Friday, November 25, 2016

మోము పూలతోట
మోవి తేనె ఊట
నగవు వెన్నెల మాపు
సొగసు మదనుని తూపు

1. నయనాలు కలువలే,
నాసికేమొ సంపెంగ
బుగ్గలైతే రోజాలే
పలువరసలో సిరి మల్లెలే

2.అధర మందారాల్లో
సుధల సంద్రాలే
పలుకు పారిజాతాల్లో
చక్కెర జలపాతాలే

3. మందహాస కోనల్లో
చంద్రవంకలే
కేరింతల వానల్లో
పూర్ణశరశ్చంద్రికలే

4. రతీదేవి మతిచలించే
అతిలోక సుందరివే
అప్సరసల తలదన్నే
అందాల మంజరివే

Saturday, October 1, 2016

వీరసైనికుడా,దేశరక్షకుడా
నీకు వందనం అభివందనం
మాతృ ప్రేమికుడా శతృ భీకరుడా
నీరాజనం నీకిదే జయజయ ధ్వానం

1.కంటికి రెప్పవై..ఒంటికి కవచమై
రేయిపగలు అలుపెరుగని యోధుడివై
సరిహద్దు కంచెపంచ సాయుధుడివై
పహారా కాచేవు పారా హుషారుగా
భరోసా ఇచ్చేవు భద్రత నోచేట్లుగా
మా వినోదాలన్నీ నీ ప్రసాదాలే
మా విలాసాలన్నీ నీ ప్రతాపాలే

2.ఏ విపత్తు ఎదురైనా వ్యవస్థలే విఫలమైన
అసాధ్యము దుర్భేద్యము అనిపించేదేదైనా
ప్రాణాలను ఫణమోడి బాధితులను కాపాడి
ఆపదలో ఆదుకునే అభయదాతవవు
ప్రజాక్షేమమెరిగిన నిజమైననేతవు
మరువరానిది నీ త్యాగనిరతి
అజరామరమే నీ దివ్యకీర్తి

3.సాహసమే ఊపిరిగా..
విజయమే లక్ష్యంగ
యుధ్ధరంగాన నీవే ఓ ఫిరంగిగ
ముష్కరుల చెండాడే మృగరాజువే నీవు
ప్రత్యర్థుల గుండెల్లో అణుబాంబువే నీవు
నీ ధైర్యం ఆదర్శనీయము
నీ శౌర్యం ప్రశంసనీయము

Saturday, September 17, 2016

ఓడిపోకు వెంటనే- గెలుపు వలచు కృషి ఉంటేనే...
సాగిపో సాధన వెంటనె- సాధ్యమగును కలల పంటనే..
ఆదిలోనె బెదరకురా నా అనుంగు సోదరా
ప్రయత్నాలు మానకురా ప్రతివిజయం నీదేరా
1. డంభాలు పలికేవారు ఆరంభ శూరులు
అడ్డంకులు దాటేస్తారు మొక్కవోని ధీరులు
గేలిచేస్తు విసిరే రాళ్ళతో కోటలనే నిర్మించాలి
అపజయాల అనుభవాలతో కొత్తదారులేయాలి
ఆదిలోనె బెదరకురా నా అనుంగు సోదరా
ప్రయత్నాలు మానకురా ప్రతివిజయం నీదేరా
2. అర్భకులకు దొరికే సాకు అదృష్టం అన్నమాట
దౌర్బల్యం మనబోదు సంకల్పం ఉన్నచోట
ఉధృతిగా కదిలే నదికి కొండలైన వదులును బాట
ఊకదంచుడి౦కమానితే ఉట్టికొట్టగలవేపూట
ఆదిలోనె బెదరకురా నా అనుంగు సోదరా
ప్రయత్నాలు మానకురా ప్రతివిజయం నీదేరా
3. లక్ష్యమే లక్ష్యంగా రేయిపగలు తలపోయాలి
గుణపాఠం ఒక పాఠంగా శిరసావహించాలి
ప్రాణాలు ఫణమోడి శిఖరాల నెక్కేయాలి
చరితలనే తిరగ రాస్తూ నువు చరిత్ర సృష్టించాలి
ఆదిలోనె బెదరకురా నా అనుంగు సోదరా
ప్రయత్నాలు మానకురా ప్రతివిజయం నీదేరా

Wednesday, September 14, 2016

ఎరుగము స్వామి ఎన్నడుగాని నీ లీలలు
సహజమె స్వామి చూపవదేమి నీ మహిమలు

1.అష్టాదశ పురాణాలు నిజమగు తార్కాణాలు
అష్టసిద్దినవనిధి లబ్దులు కొల్లలుగా సాదృశాలు
అడుగడుగున వెలసిన గుళ్ళు నీ దర్శన నిదర్శనాలు
ఉత్సాహాల ఉత్సవాలే నీ మనుగడ కానవాళ్ళు

