Tuesday, December 20, 2011

https://youtu.be/-X9NLm6n_7s


ముక్కోటి ఏకాదశి వేడుక
చూడ శతకోటి నయనాలు చాలవిక
రంగరంగ వైభవంగ నరసింగరాయడు
అలరారుచున్నాడు ప్రహ్లాద వరదుడు
గోవిందా గోవింద గోవిందా గోవిందా

1. తొలికోడికూతకన్న ముందుగనే
మేలుకొన్నాడు స్వామి మేల్కొలుపగనే
పావన గోదారి తీర్థములో
జలకమాడినాడు తనివితీరగనే
పట్టుబట్టలేగట్టి పసిడి మకుటమేబెట్టి
వైజయంతి మాలవేసి మాలక్ష్మిని చేబట్టి
రంగరంగ వైభవంగ నరసింగరాయడు
అలరారుచున్నాడు ప్రహ్లాద వరదుడు
గోవిందా గోవింద గోవిందా గోవిందా

2. తీరైన పూలనన్ని ఏరేరి తెచ్చి
తీర్చిదిద్దినారు వేదికనీనాడు
ఉత్తరద్వారాభిముఖముగా శ్రీవిభుడు
సుఖాసీనుడైనాడు వజ్రనఖుడు
కన్నులకే విందుగా వేదనలకు మందుగా
ఎదలే చిందేయగా అందాల పందిరిలో
దర్శనమిస్తునేడు ధర్మపురీ ధాముడు
జన్మలు తరియింపజేయు శేషప్ప సన్నుతుడు
గోవిందా గోవింద గోవిందా గోవిందా

3. వేదమంత్రాలతో బ్రాహ్మణ పుంగవులు
గోవిందనామాలతొ అర్చకశ్రేష్ఠులు
భజనగీతాలతో సంగీత కారులు
జయజయధ్వానాలతొ నీ భక్తజనులు
మారుమ్రోగుతున్నది వైభవ మండపం
భువికే దిగివచ్చిందిట శ్రీ వైకుంఠపురం
రంగరంగ వైభవంగ నరసింగరాయడు
అలరారుచున్నాడు ప్రహ్లాద వరదుడు
గోవిందా గోవింద గోవిందా గోవిందా