Saturday, August 26, 2017

సేవల పాయసము
చేసి ఉంచాను నీ కోసము
ఆరగించర మూషిక వాహన
నన్నాదరించర దీనజనావన

1.కమ్మని వాసన రావాలని
తుమ్మెద వాలని మల్లెలని
ఎరుపంటె నీకెంతొ ఇష్టమని
విరిసిన మందార పూవులని
సిద్ధపరిచాను సిద్ధివినాయక
చిత్తగించర శ్రీ గణనాయక

2.పంచామృత సమ నీనామగానం
పంచమ స్వరమున పలికించు వైనం
తలపోయ తెలిసే పికగాత్ర మర్మం
పులిమితి నామేన ఆకృష్ణ వర్ణం
ఆలపించితి నీ దివ్య గీతి
ఆలకించర ఓ బొజ్జ గణపతి

3.నా నయనాలే దివ్వెలుజేసి
వెలిగించానిదె మంగళ హారతి
నా హృదయము జే గంటగజేసి
మ్రోయించానిదె మంజుల రవళి
నా మనసే గొను నైవేద్యము
కరుణించి వరమిడు కైవల్యము