Friday, April 13, 2012

సంగీత లహరి

సంగీత లహరి

ఆశయాలు కావాలి-హిమవన్నగ శిఖరాలు
నీ శ్రద్ధా సాధనలిక- అనన్య సాధ్యాలు
అనుక్షణం శ్రమించాలి-ప్రతిరోజూ పరీక్షగా
సడలని సంకల్పమే-శ్రీరామ రక్షగా

1. సరిగమ పదనిసలే-పాడాలి సరిగా
శ్రుతీ లయ అమరాలి-పాటకు ‘సిరి-హరి’ గా
వర్ణాలూ పదాలూ-సాగాలి భావ’లహరి’గా
రాగంతానంపల్లవి-మారాలి బిలహరిగా

2. అవాంతరాల అపస్వరాలు-అధిగమించాలి
రణగొణ ధ్వనులున్నా-లయలయమై పోవాలి
నాభినుండి భావమెపుడు-ఉబికి ఉబికి రావాలి
తన్మయముగ పాటనెపుడు-నీకొరకే పాడాలి

3. అక్షరాలు స్పష్టంగా ఇష్టంగా పలకాలి
ప్రతి పదార్థ తత్వమెరిగి ప్రతి స్పందించాలి
పల్లవాల రుచిమరిగిన కోకిల కుహు కుహులే
పల్లవించి తీరాలి పల్లవెత్తుకొనగనే..