Thursday, November 12, 2015

తరువు-గురువు

వృక్షమే లక్ష్యంగా -జీ’వనాన’ పయనిద్దాం
మానుయే గమ్యంగా -మనుగడను సాగిద్దాం
మొక్కలనే పాపలుగా –మన అక్కున చేర్చుకుందాం
చెట్టపట్టాలు కట్టి –చెట్టు జట్టు చేరిపోదాం

“బ్రతుకు తెరువు నేర్పేటి –గురువేగా ప్రతి తరువు
బ్రతుకు పరమార్థం తెలిపే-నిఘంటువే హరిద్రువు”

1.   పుడమి కడుపు చీల్చుకొని-తనకు తానే పుడుతుంది
ఆలన పాలన లేకున్నా-మొండిగా బ్రతికేస్తుంది
మోడుగా మారిన కూడా-చినుకు తాక చిగురిస్తుంది
దైన్యమన్నదే లేక-ధైర్యంగా నిలబడుతుంది

“బ్రతుకు తెరువు నేర్పేటి –గురువేగా ప్రతి తరువు
బ్రతుకు పరమార్థం తెలిపే-నిఘంటువే హరిద్రువు”

2.   పంచలేనిదేదీ లేదు-తరువు తనువులో
వినియో గించ దగినవే అణువణువూ-మాను మేనులో
విత్తు వేరు బెరడు పసరు-ఔషదాలె వ్యాధులకు
ఆకు కాయ పండు దుంప –అమృతాలె ఆహారానికి

“బ్రతుకు తెరువు నేర్పేటి –గురువేగా ప్రతి తరువు
బ్రతుకు పరమార్థం తెలిపే-నిఘంటువే హరిద్రువు”

3.   ఆకులూ తీగలతో-ఇంటికంద మిస్తుంది
పూవులూ ఫలములతో-పూజకు పనికొస్తుంది
ఎండా వాన పడకుండా-నీడ నిచ్చి అండవుతుంది
జీవనాధారమైన-ప్రాణవాయువిస్తుంది

“బ్రతుకు తెరువు నేర్పేటి –గురువేగా ప్రతి తరువు
బ్రతుకు పరమార్థం తెలిపే-నిఘంటువే హరిద్రువు”

4.   రాయబోతే చెట్టు చరితయే-రామాయణ మౌతుంది
విప్పి చెబితె వృక్ష నీతియే-కృష్ణ గీత అవుతుంది
కూడు గూడు నీరందించే-విశ్వ స్రష్ట యే కుజము
చావు పుటుకలన్నిటిలో-చెట్టు మనిషి నేస్తము

“బ్రతుకు తెరువు నేర్పేటి –గురువేగా ప్రతి తరువు
బ్రతుకు పరమార్థం తెలిపే-నిఘంటువే హరిద్రువు”