Tuesday, January 25, 2011

62వ, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో_రాఖీ “ఘన గణతంత్రం”

62వ, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో_రాఖీ

“ఘన గణతంత్రం”

ప్రాణాలకు తెగించి సాధించుకొన్నదీ స్వాతంత్ర్యం
మేధస్సులు మధించి రూపొదించుకొన్నదీ గణతంత్రం

మహామహుల త్యాగనిరతి-పోరాటాల ఫలశ్రుతి
అలుపెరుగని భరతజాతి
సంతరించుకొన్నది ఖండాంతరాల ఖ్యాతి

గాంధీ మహాత్ముని చలవ ఇది-అంబేడ్కర్ మహాశయుని కృషియే ఇది
వర్ధిల్లు భరతమాత జయహో జయహో-వందనాలు భరతమాత జయజయ జయహో

1. పౌరులకే పెద్దపీట-ఓటు హక్కు ఆయుధమిట
రాజ్యాంగాన లేనెలేదు అనువంశికత మాట
ప్రజలచే ప్రజలకొఱకు ప్రజలే పాలించుట
ప్రపంచానికే చూపెను సరికొత్త ప్రగతి బాట

గాంధీ మహాత్ముని చలవ ఇది-అంబేడ్కర్ మహాశయుని కృషియే ఇది
వర్ధిల్లు భరతమాత జయహో జయహో-వందనాలు భరతమాత జయజయ జయహో

2. అణగారిన వర్గాలకు అగ్రతాంబూలం
నిమ్నజాతి జనులకే నిత్య నీరాజనం
అల్పసంఖ్యాకులకిట ఆదరించు సదుపాయం
మహిళలకిట సాధ్యము సాధికార స్వావలంబనం

గాంధీ మహాత్ముని చలవ ఇది-అంబేడ్కర్ మహాశయుని కృషియే ఇది
వర్ధిల్లు భరతమాత జయహో జయహో-వందనాలు భరతమాత జయజయ జయహో

3. పంచవర్ష ప్రణాళికలు-ఆర్థికరుగ్మత గుళికలు
అభ్యున్నతి పథకాలు-అభివృద్ధికి బాసటలు
ఉచితాలు రాయితీలు ఋణబకాయి రద్దులు మద్దతులు
బడుగూ బలహీనులకు బ్రతుకు దిద్దు పద్ధతులు

గాంధీ మహాత్ముని చలవ ఇది-అంబేడ్కర్ మహాశయుని కృషియే ఇది
వర్ధిల్లు భరతమాత జయహో జయహో-వందనాలు భరతమాత జయజయ జయహో

’అం-ద’-“మా!-నం-ద-మా-యె-నే”!!

’అం-ద’-“మా!-నం-ద-మా-యె-నే”!!

నిలువెల్లా కనులున్నా తనిదీరదే చెలీ నినుజూడ
పదివేలా నాలుకలే సరిపోవే సఖీ నిను పొగడ
అంద మంటె నీ దేలే- ఆనందం నీ వల్లే

1. పోతపోసిన అపరంజి బొమ్మవే నీవు
పూతపూసిన విరజాజి కొమ్మవే నీవు
సీతాకోక చిలుకవె నీవు-మకరందం చిలుకవె నీవు
పంచవన్నెల చిలుకవె నీవు-తేనెలొలుక పలుకవె నీవు
సౌందర్యం నీదేలే-ఆహ్లాదం నీవల్లే

2. నడయాతున్న హరివిల్లువేలే నీవు
అమవాస్య లేరాని జాబిల్లివేలే నీవు
శ్వేతవర్ణ కోకిల నీవు-మధుర గీతి నాకిల నీవు
ఆరుకారులా ఆమని నీవు-ఆరని కర్పూర హారతి నీవు
హొయలంటె నీదేలే-హర్షమంత నీవల్లే