక భారతమే ఇలలొ నందనం

3. అధికారం ఆసరగా అక్రమమౌ ఆర్జనలు
పదవుల ముసుగుతో పద్మనాభ సమనిధులు
రాజకీయచతురతతో అంతులేని దోపిడులు
తరతరాలు తరుగని మలిన నీలి ధనరాశులు

పాతర వేస్తుంది జనలోక్పాల్ చట్టము..
పాడుతుంది చరమగీతి ఇది సుస్పష్టము

Friday, August 26, 2011

"తిరుమల రాయ"

తిరుమల గిరిరాయ

కొండలు మోసిన కోనేటిరాయ
మాగుండెలందు కొలువుండు తిరుమలరాయ
అండదండనీవె మాకు కొండంత బలము నీవె
మా కోర్కెలు దీర్చేటి కొంగుబంగారమీవె

1. కూర్మావతారాన క్షీరసాగరాన
సురలగావ మోసావు మంధరగిరిని
కృష్ణావతారాన గోకులాన్ని గావగ
గోటిపైన మోసావు గోవర్ధన గిరిని
వరాహావతారాన ధరనే భరియించితివని
అరెరె అంతలోనే నేనేల మరచితిని

అండదండనీవె మాకు కొండంత బలము నీవె
మా కోర్కెలు దీర్చేటి కొంగుబంగారమీవె

2. కరిరాజ వరద ఆర్తత్రాణ బిరుద
తనపరభేదమేది నీకు లేదయా
ప్రహ్లాద రక్షకా శరణాగత వత్సల
పిలువగనే స్పందించే ఎదనే నీదయా
అగణిత నీ గుణగణాలు పొగడంగ అన్నమయా
ముప్పదిరెండు
వేల కీర్తనలు రాసెనయా

అండదండనీవె మాకు కొండంత బలము నీవె
మా కోర్కెలు దీర్చేటి కొంగుబంగారమీవె


Thursday, August 25, 2011

సంపద పదం

సంపద పదం

నీరాజనం క్షీరజ
జయ నీరాజనం చంద్ర సహజ
నీరాజనం హరివల్లభ
మంగళ నీరాజనం భక్త సులభ

1. నీ పదములొసగు కొదవలేని సంపదలు
నీ కరుణ కురియు సిరులే సిరులు
దయతో నువుబ్రోవగ భోగ భాగ్యమ్ములు
కృపతో నువుజూడగ ఆయురారోగ్యమ్ములు

2. అడుగిడితే సరి పాడీపంటలు నవధాన్యాలు
నీ పొడగంటే మరి అస్తీఅంతస్తులు నవనిధులు
నీదర్శన మాత్రాన కాసులు ధన రాశులు
కాలుమోపినంతనే తొలుకు కనక వర్షాలు

3. నీ చరణాలు శరణంటే మణి మాణిక్యాలు
నీ పాదాలు తలదాల్చితె శాంతీ సౌఖ్యాలు
నీవు కటాక్షిస్తే పదవులు అధికారాలు
ప్రేమమీర వీక్షిస్తే పేరూ ప్రఖ్యాతులు

Wednesday, August 24, 2011

“సరిలేరు సిరికెవ్వరు”


“సరిలేరు సిరికెవ్వరు”

వరలక్ష్మీ సుస్వరలక్ష్మీ ఈశ్వరలక్ష్మీ భాస్వరలక్ష్మీ
శ్రీ లక్ష్మీ వాణిశ్రీలక్ష్మీ విజయశ్రీలక్ష్మీ మాతృశ్రీలక్ష్మీ

దండాలు నీకివే దాక్షాయణి
గండాలు తొలగించవె గజవాహిని

1.      శ్రీలలితే -విస్తృత చరితే
మహిమాన్వితే-మహిషాసుర సంహృతే

నమోవాకాలు నీకు కాత్యాయిని
         వందనాలు నీకివే వరదాయిని

2.      ప్రణవప్రభవితే-ప్రమోద విలసితే
ప్రజ్ఞానదాయకే-శ్రీపథ దాయకే

ప్రణతులివే నీకు పరదేవతా
ప్రణుతులివే నీకు లోకపూజితా

3.      జయహే వాజ్ఞ్మయి-హే కరుణామయి
సదా చిన్మయి- సుజన మనోమయి

నమస్తే నమస్తే-నాదమయి
నమోస్తుతే-సచ్చిదానందమయి



భక్త’వ’శంకరా!

