Sunday, June 12, 2011

కల-కాలం

కల-కాలం

కాలమెంత కఠినమైనది
బ్రతుకెంత జటిలమైనది
స్వర్గారోహణ రీతి తిరిగి చూడదేమైనా
పద్మవ్యూహమల్లే వెనుదిరుగనీయ దెటులైనా

1. తప్పు తెలుసుకున్నామన్నా-మరలిరాదులే గతము
తపములెన్ని చేసినా-మరల రాదు బాల్యము
మళ్ళీమొదలెట్టువీలు కల్పించదు జీవితం
వర్తమానాన్ని నీవు చేజార్చకు నేస్తము

2. నాటినుండి వ్యాయామం - చేస్తె కలుగునా చేటు
సమతులమిత ఆహారం- తింటె వచ్చునా ముప్పు
వ్యసనాలకు దూరముంటె- కలుగకుండుగా హాని
సమయోచిత నిర్ణయమే- భవితకిచ్చు హామీ

3. అమితవేగ చోదనం-అవకరమే మూల్యం
విచ్చలవిడి వ్యవహారం-ఆదాయమె కైంకర్యం
తేరగ దొరకుననే పేరాశ- ఫలితమే పతనం
పట్టుదల శ్రమలు కోర్చు-విజయమే కైవసం