Sunday, September 25, 2011

మాయల మహంకాళి

మాయల మహంకాళి

చాలింక నీ కేళి-నను సేయకే గేలి
విసిగినాను నిన్నెంతొ బ్రతిమాలి
మారు అడగనికెంప్పుడు మతిమాలి

బుద్దినిస్తె ఎద్దునీయవు-ఎద్దునిస్తె బుద్దినీయవు
నీ మాయామర్మమేమొ బ్రహ్మకైన ఎరుగనీయవు
ఓ అమ్మా మాయమ్మా అమ్మలగన్నయమ్మా
ముగురమ్మల మూలపుటమ్మా

1. ఏమడిగితి నిను తల్లీ సుస్వరమే చాలంటిని
నే కోరిన దేమిటని సుమధురమౌ కంఠధ్వని
ప్రార్థించితి లయను నాలొ లయం చేయవేయని
రాజ్యమడుగలేదమ్మా శ్రుతి సరాగ మీయమంటిని

బుద్దినిస్తె ఎద్దునీయవు-ఎద్దునిస్తె బుద్దినీయవు
నీ మాయామర్మమేమొ బ్రహ్మకైన ఎరుగనీయవు
ఓ అమ్మా మాయమ్మా అమ్మలగన్నయమ్మా
ముగురమ్మల మూలపుటమ్మా

2. చందమామకైన నీవు మచ్చలు కలిగించినావు
రామదాసుకైన నాడు జైలు శిక్ష నిచ్చినావు
పోతన్నకు లభియించిన వైభోగములేమిటో
శేషప్పకు అందించిన సుఖ సంపదలేమిటో

బుద్దినిస్తె ఎద్దునీయవు-ఎద్దునిస్తె బుద్దినీయవు
నీ మాయామర్మమేమొ బ్రహ్మకైన ఎరుగనీయవు
ఓ అమ్మా మాయమ్మా అమ్మలగన్నయమ్మా
ముగురమ్మల మూలపుటమ్మా

3. సిరులిచ్చుడేమొగాని ఉన్నది ఊడ్చేసినావు
పేరొచ్చుడేమొగాని బద్నాము జేసినావు
ఉన్నచోట ఉంచవాయె ఉట్టికి ఎగిరించవాయె
నట్టనడిమి కడలిలోన నా నావ ముంచితివే

బుద్దినిస్తె ఎద్దునీయవు-ఎద్దునిస్తె బుద్దినీయవు
నీ మాయామర్మమేమొ బ్రహ్మకైన ఎరుగనీయవు
ఓ అమ్మా మాయమ్మా అమ్మలగన్నయమ్మా
ముగురమ్మల మూలపుటమ్మా

Wednesday, September 21, 2011

రాజన్న- మనసు వెన్న

రాజన్న- మనసు వెన్న

ఎన్నసొంటి మనసునీది ఎములాడ రాజన్న
ఎముకలేని సెయ్యినీది ఏదడిగిన ఇత్తువన్న

గంగనీళ్ళు తలన బోస్తె-సంబరపడిపోతావు
పత్తిరినీ నెత్తినెడితె-పరవసించి పోతావు

“గుండంల తానాలు నీకయ్యా-గండాదీపాలింక నీకయ్యా
కోడెమొక్కులిగొ నీకయ్యా-నిలువెత్తు బెల్లాలు నీకయ్యా||”

1. పామునైన ఏనుగునైన పావురంతొ సూసావు
సాలెపురుగైతేనేమి-మోచ్చమిచ్చి వేసావు
కోడికీ కోతికీ రాజభోగ మిచ్చినావు
సివరాత్రిన కుక్క సస్తె ముత్తినిచ్చినావు నీవు

గంగనీళ్ళు తలన బోస్తె-సంబరపడిపోతావు
పత్తిరినీ నెత్తినెడితె-పరవసించి పోతావు

“గుండంల తానాలు నీకయ్యా-గండాదీపాలింక నీకయ్యా
కోడెమొక్కులిగొ నీకయ్యా-నిలువెత్తు బెల్లాలు నీకయ్యా||”

2. ఎదిరించిన అర్జునునికి పాశుపతము నిచ్చావు
సెరణని నినుపట్టుకుంటె మార్కండేయు గాచావు
కన్నిచ్చిన తిన్ననికీ కైవల్యమునిచ్చావు
రాజన్నా పబ్బతంటె అండగ నీవుంటావు

గంగనీళ్ళు తలన బోస్తె-సంబరపడిపోతావు
పత్తిరినీ నెత్తినెడితె-పరవసించి పోతావు

“గుండంల తానాలు నీకయ్యా-గండాదీపాలింక నీకయ్యా
కోడెమొక్కులిగొ నీకయ్యా-నిలువెత్తు బెల్లాలు నీకయ్యా||”

3. భక్తికి నువ్వెప్పుడైన బంధీవై పోతావు
ఇవ్వరాని వరములైన ఇట్టే ఇచ్చేస్తావు
అడిగాడని రావణుడికి ఆలినైన ఇచ్చావు
ఆపైన పట్టుబడితె ఆత్మలింగమిచ్చావు

నీకన్న జాలిజూపు దైవమేది శంకరా
(మావంటి)దీనులకీవె ఆప్తుడవన లేదు మాకు శంకరా

“గుండంల తానాలు నీకయ్యా-గండాదీపాలింక నీకయ్యా
కోడెమొక్కులిగొ నీకయ్యా-నిలువెత్తు బెల్లాలు నీకయ్యా||”

Thursday, September 8, 2011

పరవశ దశ

పరవశ దశ

గణనాథ నీరూపమే-త్రిగుణాతీతము
వరదాత నీ గానమే శ్రవణానందము
విఘ్నేశ నీ నామనే భవ్య భవతారకం
కరివదన నీ చరణమే మాకు శరణం

1. తొలుతగనిన్నే కడకడ నిన్నే
ఆపద సంపదలన్నిట నిన్నే
ప్రతిపనికీ కడు శుభఫల మీయగ
పూజింతుము నిను శ్రద్ధాసక్తుల

2. నిదురలొ నిన్నేమేల్కొని నిన్నే
నిత్యము నిన్నే నిరతము నిన్నే
అనవరతముగా స్థిర సాధనగా
చేతుము స్వామీ నీ స్మరణమునే