గళసీమ గరళాన్ని సహియించినావు
శిరమందు నభగంగ భరియించినావు

ఇంతకన్న ఏముంది తార్కాణం
భోళాశంకరా నీది సార్థక నామం

మహాదేవ మహాదేవ నీలకంధరా పాహి
వామదేవ వ్యోమకేశ గంగాధరా దేహి

1. పులితోలు వలువల్లె ధరియించినావు
నాగుల్ని నగలల్లె మెయి దాల్చినావు
భస్మాన్ని ఒళ్ళంత పులిమేసుకున్నవు
వృషభాన్ని తురగంగ ఊరేగినావు

ఇంతకన్న ఏముంది తార్కాణం
భోళాశంకరా నీది సార్థక నామం

సద్యోజాత తత్పురుషా భూతనాథ పాహి
ఈశానా అఘోరా అనాధ నాథ దేహి

2. నిలువనీడలేకనీవు కొండకోననుండేవు
ఊరువాడ విడిచివల్ల కాడున మసలేవు
తపమైన చేసెవు-చితులైన పేర్చేవు
మోదమైన క్రోధమైన చిందులేసి ఆడేవు

ఇంతకన్న ఏముంది తార్కాణం
భోళాశంకరా నీది సార్థక నామం
నిటలాక్ష నటరాజ విరూపాక్ష పాహి
పశుపతి ఫాలనేత్ర కాలభైరవా దేహి

3. ఇల్లిల్లు బిచ్చమెత్తి బొచ్చెలోన తింటావు
నీ కడలేనిదైన ఐశ్వర్యమునిస్తావు
అడిగితెఅనుచితమైనా అర్ధాంగి నిచ్చేస్తావు
అదియిదియనిగాదు ఆత్మనె అర్పిస్తావు

ఇంతకన్న ఏముంది తార్కాణం
భోళాశంకరా నీది సార్థక నామం

జంగమయ్య లింగమూర్తి ఋతంబరా పాహి
చంద్రమౌళి పింగళ పినాకపాణి దేహి

Tuesday, August 23, 2011

కృష్ణాష్టమి శుభాకాంక్షలతో...........


“కృష్ణ తృష్ణ”

లోకుల గాచిన గోకుల కృష్ణా-గోపికల వలచిన మోహన కృష్ణా
కాళియ మర్దన తాండవ కృష్ణా-గోవర్దన ధర గోపాల కృష్ణా

1. వెన్నతిన్నందుకా నీ మనసు మెత్తనాయె
మన్నుతిన్నందుకా మమతలు మొలకెత్తెనాయె
కన్నయ్య నినుజూడ కనులకెపుడు కొత్తనాయె
నినివీడి మనలేక నే కోవెల కొత్తునాయె

మురిపించబోకు నన్ను మురళీ కృష్ణా
మైమరపించకు నన్ను మీరా కృష్ణా

2. అమ్మ మనసు రంజింప ఆటలెన్నొ ఆడావు
అఖిలభువనభాండమ్ములు నోటిలోనె చూపావు
ధర్మసంస్థాపనకై ధరణిలోన వెలిసావు
కర్మసిద్ధాంతమెరుగ గీతను బోధించావు

మమకా’ర’మించ రారాదా రాధా కృష్ణా
విరమించ నీయవదే ఐహిక తృష్ణా కృష్ణా

Saturday, August 20, 2011

అమ్మలగన్నయమ్మ ’మాయ’మ్మ

అమ్మలగన్నయమ్మ ’మాయ’మ్మ

రాజరాజేశ్వరీ బాల త్రిపుర సుందరీ
ఈశ్వరీ జగదీశ్వరీ పరమేశ్వరీ భువనేశ్వరీ

క్షణముకొక్క పేరు నే తలచినా –నూరేళ్ళ జీవితం చాలదు
వేయినాల్కలున్న ఆదిశేషుడూ-నీ నామాలు లెక్కించ జాలడు

1. నిన్ను తెలియ యత్నించి బ్రహ్మ దేవుడు
భంగపాటు చెందినాడు కదానాడు

నీ మాయకు లోబడి అలనాడు మాధవుడు
యోగనిద్రలోనే మునిగి తేలినాడు

నీ మహిమల నెరుగకనే సదా శివుడు
అయినాడుగా సదా సాంబశివుడు

ముక్కోటి దేవతలూ నీకు భృత్యులు
సప్తమహాఋషులందరు నీ పాద దాసులు

ఘటికులంత నీ సేవకులైనప్పుడు-నేనెంతటి వాడినని ఈనా టెక్కులు
వేయిచేతులున్న కార్తవీర్యుడూ-అయిపోడా నీ ముందు శూన్యుడు

