Tuesday, December 20, 2011

https://youtu.be/-X9NLm6n_7s


ముక్కోటి ఏకాదశి వేడుక
చూడ శతకోటి నయనాలు చాలవిక
రంగరంగ వైభవంగ నరసింగరాయడు
అలరారుచున్నాడు ప్రహ్లాద వరదుడు
గోవిందా గోవింద గోవిందా గోవిందా

1. తొలికోడికూతకన్న ముందుగనే
మేలుకొన్నాడు స్వామి మేల్కొలుపగనే
పావన గోదారి తీర్థములో
జలకమాడినాడు తనివితీరగనే
పట్టుబట్టలేగట్టి పసిడి మకుటమేబెట్టి
వైజయంతి మాలవేసి మాలక్ష్మిని చేబట్టి
రంగరంగ వైభవంగ నరసింగరాయడు
అలరారుచున్నాడు ప్రహ్లాద వరదుడు
గోవిందా గోవింద గోవిందా గోవిందా

2. తీరైన పూలనన్ని ఏరేరి తెచ్చి
తీర్చిదిద్దినారు వేదికనీనాడు
ఉత్తరద్వారాభిముఖముగా శ్రీవిభుడు
సుఖాసీనుడైనాడు వజ్రనఖుడు
కన్నులకే విందుగా వేదనలకు మందుగా
ఎదలే చిందేయగా అందాల పందిరిలో
దర్శనమిస్తునేడు ధర్మపురీ ధాముడు
జన్మలు తరియింపజేయు శేషప్ప సన్నుతుడు
గోవిందా గోవింద గోవిందా గోవిందా

3. వేదమంత్రాలతో బ్రాహ్మణ పుంగవులు
గోవిందనామాలతొ అర్చకశ్రేష్ఠులు
భజనగీతాలతో సంగీత కారులు
జయజయధ్వానాలతొ నీ భక్తజనులు
మారుమ్రోగుతున్నది వైభవ మండపం
భువికే దిగివచ్చిందిట శ్రీ వైకుంఠపురం
రంగరంగ వైభవంగ నరసింగరాయడు
అలరారుచున్నాడు ప్రహ్లాద వరదుడు
గోవిందా గోవింద గోవిందా గోవిందా

Monday, December 19, 2011

ఏటా నీ జాతర-వేదనలకు పాతర

ఏటా నీ జాతర-వేదనలకు పాతర

పాతా నర్సిమ్మసామీ-నీకు పదివేల దండాలయ్యా
కొత్తానర్సిమ్మసామీ- నీకు కోటికోటి దండాలయ్యా
దరంపుర్ల వెల్సినావు-దయగల్ల తండ్రివీవు
లచ్చుమమ్మ తోటి నీవు లచ్చనంగ ఉన్నావు

1. పాతా నర్సిమ్మసామీ-నీకు పట్టేనామాలయ్యా
కొత్తానర్సిమ్మసామీ-నీకు కోఱామీసాలయ్యా
బాసికాలు నీవుకట్ట-కళ్ళారజూతుమయ్య
బత్తేరుసాలమాల -నీమెళ్ళొ వేతుమయ్య

2. పాతా నర్సిమ్మసామీ-నీకు ప్రతియేట జాతరాలయా
కొత్తానర్సిమ్మసామీ-నీకు ఏటేట ఉత్సవాలయా
కోనేట్లొ నీవూగడోలా-సంబరాలు మా గుండెల
ఏటేటా నీలగ్గం-మాబతుకులకొక సొర్గం

3. పాతా నర్సిమ్మసామీ-నీకు పప్పూబెల్లాలయ్యా
కొత్తానర్సిమ్మసామీ-నీకు కొబ్బారి కాయలయ్యా
గోదారిగంగలోన-తలనిండమునిగిమేము
తడిబట్టలారకుండ-గుడిజేర వస్తిమయ్య

4. పాతా నర్సిమ్మసామీ-నీకు పట్టూబట్టలయ్యా
కొత్తానర్సిమ్మసామీ-నీకు బుక్కాగులాలయ్యా
పిల్లామేకనెల్లప్పుడూ సల్లంగ జూడవయ్య
పాడిపంట మాకెప్పుడు-పచ్చంగనుంచవయ్య

