Saturday, February 18, 2012

మహాశివరాత్రి పర్వదినమున మిత్రులకు, బ్లాగు వీక్షకులకు.శ్రేయోబిలాషులకు,స్పూర్తి దాతలకు రాఖీ శుభాకాంక్షలు! “వేములవాడ రాజన్న ఊరూరా వాడవాడ అందించాలి జనులందరికీ కూడు గుడ్డ నీడ!!” రాజన్న రాజసం

మహాశివరాత్రి పర్వదినమున మిత్రులకు, బ్లాగు వీక్షకులకు.శ్రేయోబిలాషులకు,స్పూర్తి దాతలకు రాఖీ శుభాకాంక్షలు!
“వేములవాడ రాజన్న ఊరూరా వాడవాడ
అందించాలి జనులందరికీ కూడు గుడ్డ నీడ!!”
రాజన్న రాజసం
నువ్వంటే ఎందరికో ఎంత గురి రాజన్న-వేములవాడ రాజన్న
నీవల్లనె ఎందరికో తరగని సిరి రాజన్న
కోట్లాది భక్తుల కొంగుబంగారమీవె
ఎనలేని జనులకు ఆరాధ్య దైవమీవె

1. నీడ కొరకు గూడు నల్లి మాడిపోయె సాలీడు
మూఢభక్తి గొడవలోన ప్రాణాలిచ్చె కరినాగులు
తలనీలాలిచ్చేరు నేడూ తన్మయముగ రాజన్న
నిలువుదోపిడిచ్చేరు నియమముతో రాజన్న
నీవంటే ఎందరికో గుడ్డి గురి రాజన్న
నిను నమ్మితె ఎందరికో మోక్షపాప్తి రాజన్న

2. నరాలతో రుద్రవీణ వాయించె రావణుడు
శరాలనే సంధించి మెప్పునొందె అర్జునుడు
పతినీవని కొందరింక భావింతురు రాజన్న
గతినీవని జన్మంతాఅర్పింతురు రాజన్న
నీవంటే ఎందరికో వింత గురి రాజన్న
నీ దయతో ఎందరికో వరముల ఝరి రాజన్న

3. కంటిబాధ చూడలేక కన్నిచ్చె తిన్నడు
శరణనగనె చిరాయువొందె బాలమార్కండేయుడు
ముడుపుగట్టి కోర్కెదీర చెల్లింతురు రాజన్న
కోడెను గట్టి సంతతి నొంది సంతస మొందురు రాజన్న
నీవంటే ఎందరికో పిచ్చి గురి రాజన్న
నీచెంత ఎందరికో నిర్భీతి రాజన్న

4. కమలార్చన గణన తగ్గ నయనకమలమిచ్చె హరి
భస్మాసుర బారినిగావ మోహినిగా మారె మరి
శివకేశవ భేదమే లేదుకదా రాజన్న
హరిహరసమ తత్వమే అద్వైతముకద రాజన్న
దోసెడు నీళ్లు నిర్మలభక్తి నీకుచాలు రాజన్న
పిడికెడు పత్రే నీకైతె తృప్తే వెములాడ రాజన్న