2. శాంకరి-మంగళ గౌరి-మాధవేశ్వరి
కామరూప- కామాక్షి-విశాలాక్షి

చాముండి-శృంఖలాదేవి-వైష్ణవి
జోగులాంబ-భ్రమరాంబ-మాణిక్యాంబ

ఏకవీరిక-మహాకాళిక-పురుహూతిక
గిరిజా సరస్వతి మహాలక్ష్మి

అష్టాదశ శక్తిపీఠ వాసిని
అష్టాదశ దుర్గుణ నిర్మూలిని

నా మనోవాక్కాయ కర్మలు-నీవే కావాలి జన్మజన్మలు
శరణాగతి నీవమ్మ ఎప్పుడు-నాపై దయ చూపించు గుప్పెడు








Sunday, August 14, 2011

65 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో_రాఖీ

65 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో_రాఖీ

బలిదానాల ఫలితమ్మే మన స్వాతంత్ర్యం
పోరాటాల విజయమ్మేఈ స్వేఛ్ఛాగీతం
జై బోలో స్వతంత్ర భారత మాతకీ
జైబోలో అమరుడైన ప్రతి నేతకీ-మన గాంధీ తాతకీ

1. సిపాయిలందరి తిరుగుబాటుతో-మొదలయ్యింది సంగ్రామం(-స్వతంత్ర సంగ్రామం)
మంగళ్ పాండే ఉరితీతే-పూరించింది సమర శంఖం
జై బోలో స్వతంత్ర భారత మాతకీ
జై బోలో ఝాన్సీలక్ష్మీబాయికి-తాంతియాతోపెకి

2. *రౌలట్ చట్టపు నిరసన తెలుపగ-కల్లాకపటం తెలియని ప్రజలు
జలియన్ వాలా బాగ్ లోనా- అసువులు బాసిరి ఎందరొ జనులు
జై బోలో స్వతంత్ర భారత మాతకీ
రాజ్ గురు భగత్ సుఖదేవ్ కి-చంద్రశేఖరాజాద్ కి

3. స్వరాజ్య వాదం వినిపించి-జాతీయతనే నాటారు
స్వదేశి వాడి విదేశి వీడి-ఉద్యమ స్పూర్తిని చాటారు
జై బోలో స్వతంత్ర భారత మాతకీ
జై బోలో లాల్ పాల్ బాల్ కీ-ఆంధ్రరత్నకు అల్లూరికీ

4. బ్రిటీష్ పాలన నిరసించి-సహాయమ్మునే నిరాకరించి
కొత్త రీతుల్లొ పోరాడారు-అహింస మార్గం వాడారు
జై బోలో స్వతంత్ర భారత మాతకీ
జైబోలో గోపాల క్రిష్ణగోఖ్లేకి-ఆంధ్రకేసరి టంగుటూరికి

5. దండియాత్రతో దండును నడిపి-ఉప్పెఉప్పెనగ తలపించారు
ముప్పు తప్పదని తెలిపారు-సత్యాగ్రహమే చేసారు
జై బోలో స్వతంత్ర భారత మాతకీ
జైబోలో రాజాజీ సర్దార్లకీ –భారతకోకిల సరోజినికీ

6. అజాద్ హింద్ ఫౌజ్ గా-భారత సైన్యం నిర్మించారు
సాయుధపోరే మార్గంగా-క్విటిండియాయని నినదించారు
జై బోలో స్వతంత్ర భారత మాతకీ
జై బోలో సుభాస్ చంద్ర బోస్ కీ-బూర్గులరామకృష్ణకి

7. జాతి వివక్షను కాలరాచి-అస్పృశ్యతనే రూపుమాపి
అహింసాయుధంవాడాడు-ఆదర్శంగా నిలిచాడు
జైబోలో మోహన్ దాస్ గాంధీకి
జై బోలో జాతిపిత మహాత్మగాంధీకీ-మన గాంధీ తాతకీ