కరుగదదేమి పరమదయాళ నీ హృదయము
కనికరమేది కరుణాసాగర మేమన జాలము

2.ఎక్కిన శిఖరాలు జారిన లోయలు నీ ప్రసాదాలు
పొందిన సంపదలు అందిన ఆపదలు నీ వరదానాలు
రెప్పపాటు లో ఆటుపోటులే మా జీవిత గమనాలు
కప్పదాటులే వేయక కురిపించు ఆశీర్వచనాలు

తాళగలేము కఠినతరమగు నీ గుణపాఠాలు
వదలము స్వామీ దయగనువరకు నీ చరణాలు

https://www.4shared.com/mp3/3Ng9QP3Sce/ERUGAMU_SWAMY_ENNADU_GAANI.html

Monday, September 5, 2016

వినాయక చవితి శుభాకాంక్షలతో.,
స'వర్ణాత్మక గణపతి గుణ గణ గీతి

సంకట నాశక - సంతస దాయక
సమ్మోహన ముఖ - హే సుముఖా
సతతము నిన్నే స్మరణము జేసెద
శుభకర సుఖకర సిద్ది వినాయక

1.శ్రీ గౌరీసుత -శీఘ్ర వరద
సిద్దిబుద్దియుత-సునిశిత వీక్షిత
సకలలోక సంపూజిత సన్నుత
సర్వాభీష్ట ప్రదాయక సంస్తుత

సతసతము నిన్నే స్మరణము జేసెద
శుభకర సుఖకర సిద్ది వినాయక

2.సకారాత్మక -స్వప్న సాకార
సంక్లిష్ట వారక-సురనర వందిత
శంకర నందన శమదమ వారణ
శరణము నీవే శత్రు భంజన

సతతము నిన్నే స్మరణము జేసెద
శుభకర సుఖకర సిద్ది వినాయక

Wednesday, July 27, 2016

నా గృహన్మణి-గీత.... జన్మదిన సందర్భంగా-ప్రేమతో ...రాఖీ27/07/2016

ఇల్లంతా వెలుగులు నింపే-కొవ్వొత్తి తానౌతుంది
మనసుల్లో మమతలు వొంపే-మధు కలశం తానౌతుంది
పలురకాల పువ్వులనల్లే-ఆ దారం తానౌతుంది
అనుక్షణం నవ్వుల్లు చల్లే-అధరం తానౌతుంది


అర్ధాంగి దేవత అంటే-అతిశయోక్తి కానేకాదు
ఇల్లాలే జీవితమంటే-విడ్డూర మసలేలేదు


1. దాంపత్యాన అనునిత్యం –ఆమెదే ఆధిపత్యం
సునామీల నెదుర్కొనడమే-ఆమెకు ఒక నిత్యకృత్యం
గుట్టుచప్పుడవకుండా-ఇల్లు నెట్టుకొస్తుంది
పెల్లుబికే లావా నైనా-గుండెలోనే దాస్తుంది


అర్ధాంగి దేవత అంటే-అతిశయోక్తి కానేకాదు
ఇల్లాలే జీవితమంటే-విడ్డూర మసలేలేదు

2. సంసార నౌకకు తానె –ఓ సరంగు అవుతుంది
ఎదురైన సుడిగుండాలను-అవలీలగ దాటిస్తుంది
ఆనందాలు పంచడానికి-తాను కరిగి నీరౌతుంది
ఇంటిల్లిపాదికి సైతం-కంటిచూపు తానౌతుంది


అర్ధాంగి దేవత అంటే-అతిశయోక్తి కానేకాదు
ఇల్లాలే జీవితమంటే-విడ్డూర మసలేలేదు

Saturday, April 23, 2016

వైవాహిక శుభవేళ /వైవాహిక వాసంత శుభకామనలు


మూడు పూవులు-ఆరుకాయలై-
వర్ధిల్లనీ మీ కాపురం
సూర్యచంద్రులు-చుక్కలున్నంత కాలం-
విలసిల్లనీ మీ వంశాంకురం
శతమానం భవతి మీ-ఆయురారోగ్యాలు
మీకు వైవాహిక వాసంత-శుభాకాంక్షలు

1.    ఏడుజన్మల తీపిగురుతుగా-
వేసినారు వేడ్కతో ఏడడుగులు
మనసా వాచా కర్మణా-
జతజేసినాయి-మిమ్ము మూడు ముడులు
సుముహూర్త సమయాన -జిలకర బెల్లంతో-
ఇచ్చిపుచ్చుకున్నారు జీవితాలు
తలంబ్రాలతోతలమునకలుగా-
ఒడిసిపట్టుకున్నారు-మధురాను భూతులు

