Thursday, May 30, 2013

||రాఖీ||వైద్య నాథం నమామ్యహం ||
||శ్లో||ఓం త్రయంబకం యజామహే- సుగంధిం పుష్టివర్ధన౦ |
ఉర్వారు కమివ బంధనాత్-మృత్యోర్ముక్షీయ మామృతాత్||

నీల కంధరా-జాలి చూపరా
బేలనైతిని –ఆదరించరా
వెన్నవంటి మనసు నీది-వెన్నెలంటి చూపు నీది
అన్యులను నే నెరుగకుంటి- నీవే నాకిక శరణమంటి

1.     ఈతిబాధల నోపకుంటి –ఈశ్వర దరిజేర్చుకోరా
వ్యాధిగ్రస్తుల పాలిటి –వైద్యనాథ వేగరారా
కాలకాల తాళ జాల-మృత్యుంజయ చేయ౦దుకోర

వెన్నవంటి మనసు నీది-వెన్నెలంటి చూపు నీది
అన్యులను నే నెరుగకుంటి- నీవే నాకిక శరణమంటి

2.     పోరిపోరి నీరసించితి –రుజల పీడన సైచితి
రుచిని వీడితి,తీపి మరచితి-పథ్యములతో జిహ్వ చంపితి
సూది పోట్లే దేహమంతా-బ్రతుకు నాకొక నిత్య చింత

వెన్నవంటి మనసు నీది-వెన్నెలంటి చూపు నీది
అన్యులను నే నెరుగకుంటి- నీవే నాకిక శరణమంటి

3.     భాగ్యమిమ్మని కోరలేదు-ఆరోగ్యమిస్తే చాలు నాకు
భోగమిమ్మని వేడలేదు –రోగముక్తే మేలు నాకు
నిధుల నిమ్మని అడుగలేదు-నలత నాకిక రూపుమాపు
వెన్నవంటి మనసు నీది-వెన్నెలంటి చూపు నీది
అన్యులను నే నెరుగకుంటి- నీవే నాకిక శరణమంటి




Thursday, May 23, 2013

రాఖీ|| నాయకి ||


రాఖీ|| నాయకి  ||
కనుబొమ్మల ధనువుతో..ఎనలేని శరములు..
మునిపంటి విరుపుతో మోకరిల్లు శిరములు..
చిరునవ్వుకే..మునులు..కాగలరు ..వశులు..
దయచూస్తివా..ఘనులు అవుతారు బానిసలు..!                    

సరస సమర నాయకి-సహృదయ సరసి జానకి
మతిచెలించె నినుకన్నబ్రహ్మకి-నీ చూపుల తూపులే మదితాకి..


1.  కనుల కలువలే నీకు వారుణాస్త్రాలు-సంపంగి నాసికే నాగాస్త్రము...
          గులాబీ చెక్కిలే..సమ్మోహనాస్త్రం ..-మందారమోవియే పాశుపతాస్త్రం
          మరుమల్లి పలువరుస నారాయణాస్త్రము..ముఖ పద్మమే నీకు బ్రహ్మాస్త్రము

          సరస సమర నాయకి-సహృదయ సరసి జానకి
           మతిచెలించె నినుకన్నబ్రహ్మకి-నీ చూపుల తూపులే మదితాకి..

2.  తుమ్మెదల తలపించు ముంగురులు.-ఎదల  కట్టడిజేసే మంత్రమ్ములు
పాదాల రవళించు మంజీరములు..-పరవశమొ౦దించే వాద్యమ్ములు
వయ్యారి నడకల్లో..వన్నె ముక్కు పుడకల్లో –పొదువుకున్నది గుమ్మ వేలాది అమ్ములు

           సరస సమర నాయకి-సహృదయ సరసి జానకి
            మతిచెలించె నినుకన్నబ్రహ్మకి-నీ చూపుల తూపులే మదితాకి..

||రాఖీ ||దిల్ పసంద్||


||రాఖీ ||దిల్ పసంద్||
పూవుల బుట్టవు –కూరల తట్టవు –తేనియ తెట్టెవు నీవు
కన్నుల విందువు-గమ్మత్తు మందువు-దిల్ పసందువే నీవు
అందానికే సమాధానమీవు –ఆనందానికే సన్నిధానము

1.     మేఘాలు శిరోజాలు శ్రవణాలు శిరీషాలు-
గులాబీ కపోలాలు బుగ్గలు బూరెలు
 మీనాక్షివి విప్పారితే కమల నేత్రివి –
అల్లనేరేడు పళ్ళ సోగకళ్ళ పిల్లవి
సంపంగి నాసిక సన్నజాజి ముక్కెర-
 పెదవులు దొండ పళ్ళు దానిమ్మలు దంతాలు
కంఠము సొరకాయ –దబ్బపండు మేని ఛాయ
           అందానికే సమాధానమీవు –ఆనందానికే సన్నిధానము


2.     మేరువులే ఉరోజాలు-హిమవన్నగ జఘనాలు
నడుమేమో సింగము-దోసగింజ ఉదానము
హస్తాలు తామరతూళ్ళు-ఊరువులే కదళులు
తమలపాకు అరచేతులు-పాదాలు పల్లవాలు
నవ్వితె రాలు పారిజాతాలు-చూపుల్లో నందివర్ధనాలు
మకరందం మాట తీరు –కన్నుల వెన్నెల జారు
నడకల్లో మయూరాలు –ఎదలో నవనీతాలు
          అందానికే సమాధానమీవు –ఆనందానికే సన్నిధానము


Tuesday, May 21, 2013

రాఖీ||“విధి విలాసం- మది విలాపం ”||

రాఖీ||“విధి విలాసం- మది విలాపం ”||

పల్లవి: గడ్డి పూవు నా కవిత-అందమించదూ..పరిమళించదూ
        గాలి పాట నా  గానం–సరిగమించదూ..మనసు మించదు
        చిల్లి గవ్వ జీవితాన....కూలె పేక మేడ..
       నగుబాటు నాటకాన... చింతల జడివాన..

1.     చేతికందు పరమాన్నం.-నోరు చేరు తీరే మారు
పట్టుకుంటె పసిడైనా సరే-రాకాసి బొగ్గై తీరు
వక్ర గతుల గ్రహబలమేమో..జడలువిప్పి బుసకోడుతోంది..
జన్మకాల దోషమేదో..వెంటాడి వేధిస్తోంది..

2.     శ్రీరామా అనినేనంటే..ఛీ త్కార మనిపిస్తోంది..
చిన్ననాటి హితునికి సైతం ..విరోదిగా తోస్తోంది..
తప్పుకోవడానికి...తరుణోపాయమేది లేదు..
తప్పునాది కాకున్నా నింద తప్పడం లేదు..

3.     విజ్ఞాన భానుడి నైనా మరుపు మబ్బు కమ్మేస్తోంది
అసహాయ శూరుడినైనా..వ్యూహమేదో..బంధిస్తోంది..
కలిసిరాని కాలముంటే..తాడైనా  కాటేస్తుంది..
చిగురించే రోజొకటో స్తే..బీడైనా..వనమౌతుంది..
బృందావనమౌతుంది..
నందన వనమౌతుంది