జై బోలో స్వతంత్ర భారత మాతకీ
జైబోలో అమరుడైన ప్రతి నేతకీ-మన గాంధీ తాతకీ



(*)1919 లో చేయబడిన రౌలట్ చట్టం సంస్కరణల సత్ఫలితాలను తీవ్రంగా తగ్గించి వేసింది. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్వతిరేకంగా జరిగిన హిందూ-జర్మన్ కుట్ర, భారతదేశంలో మొదలయిన సాయుధ పోరాటాలలో జర్మన్ మరియు బోల్ష్విక్ ల పాత్ర ల పై విచారణచేయటానికి సామ్రాజ్య విధాన మండలి (ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్)చే నియమించ బడిన రౌలట్ అధికార సంఘం (రౌలట్ కమీషన్) సిఫార్సులకణుగుణంగా రౌలట్ పేరుపై ఈ చట్టం చేయబడినది. చీకటి చట్టంగా పరిగణింపబడిన రౌలట్ చట్టం వైస్రాయి పభుత్వానికి కుట్రని విచ్ఛినం చేయటానికనే సాకుతో వార్తాపత్రికలపై ఆంక్షలువిధించటం, రాజకీయ కార్యకర్తలను విచారణ లేకుండానే బహిష్కరించటం, సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రకు పాల్పడుతునారనే అనుమానంపై ఏ వ్యక్తినైనా ధృవీకరించకనే నిర్భంధించటం లాంటి విశేష అధికారాలను దకలు పరిచింది.

Friday, August 12, 2011

రాఖీ పూర్ణిమ రక్షాబంధన దినోత్సవ శుభా కాంక్షలతో..రాఖీ.





అన్నా చెల్లీ అభిమానాలు
అనురాగపు కొలమానాలు
కల్లకపటమేలేని పసి హృదయపు వైనాలు
ఒకరంటె ఒకరికెపుడు పంచప్రాణాలు

బంధాలు కానేరవు బంధనాలు
బాధ్యతలే మరువకు నీవు బ్రతికినన్నాళ్ళు
జరుపుకో హాయిగా రక్షా బంధనాలు
అందుకో నేస్తమా రాఖీ అభివందనాలు
అభినందన చందనాలు

1. ఇందిరమ్మ రక్షాబంధం-చందమామతో
గౌరీమాత రక్షాబంధం-విష్ణుమూర్తితో
సంతోషి రక్షాబంధం-శుభలాభులతో
యమునమ్మ రక్షాబంధం-యమరాజుతో

అన్నా చెల్లీ అభిమానాలు
అనురాగపు కొలమానాలు
కల్లకపటమేలేని పసి హృదయపు వైనాలు
ఒకరంటె ఒకరికెపుడు పంచప్రాణాలు


2. మల్లెతీగ అనుబంధం-అల్లుకున్న పాదుతో
కోయిలమ్మ అనుబంధం-లేమావి చివురులతో
మేఘమాల అనుబంధం-చల్లగాలి స్పర్శతో
వానచినుకు అనుబంధం-మట్టి పరిమళాలతో

అన్నా చెల్లీ అభిమానాలు
అనురాగపు కొలమానాలు
కల్లకపటమేలేని పసి హృదయపు వైనాలు
ఒకరంటె ఒకరికెపుడు పంచప్రాణాలు

Monday, August 1, 2011

ధర్మపురి వాసిని దయామృత వర్షిణి::కరినగర వాసిని-కనక వర్షిణి

ధర్మపురి వాసిని దయామృత వర్షిణి::కరినగర వాసిని-కనక వర్షిణి

దయామృత వర్షిణీ-చిన్మయ రూపిణి
శ్రీ చక్ర సంచారిణి-శ్రీ దేవీ-శ్రీ పీఠ సంవర్ధిని

1. అష్టదరిద్రనివారిణి-అష్టైశ్వర్యప్రదాయిని
అష్టలక్ష్మీ అవతారిణి-అభీష్ట వరదాయిని
నమోస్తుతే డోలాసుర సంహారిణి
నమోస్తుతే కోల్హాపుర నారాయణి

2. మాయా మోహిని-చంచలగామిని
సౌభాగ్య సంరక్షిణి-మంగళకారిణి
నమోస్తుతే నారసింహప్రియే
నమోస్తుతే ధర్మపురి నిలయే

3. కడలిపుత్రి కమలనేత్రి సంక్షేమ సంధాత్రి
మార్దవ గాత్రి మాధవ మైత్రి సకల జన సవిత్రి
నమోస్తుతే కౌశిక వాహిని
నమోస్తుతే కరినగర వాసిని