Monday, December 19, 2011

ఏటా నీ జాతర-వేదనలకు పాతర

ఏటా నీ జాతర-వేదనలకు పాతర

పాతా నర్సిమ్మసామీ-నీకు పదివేల దండాలయ్యా
కొత్తానర్సిమ్మసామీ- నీకు కోటికోటి దండాలయ్యా
దరంపుర్ల వెల్సినావు-దయగల్ల తండ్రివీవు
లచ్చుమమ్మ తోటి నీవు లచ్చనంగ ఉన్నావు

1. పాతా నర్సిమ్మసామీ-నీకు పట్టేనామాలయ్యా
కొత్తానర్సిమ్మసామీ-నీకు కోఱామీసాలయ్యా
బాసికాలు నీవుకట్ట-కళ్ళారజూతుమయ్య
బత్తేరుసాలమాల -నీమెళ్ళొ వేతుమయ్య

2. పాతా నర్సిమ్మసామీ-నీకు ప్రతియేట జాతరాలయా
కొత్తానర్సిమ్మసామీ-నీకు ఏటేట ఉత్సవాలయా
కోనేట్లొ నీవూగడోలా-సంబరాలు మా గుండెల
ఏటేటా నీలగ్గం-మాబతుకులకొక సొర్గం

3. పాతా నర్సిమ్మసామీ-నీకు పప్పూబెల్లాలయ్యా
కొత్తానర్సిమ్మసామీ-నీకు కొబ్బారి కాయలయ్యా
గోదారిగంగలోన-తలనిండమునిగిమేము
తడిబట్టలారకుండ-గుడిజేర వస్తిమయ్య

4. పాతా నర్సిమ్మసామీ-నీకు పట్టూబట్టలయ్యా
కొత్తానర్సిమ్మసామీ-నీకు బుక్కాగులాలయ్యా
పిల్లామేకనెల్లప్పుడూ సల్లంగ జూడవయ్య
పాడిపంట మాకెప్పుడు-పచ్చంగనుంచవయ్య

5. పాతా నర్సిమ్మసామీ-నీకు మంచీ గంధాలయ్యా
కొత్తానర్సిమ్మసామీ- నీకు తులసీ దండలయ్యా
కట్టేల మోపుగట్టి-నెత్తీన మోసుకొస్తం
కొత్తాబియ్యంతొ-పాయసవండితింటం

6. పాతా నర్సిమ్మసామీ-నీవు శాంతమూర్తివయ్యసామీ
కొత్తానర్సిమ్మసామీ-నీవు ఉగ్రమూర్తివయ్యసామీ
యోగనారసిమ్మ నీవు-కోర్కెలన్ని దీర్చేవు
ఉగ్రనారసిమ్మ నీవు-అభయమ్మునొసగుతావు