Saturday, October 29, 2011

తెలంగాణం శివమయం

తెలంగాణం శివమయం

ఎములాడ రాజన్న కొమురెల్లి మల్లన్న
కొత్తకొండ ఈరభద్రన్నా-నీకు కోటికోటి దండాలోరన్నా
పిల్లామేకా సల్లగజూడు-పాడీపంటా పచ్చగ జూడు
రవ్వంతనీదయ ఉంటే రాజన్నా-రపరపలే ఉండవింక రాజన్న
జరంత కనికరిస్తెనూ మల్లన్నా-జనమంత జబర్దస్తెగా మల్లన్న

1. సేనుసెలకలల్ల నీళ్లబొట్టులేక-పంటమాడిపోయెరా రాజన్నా
మా కడుపుల్ల మంటాయె- కంటేమొ నీరాయెరా
బావుల్ల సెరువుల్ల ఊటైనలేక-గొంతెండిపోతోందిరా మల్లన్నా
తాగనీకి ఒకసుక్కలేదాయె-నాలికింక పోడిబారిపోయే
తలమీద గంగమ్మ తాలాపు గోదారి నీమాట ఇనకుందురా
నువ్వు తల్సుకొంటె నీకు లెక్కకాదురా
మా తప్పు మన్నించి మమ్మింక కావర గంగాధరా
సిరులెల్ల కురిపించి వరముల్ని -మాకిచ్చి మముబ్రోవర శంకరా

2. మారు మూలనుంచి దూరాలుపారొచ్చి నిను జేరమేమొస్తిమి రాజన్న
మారాజు నీవంటిమి మమ్మేలు దొరవంటిమి
కడగండ్లు తొలగించి కష్టాలు కడతేర్చి కాపాడమనియంటిమి మల్లన్నా
మనసారా నమ్మితిమి నిన్నింక మదిలొనకొల్చితిమి
సెరణంటు నినువేడ బాలుణ్ని బతికించిన కథమేము విన్నామురా
నీ మైమల్ని ఎరిగేమురా నీలీలలనికన్నామురా
దయగల మాతండ్రి నీవేనురా ధర్మప్రభువింక నువ్వేనురా
దీనులపాలిటి దిక్కు నువ్వేరా-పేదల పాలిటి పెన్నిధివేరా

వేములవాడ వైభవం

వేములవాడ వైభవం
అదిగదిగో వేములవాడ-అల్లదిగో మన రాజన్న జాడ
ఎదిరెదిరి చూసిన ఘడియ అంతలోనె వచ్చింది
ఎన్నాళ్లకోరికనో ఈడేరబోతోంది

1. తెలంగాణ నట్టనడిమిలో-కరినగరం జిల్లాలో
అలరారుతోంది రాజన్న వెలసిన క్షేత్రం
కాశీకైలాసం కన్నా ఇది ఎంతో పరమ పవిత్రం

2. అడుగడుగున ఆలయాలు-శివుడికి అవి నిలయాలు
ధూళిదుమ్ముసైతం రాజన్న పాదరేణువే
ఏరాయి తాకినా ఆసామి స్థాణువే

3. ధర్మగుండ స్నానాలు ముడుపుల తలనీలాలు
కోడె మొక్కు తీర్చడాలు-గండా దీపాలు
తులాభార బంగారాలు- దానాలు ధర్మాలు

4. ఇటుపక్కన సిద్దిగణపతి-కుడిపక్కన రాజేశ్వరి
ఇద్దరి మధ్యన నందికెదురుగా ఈశ్వరుడు
దర్శనమిచ్చును మన రాజరాజేశ్వరుడు

5. హరిహరులకు ఆలవాలము-కులమతముల లేదు భేదము
రామపద్మనాభులు కొలువున్న శైవమందిరం
మహ్మదీయ దర్గాసైతం కోవెలలో దర్శనీయం

6. చాళుక్యుల చెక్కణాలు –చెదరిపోని కుడ్యాలు
పంపకవి ప్రాభవాలు భీమకవి విభవాలు
సంగీత సాహితీ దురంధరుల చేవ్రాలు

7. రాజన్న గోపురాలు కాంతులీను శిఖరాలు
భీమేశ్వర నగరేశ్వర బద్దిపోచమ్మ గుళ్లు
వెములాడ చూడ చూడ చాలవింక రెండు కళ్ళు