        శతమానం భవతి మీ-ఆయురారోగ్యాలు
        మీకు వైవాహిక వాసంత-శుభాకాంక్షలు

2.    వేదమంత్రాల నడుమ-పాణిగ్రహణముతో-
నా౦ది పల్కినారు దాంపత్యానికి
వరమాల మెడ దాల్చ-తలలు వంచి-
స్వస్తి చెప్పినారు ఆధిపత్యానికి
షట్కర్మయుక్తమైన బాధ్యత స్వీకరించి-
రూపుదిద్దుకున్నావు ధర్మపత్నిగా
పురుషార్థాలలో నాతిచారామిగా
మాట నిలుప మారేవు ఆదర్శపతిగా

శతమానం భవతి మీ-ఆయురారోగ్యాలు
మీకు వైవాహిక వాసంత-శుభాకాంక్షలు

3.    అలకలే లేక నెరవేరాలి
కలకాలం మీరు కన్న కలలన్ని
కలతలే లేక కొనసాగాలి
కన్నుకుట్టు కునేలా జంట చిలుకలన్నీ
అరమరికలు లేక అన్యోన్యంగా
ఆనంద సాగరాలు ఈదాడాలి
పిల్లాపాపలతో దైవo దీవెనతో
చల్లగ నూరేళ్ళు మీ మనుగడ సాగాలి

శతమానం భవతి మీ-ఆయురారోగ్యాలు
మీకు వైవాహిక వాసంత-శుభాకాంక్షలు




Thursday, April 14, 2016

శ్రీ రామనవమి శుభాకాంక్షలు! సీతారామ కల్యాణం-కావాలి జగత్కల్యాణం!!

శ్రీ రామనవమి శుభాకాంక్షలు!
సీతారామ కల్యాణం-కావాలి జగత్కల్యాణం!!

సురుచిర శుభనాముడు-అగణిత గుణధాముడు
రాముడు రఘురాముడు రణధీరుడు
యుగయుగములు -ముజ్జగములు
కొనియాడెడి- ధీరోదాత్తుడు

1.సాకేతపురవాసుడు-ఆదిత్య కుల సోముడు
దశరథ నందనడు-దానవ భంజనుడు
కౌశిక ముని శిశ్యుడు-అహల్యా వరదుడు
మైథిలీ మనోహరుడు-కల్యాణ రాముడు

రాముడు రఘురాముడు రణధీరుడు
యుగయుగములు-ముజ్జగములు
కొనియాడెడి -ఆదర్శ ప్రాయుడు

2.పితృవాక్య పాలకుడు-ఏకపత్ని ధార్మికుడు
సౌమిత్రి సేవితుడు-సుగ్రీవ స్నేహితుడు
శబరి మోక్షదాయకుడు-హనుమ హృదయ వాసితుడు
రావణాంతక శూరుడు-పట్టాభి రాముడు

రాముడు రఘురాముడు రణధీరుడు
యుగయుగములు-ముజ్జగములు
కొనియాడెడి -పురుషోత్తముడు
https://www.4shared.com/mp3/WCGmMynRba/__online.html

Wednesday, April 13, 2016

దయామయా-ఏమిటి నీ మాయ



ఎలా కూర్చి ఉంచావయ-అంతులేని ప్రేమలని
మనసు అంతరాలలోన .......– మమకారాలని
కమ్ముకున్న మబ్బువెనక-జాలి జాబిలీ
గ్రహణ మింక విడివడితే-ప్రభలుచిమ్ము కరుణ రవీ

1.       పెంచుకున్న పూలమొక్క –మమత నింక తెలుపదా
సాదుకున్న బొచ్చుకుక్క –భూతదయను చూపదా
పంచుకున్న బన్నుముక్క –మైత్రి విలువ నెరుగదా
మనిషి మసల  మనిషి లెక్క -మానవతను నిలుపదా
           కమ్ముకున్న మబ్బువెనక-జాలి జాబిలీ
           గ్రహణ మింక విడివడితే-ప్రభలుచిమ్ము కరుణ రవీ

2.       జాతి మరచి పాలు కుడుప-మాతృత్వం వెలుగదా
విభేదాలు విస్మరింప-సౌభ్రాతృత విరియదా
ఉన్నంతలొ సాయపడగ-లేమి తోకముడవదా
హృదయ మెంతొ విస్తరింప-దయాగుణం గెలువదా
           కమ్ముకున్న మబ్బువెనక-జాలి జాబిలీ
           గ్రహణ మింక విడివడితే-ప్రభలుచిమ్ము కరుణ రవీ

3.       బ్రతుకు రైలు పయనంలో-చోటులోన సర్దుబాటు
గుణపాఠపు బడిలోనా- నడవడికల దిద్దుబాటు
దాంపత్యపు సుడిలోనా-అన్యోన్యపు తోడ్పాటు
వసుధైక కుటుంబమనగ-తిరుగులేని  జరుగుబాటు

           కమ్ముకున్న మబ్బువెనక-జాలి జాబిలీ
           గ్రహణ మింక విడివడితే-ప్రభలుచిమ్ము కరుణ రవీ

http://www.4shared.com/mp3/AG_smnJ0ba/___online.html