5. పాతా నర్సిమ్మసామీ-నీకు మంచీ గంధాలయ్యా
కొత్తానర్సిమ్మసామీ- నీకు తులసీ దండలయ్యా
కట్టేల మోపుగట్టి-నెత్తీన మోసుకొస్తం
కొత్తాబియ్యంతొ-పాయసవండితింటం

6. పాతా నర్సిమ్మసామీ-నీవు శాంతమూర్తివయ్యసామీ
కొత్తానర్సిమ్మసామీ-నీవు ఉగ్రమూర్తివయ్యసామీ
యోగనారసిమ్మ నీవు-కోర్కెలన్ని దీర్చేవు
ఉగ్రనారసిమ్మ నీవు-అభయమ్మునొసగుతావు

Saturday, December 17, 2011

https://youtu.be/kiaKS3lA6Ig?si=Yyht1iioIfkoYGIs

నిత్య కళ్యాణం పచ్చతోరణం-ధర్మపురి అపర వైకుంఠం

ధర్మపురి నృసింహా-దయాపూర్ణబింబా
స్తంభ సంభవా స్వామీ వందనాలయా
జ్వలితనేత్ర నీకివే చందనాలయా

1.వైశాఖ శుద్ధ చతుర్దశి-గోధూళిశుభ ఘడియలలో
ప్రహ్లాదునిగావగ నీవు ఆవిర్భవించితివయ్యా
కరినగరం జిల్లాయందు-గోదావరి తీరమునందు
భవ్యమైన యోగ ముద్రతో ధర్మపురిన వెలసితివయ్యా
ఎదనివేదనలనందుకొనిమా వేదనలను తీర్చవయ్యా

2.ఫాల్గుణ శుద్ధ ద్వాదశినాడు-కళ్యాణమాడుతావు
హోళీనపుష్కరణియందున-డోలాల నూగుతావు
ధర్మసంస్థాపన జేయుచు ధర్మపుర వీధులయందు
పంచమీపర్వదినాన-రథమున ఊరేగుతావు
రెండు కళ్లు చాలవయ్యా నీ విభవము కనితరియించ

3.ధనుర్మాస ఏకాదశిన -వైకుంఠ దర్శనభాగ్యం
వైశాఖ ఏకాదశిన-అద్భుతమే చందనోత్సవం
కార్తీకపౌర్ణమి రోజున-కాంతులీను దీపోత్సవం
మాఘశుద్ధ పంచమినాడు-అలరించు వసంతోత్సవం
ధర్మపురిన నిత్యమూ కళ్యాణ వైభవమే-జాతరాసంబరమే

Friday, December 2, 2011

https://youtu.be/zH03-nkLCGc


ఏలరా ఏలరా నన్నింక నీవేల రావేలరా
ఏల రావేల ఈవేళ నీవేల రావేలరా

మురళీలోలా మువ్వగోపాలా
అలకలదీర్చగ ఓలలాడించు నీ రాసలీలలా

నా స్పూర్తిగ నిను నే తలచితిని
మనస్పూర్తిగనే కొలిచితిని

1. వాడల వాడల వెన్నమీగడల
జుర్రుకొన నీ కడుపు నిండగ

వెన్నెల రేయిల పొన్నల నీడల
వే్ల గోపికల కలలు పండగా

తనివిదీరగ తపనలారగ
అదమరచినావా నను మరచినావా

నా స్పూర్తిగ నిను నే తలచితిని
మనస్పూర్తిగనే కొలిచితిని

2. రాధకు రానీవదే విరహ వేదన
మీరాఎరుగనిదే నా వింత యాతన

యమునాతీరమునఈ సమయమున
బృందావనమున సుఖజీవనమున

మునిగితేలితివ మదనజనక
ముంచబోకు నను నా మనవి వినక

నా స్పూర్తిగ నిను నే తలచితిని
మనస్పూర్తిగనే కొలిచితిని