Friday, December 28, 2012

నిమిషమైన నా మది 
నీ మీద నిలుపకుంటి నే మది 
దయగనవయ్య పరమ దయాంబుధి
ధర్మపురి నారసింహ నెమ్మది

చ.1. కనుల ఎదుట నిలిచినా కా౦చ కుంటినయ్య స్వామి
పదియడుగులదవ్వుకైననడువకుంటినయ్య స్వామి
కరకమలాలతోను పూజించకుంటినయ్య స్వామి 
నోరార నీ భజన చేయకుంటినయ్య స్వామి

చ.2.నోములు వ్రతములు చేయకు౦టినయ్య స్వామి
వేదమంత్రాదులెపుడుచదువకుంటినయ్య స్వామి
యజ్ఞ యాగాది క్రతువు లెరుగ కుంటి నయ్య స్వామి 
దాన ధర్మాదులైనచేయకు౦టినయ్య స్వామి

చ.3.ఏ రీతిగా నన్ను నీవు ఉద్ధరింతువో ప్రభూ
ఏ తీరుగ భవ తీరంచేర్చనుంటివో హరీ 
ప్రహ్లాద వరద నీకు ప్రణమిల్లెద నయ్య స్వామి 
శేషప్ప వినుత నిన్ను శరణంటినయ్య స్వామి

Monday, December 24, 2012

“మనోరంజని “

“మనోరంజని “

నీ పాదాల క్రింద నలిగినా చాలని – రాలినాయి దారంతా పారిజాతాలు
నీ తనువును స్పర్శించే భాగ్యమె పొందాలని – వీచినాయి రోజంతా మలయ మారుతాలు
నీ ఓర చూపు వాలినా మేలని – వరుస కట్టినారు తాపసులె౦దరో
నీ చిరునవ్వు జారినా ఏరుకొని - దాచుకొనే ధన్య జీవులె౦దరో

1. నీవు జలక మాడాలని – తహతహ లాడినది నది
నిను చుట్టి మెరవాలని – తపించిపోయింది చీర మది
నీ మెడలో నగగ మారి –తరించాలనుకొన్నది సురభి (బంగారం)
నీ జడలో విరిగా జేర – తనువు చాలించింది గులాబి

2. నీ మేని ఛాయ కాయగా - రవికి అడ్డునిలిచింది మేఘము
నిను మురిపింప జేయ – నెలపొడుగున కాయాలని యోచించె చంద్రాతపము
ఇంద్రధనుసు నిన్ను మించ –కొత్త వర్ణాలు కోరి ఆచరించె తపము
సృష్టి లోని పూవులన్ని బేషరతుగ మెచ్చెను నీ అందము

3. కలనైనా కనిపి౦చెదవోయని – నిద్రలోనె గడిపితి దినమానము
ఊహకైనా వరించాలని -కలవరిస్తిని నేను అస్తమానమూ
నా హృదయం నీ జన్మస్థానం –అసమాన సుందరీ
నా జీవితమే చేసితి కైంకర్యం- అనుపమాన సుకుమారి