Saturday, February 18, 2012

మహాశివరాత్రి పర్వదినమున మిత్రులకు, బ్లాగు వీక్షకులకు.శ్రేయోబిలాషులకు,స్పూర్తి దాతలకు రాఖీ శుభాకాంక్షలు! “వేములవాడ రాజన్న ఊరూరా వాడవాడ అందించాలి జనులందరికీ కూడు గుడ్డ నీడ!!” రాజన్న రాజసం

మహాశివరాత్రి పర్వదినమున మిత్రులకు, బ్లాగు వీక్షకులకు.శ్రేయోబిలాషులకు,స్పూర్తి దాతలకు రాఖీ శుభాకాంక్షలు!
“వేములవాడ రాజన్న ఊరూరా వాడవాడ
అందించాలి జనులందరికీ కూడు గుడ్డ నీడ!!”
రాజన్న రాజసం
నువ్వంటే ఎందరికో ఎంత గురి రాజన్న-వేములవాడ రాజన్న
నీవల్లనె ఎందరికో తరగని సిరి రాజన్న
కోట్లాది భక్తుల కొంగుబంగారమీవె
ఎనలేని జనులకు ఆరాధ్య దైవమీవె

1. నీడ కొరకు గూడు నల్లి మాడిపోయె సాలీడు
మూఢభక్తి గొడవలోన ప్రాణాలిచ్చె కరినాగులు
తలనీలాలిచ్చేరు నేడూ తన్మయముగ రాజన్న
నిలువుదోపిడిచ్చేరు నియమముతో రాజన్న
నీవంటే ఎందరికో గుడ్డి గురి రాజన్న
నిను నమ్మితె ఎందరికో మోక్షపాప్తి రాజన్న

2. నరాలతో రుద్రవీణ వాయించె రావణుడు
శరాలనే సంధించి మెప్పునొందె అర్జునుడు
పతినీవని కొందరింక భావింతురు రాజన్న
గతినీవని జన్మంతాఅర్పింతురు రాజన్న
నీవంటే ఎందరికో వింత గురి రాజన్న
నీ దయతో ఎందరికో వరముల ఝరి రాజన్న

3. కంటిబాధ చూడలేక కన్నిచ్చె తిన్నడు
శరణనగనె చిరాయువొందె బాలమార్కండేయుడు
ముడుపుగట్టి కోర్కెదీర చెల్లింతురు రాజన్న
కోడెను గట్టి సంతతి నొంది సంతస మొందురు రాజన్న
నీవంటే ఎందరికో పిచ్చి గురి రాజన్న
నీచెంత ఎందరికో నిర్భీతి రాజన్న

4. కమలార్చన గణన తగ్గ నయనకమలమిచ్చె హరి
భస్మాసుర బారినిగావ మోహినిగా మారె మరి
శివకేశవ భేదమే లేదుకదా రాజన్న
హరిహరసమ తత్వమే అద్వైతముకద రాజన్న
దోసెడు నీళ్లు నిర్మలభక్తి నీకుచాలు రాజన్న
పిడికెడు పత్రే నీకైతె తృప్తే వెములాడ రాజన్న

Wednesday, February 15, 2012

https://youtu.be/xJFhTmysg_k?si=daBxNr-XwlRCoFKq


నీకు గాక ఎవ్వరికని చెప్పుకోను నా బాధ
నీవుదప్ప దిక్కెవ్వరు సదాశివా నాకు సదా
నిన్ను మించి వేరెవ్వరు ఎరుగరయ్య వెతల కత
వేడగనే స్పందించే దైవమే నీవు కదా
అరుణాచల అరుణాచల అరుణాచల పరమ శివ

1. గరళము కబళింపబోగ గళమునందు నిలిపినావు
గంగమ్మ దూకుడునే సిగలో బంధించినావు
లోకాలను వణికించిన త్రిపురాసురు వధియించినావు
శోకాలను పరిమార్చగ వెములాడన వెలిసినావు
రాజన్నా రాజన్నా వెన్నమనసు రాజన్న

2. వరములు నేనడుగలేదు రావణాసురుడి వోలె
ప్రాణభిక్ష నడుగలేదు మార్కండేయునోలె
పాశుపతము నర్థించలె అల పార్థునికి మల్లె
మననీయమంటిని నను నీ పాదరేణువల్లె
రామలింగ రామలింగ ధర్మపురిశ్రీ రామలింగ

https://youtu.be/HE1x-iwUF7g?si=7-D58Nx7T39Lkc_t


గూడు చెదిరిపోయింది
మేడ నేల కూలింది
బంగారు కల నేడే కరిగి చెరిగి పోయింది
ఆశయాల పూదోట బీడుగా మారింది-వల్లకాడుగా మారింది

1. చల్లనైన సంసారం జనుల కన్నుకుట్టింది
పచ్చనైన కాపురం దిష్టి తగిలి మాడింది
తెలియని ఏదేని శాపమే తగిలెనో
పూర్వజన్మ పాపమే వీడక వెంటాడెనో
ప్రతి క్షణమూ మరణమై-అనుదినమూ నరకమై
బ్రతుకేదుర్భరమైపోయింది-మనుగడయే ప్రశ్నగా మిగిలింది

2. పరిష్కారమే లేని సమస్యలే ఎదురాయె
ప్రమేయమే లేకున్నా ప్రతిచర్యకు బాధ్యతాయె
ప్రాణమెఫణమన్ననూ ఫలితం శూన్యమాయె
సృష్టిలొ ఏ శక్తీ భవిష్యత్తు మార్చదాయె
అనునయముతొ నయమాయేనా?-సానుభూతి సాయమాయేనా?
కాలకేళిలో నందమొందాలి-హాలహలమల్లె మ్రింగాలి

Tuesday, February 14, 2012

అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా

కరుణ ధార కురిపించే అరుణాచల శివ
మరణబాధ తొలగించే అరుణాచల శివ
విశ్వవ్యాప్త విమల రూప తేజోలింగ శివ
ఆదిమద్యాంత రహిత హే పరమ శివా
అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా

1. మాయమ్మ అన్నపూర్ణ ఆలి కదా నీకు
ఈ కలిలో ఆకలి కేకల కలతల నీయ మాకు
బిక్షమెత్తైనసరే ఎవరిని పస్తుంచబోకు
బిచ్చములో బిచ్చమట రాజేశుని బిచ్చమట
ఋజువు పఱచు క్షుద్బాధ తీర్తువన్న మాట
అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా

2. దిగంబరా త్రయంబకా హే త్రిపురారీ
సుశరీర దాయక జటాఝూట ధారీ
రుజలు రుగ్మతలు వ్యాధులు పరిమార్చరా
మహామృత్యుంజయా శంభో సుధాంశ శేఖరా
అపమృత్యుహాని మాపి ఆరోగ్యమీయరా
అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా

3. పంచభూతాత్మకా ఆకసలింగా చిదంబరా
పంచానన వాయులింగ శ్రీకాళహస్తీశ్వరా
పంచప్ర్రాణాధిపా తేజోలింగ అరుణాచలేశ్వరా
పంచభాణధారిహారి జలలింగ జంబుకేశ్వరా
పంచేంద్రియపాలక పృథ్విలింగ ఏకామ్రేశ్వరా
అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా

4. చిదానంద రూప సదానంద దాతా
భస్మ చందనార్చిత భవబంధ మోచక
త్రిశూలపాణీ కపర్దీ కపాల ధారి
సన్మార్గ బోధక జగద్గురో చంద్ర మౌళీ
నటరాజ హఠయోగీ అందుకో హృదయాంజలి
అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా