Wednesday, July 27, 2016

నా గృహన్మణి-గీత.... జన్మదిన సందర్భంగా-ప్రేమతో ...రాఖీ27/07/2016

ఇల్లంతా వెలుగులు నింపే-కొవ్వొత్తి తానౌతుంది
మనసుల్లో మమతలు వొంపే-మధు కలశం తానౌతుంది
పలురకాల పువ్వులనల్లే-ఆ దారం తానౌతుంది
అనుక్షణం నవ్వుల్లు చల్లే-అధరం తానౌతుంది


అర్ధాంగి దేవత అంటే-అతిశయోక్తి కానేకాదు
ఇల్లాలే జీవితమంటే-విడ్డూర మసలేలేదు


1. దాంపత్యాన అనునిత్యం –ఆమెదే ఆధిపత్యం
సునామీల నెదుర్కొనడమే-ఆమెకు ఒక నిత్యకృత్యం
గుట్టుచప్పుడవకుండా-ఇల్లు నెట్టుకొస్తుంది
పెల్లుబికే లావా నైనా-గుండెలోనే దాస్తుంది


అర్ధాంగి దేవత అంటే-అతిశయోక్తి కానేకాదు
ఇల్లాలే జీవితమంటే-విడ్డూర మసలేలేదు

2. సంసార నౌకకు తానె –ఓ సరంగు అవుతుంది
ఎదురైన సుడిగుండాలను-అవలీలగ దాటిస్తుంది
ఆనందాలు పంచడానికి-తాను కరిగి నీరౌతుంది
ఇంటిల్లిపాదికి సైతం-కంటిచూపు తానౌతుంది


అర్ధాంగి దేవత అంటే-అతిశయోక్తి కానేకాదు
ఇల్లాలే జీవితమంటే-విడ్డూర మసలేలేదు