Wednesday, September 21, 2011

రాజన్న- మనసు వెన్న

రాజన్న- మనసు వెన్న

ఎన్నసొంటి మనసునీది ఎములాడ రాజన్న
ఎముకలేని సెయ్యినీది ఏదడిగిన ఇత్తువన్న

గంగనీళ్ళు తలన బోస్తె-సంబరపడిపోతావు
పత్తిరినీ నెత్తినెడితె-పరవసించి పోతావు

“గుండంల తానాలు నీకయ్యా-గండాదీపాలింక నీకయ్యా
కోడెమొక్కులిగొ నీకయ్యా-నిలువెత్తు బెల్లాలు నీకయ్యా||”

1. పామునైన ఏనుగునైన పావురంతొ సూసావు
సాలెపురుగైతేనేమి-మోచ్చమిచ్చి వేసావు
కోడికీ కోతికీ రాజభోగ మిచ్చినావు
సివరాత్రిన కుక్క సస్తె ముత్తినిచ్చినావు నీవు

గంగనీళ్ళు తలన బోస్తె-సంబరపడిపోతావు
పత్తిరినీ నెత్తినెడితె-పరవసించి పోతావు

“గుండంల తానాలు నీకయ్యా-గండాదీపాలింక నీకయ్యా
కోడెమొక్కులిగొ నీకయ్యా-నిలువెత్తు బెల్లాలు నీకయ్యా||”

2. ఎదిరించిన అర్జునునికి పాశుపతము నిచ్చావు
సెరణని నినుపట్టుకుంటె మార్కండేయు గాచావు
కన్నిచ్చిన తిన్ననికీ కైవల్యమునిచ్చావు
రాజన్నా పబ్బతంటె అండగ నీవుంటావు

గంగనీళ్ళు తలన బోస్తె-సంబరపడిపోతావు
పత్తిరినీ నెత్తినెడితె-పరవసించి పోతావు

“గుండంల తానాలు నీకయ్యా-గండాదీపాలింక నీకయ్యా
కోడెమొక్కులిగొ నీకయ్యా-నిలువెత్తు బెల్లాలు నీకయ్యా||”

3. భక్తికి నువ్వెప్పుడైన బంధీవై పోతావు
ఇవ్వరాని వరములైన ఇట్టే ఇచ్చేస్తావు
అడిగాడని రావణుడికి ఆలినైన ఇచ్చావు
ఆపైన పట్టుబడితె ఆత్మలింగమిచ్చావు

నీకన్న జాలిజూపు దైవమేది శంకరా
(మావంటి)దీనులకీవె ఆప్తుడవన లేదు మాకు శంకరా

“గుండంల తానాలు నీకయ్యా-గండాదీపాలింక నీకయ్యా
కోడెమొక్కులిగొ నీకయ్యా-నిలువెత్తు బెల్లాలు నీకయ్యా||”