Tuesday, May 24, 2011

“త్వమేవాహం”

“త్వమేవాహం”

మనసంతా నీవే నిండిపోతే-ప్రేమకింక తావేది
బ్రతుకంతా నీవే ఉండిపోతె-నీది కాని బ్రతుకేది
ఓ నేస్తమా!ఏదీ నా ఉనికి
నేనేనీవై పోయా చివరికి

1. ప్రేమలూ పెళ్లిళ్లు అల్పమైన విషయాలు
బాధలూ కన్నీళ్లూ-నవ్వుకొనే సంగతులు
అనుభవాలు నీవైనా-అనుభూతులు నావేగా
ఒడిదుడుకులు నీవైనా-స్పందనలు నావేగా

ఓ నేస్తమా!ఏదీ నా ఉనికి
నేనేనీవై పోయా చివరికి

2. నా తలపుల మెదిలేది-నీ ఊహలే
నేను కనే కలలన్నీ-నీ ఆశలే
ప్రయత్నాలు నీవైనా –ఫలితాలు నావేగా
విక్రమమే నాదైనా-విజయాలు నీవేగా

ఓ నేస్తమా!ఏదీ నా ఉనికి
నేనేనీవై పోయా చివరికి

3. అర్థించడాలు-మన్నించడాలు- అర్థరహితాలే మన జగతిలో
ద్వేషించడాలు-వేధించడాలు- దొరకనిపదాలే-మన భాషలో
పెదాలే నీవైనా హాససుధలు నావేలే
పదాలే నావైనా స్మృతులు కృతులు నీవేలే

ఓ నేస్తమా!ఏదీ నా ఉనికి
నేనేనీవై పోయా చివరికి