Monday, June 18, 2012


“అనురాగిణి “
గుండె తావే ఔదార్యం –గొంతు తావే  మాధుర్యం..( తావు-తావి )
అనునాదం బహు సౌందర్యం –నీవు పాడితే పాటకు ధైర్యం

ఓ రూపు దాల్చిన గీతమా- పాదాభివందనం
ఓ చెలిమి పంచిన నేస్తమా-స్నేహాభినందనం

1.       వెదక బోయిన తీగలాగా తారసిల్లినావే
ఎదుట నిలిచి స్వరనిధివీవై వరములిచ్చినావే
గమకాలు సంగతులన్నీ – అలవోకగ పలికించావే
అనుభూతులు భావాలన్నీ – పన్నీరుగ చిలికించావే

ఓ సంగీత శారదా –శిరసు వంచేను సదా
ఓ ప్రత్యక్ష భారతీ –నీ భక్తుడనైతి కదా

2.       అక్షర సుమ మాలికతో అలరించెద నిన్ను
పదముల మధు ఫలములనే నివేదింతు నీకు
కవితల గేయాల హారతుల౦దించెద నీకు
కృతులూ కీర్తనలెన్నో ఆర్తిగ విన్పించెద నీకు

ఓ అపర వాణీ –నీకు గీతాంజలి
అభినవ గీర్వాణీ-ముకుళిత హస్తాంజలి

Sunday, June 17, 2012




పరుల మాటలు పట్టించు కొనుచు
పలుచన సేయకు నను ప్రాణనాథా..
నీవేరుగనిదా నా మది- నీకది ఏడేడు జన్మాల ఖైదీ

1.     ప్రీతిగా చేకొన్న సీతను సైతం-
అడవుల పాల్జేసే అలనాడు రాముడు
సాధ్విగ పేరున్న రేణుక నైనా
దండించె జమదగ్ని మునివర్యుడు
ఘనులకైనా తప్పనిదే విధి-అనితర సాధ్యము మీ ప్రేమ పెన్నిధి

2.     ఒరుల మెప్పుకు బలిసేయవలేనా
నరుల దృష్టికి మసి బారవలెనా
పచ్చనైన కాపురాన -చిచ్చు రేపుట న్యాయమా
సాగుతున్న సంసార నావను -సుడిలొ ముంచుట భావ్యమా
          నీవేరుగనిదా నా మది- నీకది ఏడేడు జన్మాల ఖైదీ