Saturday, January 21, 2012

నిగళ గళ హరా!

నిగళ గళ హరా!

స్వరవరమే కోరితి-ఈశ్వర ప్రవరమే కోరితి
అనవరతముగా గానమె వ్రతముగ
జన్మజన్మలుగ నిను ప్రార్థించితి

1. పదములనొదలక-పదముల పాడితి
శ్రుతులను తప్పక-కృతుల నుతించితి
లయతోలయమై-భావ నిలయమై
గీతార్చననే ప్రీతిగ జేసితి

2. గరళ గళ హే –కళాధర హర
సరళ హృదయ-ఏదీ నీదయ
మధురతరమగు –మధుధార మజ్జింతు
మాధుర్య రసరమ్య గాత్రము నర్థింతు

Monday, January 16, 2012

దయగల్ల మారాజు రాజన్న

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

అంతవాడివని ఇంతవాడివని -ఎంతెంతొ పొగిడాను రాజన్నా
నిన్నెంతెంతొ పొగిడాను రాజన్నా
నమ్మిన వాడిని నట్టెట ముంచుట
నీకైతె తగదయ్య స్వామి-రవ్వంత దయజూడవేమి

1. పరమదయాళుడ వీవేనంటూ
పదివేల మందికి చెప్పినానయా-నిదర్శనాలెన్నొ చూపినానయా
కరుణాసాగరుడ వీవేనంటూ
కనబడ్డవారికి చెప్పినానయా -నీలీలలెన్నెన్నొ చాటినానయా
భోలాశంకర ననుపరీక్షించగ
నీకింక తగదయ్య స్వామీ- రవ్వంత దయజూడుస్వామి

2.దానవుల సైతం ప్రేమతొ బ్రోచే
వెన్నంటిమనసు నీదంటిని-నిన్నే నమ్ముకొంటిని
దోషాల నెంచక శరణాగతినిచ్చే
భక్త సులభుడ వీవంటిని-నిన్నే వేడుకొంటిని
గరళకంఠ నా కడగండ్లు తొలగింప
పరుగుపరుగున రావేమి- రవ్వంత దయజూడుస్వామి

3. ఆకలిగొనియున్న నన్నాదరించి
కడుపునిండ బువ్వ పెట్టినావు-కోరిన వరముల నిచ్చినావు
సంబరపడతూ అదమరచినేనుంటె
వీపుమీద చఱిచి కొట్టినావు-కొత్తకొత్త కష్టాలు తెచ్చినావు
త్రిపురాసురసంహారి-హే సంకటహారీ
మొరవిని ననుగావ రావేమి-రవ్వంత దయజూడు స్వామి

Wednesday, January 11, 2012

నందివాహన నమోనమః

నందివాహన నమోనమః

కోడె నెక్కి ఊరేగే వాడ
రాజన్నా-నీవుండెతావిల వేములవాడ
కళ్లురెండు చాలవయ్య నిన్నుజూడ
పిలిచిన పలికే తండ్రి రాయేశుడ

1. మొదటిగ మొక్కేటి గణపతి నీకు
ముద్దులొల్కె పెద్ద కొడుకేనంట
గారాలమారాజు నెమిలివాహనుడు
కుమారస్వామే ప్రియ పుత్రుడంట

గంగమ్మతల్లినీ తలమీదకొలువుండ
రాజేశ్వరమ్మ నే నీ సగమై వెలుగొంద

కళ్లురెండు చాలవయ్య నిన్నుజూడ
పిలిచిన పలికే తండ్రి రాయేశుడ -వెములాడ రాయేశుడ

2. ఇంటి చుట్టు ఎటుజూసిన పెన్నగములే
ఒంటినిండ నగలన్నీ పన్నగములే
సిగలొతురిమినావంట చంద్రయ్యనే
మనసు నిండ పొంగిపొర్లు దయాసంద్రమే


సింగారాల శివరాయా సిత్రము నీ నగవే
చర్మాంబరదారి నీ రూపము గనగ వరమే

కళ్లురెండు చాలవయ్య నిన్నుజూడ
పిలిచిన పలికే తండ్రి రాయేశుడ-వెములాడ రాయేశుడ

Thursday, January 5, 2012

నరహరి(యశః)శోభాయాత్ర

నరహరి(యశః)శోభాయాత్ర

ఊరేగెను (ధర్మ) పురవీథుల యోగనారసింహుడు
తీరొక్క వాహనముల శ్రీలక్ష్మీనరసింహుడు
ప్రతిముంగిట అందుకొనుచు జననీరా జనములు
కురిపించుచు తరలెను కటాక్షవీక్షణామృతములు

1. సన్నాయి మేళమే చెవులకు చవులూరించగ
డప్పువాద్యకారులే గొప్ప ప్రజ్ఞ కనబరచగ
డోలుమోతలింపుగా జనపదముల కదిలింపగ
కంజర నాదమ్ములోఎద తన్మయమొందగా

2. చిఱుతలువాయించుచూ హరిదాసులు పాడగ
కోలాటములాడుచు తరుణులు నర్తించగా
నీభక్తజనులందరు భజనల నినుకీర్తించగ
చతుర్వేద పారాయణ భూసురులొనరించగ

3. ఉగ్రనృకేసరీయుతముగ వేంకటపతి సహితముగ
అశ్వ సింహ హస్తి హనుమ గరుడ వాహనమ్ముల
గోపికల వలువలదోచు పొన్నచెట్టు కన్నయ్యగ
కుంటివాడిఇంటికేగు భగీరథీ చందంబుగ