Saturday, April 28, 2018

సంతోషిమాతవు సంతస సంకేతవు
ధర్మపురీ విలసితవు ఆనందనికేతవు
నీ కృపకోరని వారేరీ నిన్నర్థించని వారేరీ
జయ జయ సంతోషీ మాతా
జయహో సంతోషీమాతా

1.పరమ శివుని గారాల పౌత్రివి నీవు
వరసిద్దిగణపతికి ప్రియ పుత్రికవు
లాభక్షేములకు అనుంగు సహజవు
కారణజన్మురాలివమ్మా సంతోషి నీవు

2.దయగలిగిన హృదయమె నీకావాసము
విచ్చుకున్న పెదవులె రత్నఖచిత ఆసనము
చెదరని దరహాసమె నీ ఆవాహనము
ధవళ గోవు నువు ఊరేగు వాహనము

3.శుక్రవార వ్రతము అభీష్టదాయకం
పులుపు రుచివివర్జనం మూలసూత్రము
షోడషవారాల ఆచరణయె శ్రేష్ఠము
సంతోషము వ్యాప్తిజేయ మాతానీకిష్టము
అభినందనలు మీ విజయానికి
జేజేలు పొందిన ఈ శుభ ఫలితానికి
వందనాలు సలిపిన సాధనకు కృషీకీ
జోహారులు మొక్కవోని సంకల్పానికి

1.మీ అద్భుత మేధస్సుకు ఇది గుర్తింపు
కఠోరమైన మీ శ్రమకు ఇది ఒక మెప్పు
నాయకత్వ పటిమకు ఇదియే నజరాన
మీ క్రీడాస్ఫూర్తికి ఇదే కీర్తి పతాక

2.అంచలంచల ఉన్నతికి ఇది బహుమానం
నిబద్ధమైన మీప్రగతికి ఇది కొలమానం
తడబడని అనుభవాని కిదియే తార్కాణం
కష్టేఫలి నానుడికి మీరేగా ప్రమాణం
శిలలోనూ కొలువున్న దేవుడు
మనుషులలో చైతన్యమయీ మనలేడా
మనసుపెట్టి చూడవేల స్నేహితుడా
దైవం లేనితావు  పొందలేవురా

1.బంధాలు కలిగినచో బాధ్యతగా ఉందువు
ఈగవాలనీయకుండ కాపాడుకొందువు
పరులపట్ల పలుచనైన భావము నీకేలరా
జనులంతా జగమంతా సొంతమనుకొ హాయిరా
మనసు పెట్టి చూడవేల స్నేహితుడా
మధురానుభూతుల నెడబాయకురా

2.మూణ్ణాళ్ళ ముచ్చట ఈబ్రతుకురా
వేణ్ణీళ్ళకుచన్నీళ్ళుగ బ్రతకరా
ప్రేమపంచు సాధనయే చేయరా
వసుధైక కుటుంబమపుడె సాధ్యమురా
మనసుపెట్టి మసలవేల స్నేహితుడా
మానవీయ కోణమెపుడు
వీడకురా
ప్రేమకు ఒక భాష ఉన్నది
అది మనసులు మాట్లాడుకునేది
కనులతొ కనులు
కలిపి లిపిగా
మోవి కలముతో
ఒకింత చిలిపిగా
తెలుప గలగు భావ ప్రకటన
ఎరుకపరచు ఎద నివేదన

1.వర్ణాలే లేనిది వర్ణించలేనిది
పదములు లేనిది నడకలు నేర్చినది
వాక్యాలు లేనిది లౌక్యమే ఎరుగనిది
వ్యక్తిగతమైనది
వ్యకపరచలేనిది
ఎపుడో అప్పుడు
ఎల్లరూ చదివేది
ఏదో ఒక వయసులో
బోధపడిపోయేది

2.సంధులు లేనిది సంధి పొసగ గలిగేది
సమాసాల ఊసులేక సమావేశమయ్యేది
అలంకార ప్రియమైనది
ఆకార రహితమైంది
చందస్సే లేనిది చందనమయమైంది
లేఖలతోమొదలయ్యి
గ్రంథసాంతమయ్యేది
గెలుపోటములలోను
చరితరాయగలిగింది
దిగంతాల అంచులనే దాటినా
గ్రహగోళాలన్నిటినీ మీటినా
వినబడలేదా నా మొరా
కరుణ మరచినావా ఈశ్వరా

1.ఏమీ పట్టనట్టు ముక్కుమూసుకొంటివా
పిచ్చీలేచినట్టు
బూడ్దిపూసుకొంటివా
అన్నిట ఉన్నానని అంటివా
ఎంతవెదకినా దొరకకుంటివా
ఎందుకీ నంగనాచి వేషాలు
ఏదో పూనినట్టు నాట్యాలు
మహామాయకు నువు లోబడి ఉన్నావో
మము మాయలోన ముంచాలనుకొన్నావో

2.చించుకున్న గొంతు బాధ నెరుగవా
విషము దాచుకోవడం మాతరమా
అవయవాల పట్టుగుట్టు తెలుపవా
పరమయోగివైన నీకసాధ్యమా
తిరోగామిగా నన్ను చేస్తివా
వినోదంగ నన్నుమారుస్తివా
దీనిభావమేమిటో మహేశా
విప్పిచెప్పు మర్మాన్నిక సర్వేశా
నా చిన్నారి ప్రియతమ తనయుడు
చి.హరీష్ భరద్వాజకు పుట్టిన రోజు సందర్భంగా
నాన్నయ్య చిరుకానుక-💐💐💐

ప్రతి మనిషి పుట్టుకకొక-పరమార్థం ఉంటుంది
పదుగురికై మనగలిగితె-అది సార్థకమౌతుంది
ఎరిగి మసలుకొనగలిగిన అంతరార్థము
మన జన్మ ఔతుంది చరితార్థము-
మానవ జన్మ ఔతుంది చరితార్థము
హ్యాపి బర్త్డేటూయూ-విష్యూ హాపీబర్త్డే టూయూ

1.తలవొగ్గని వ్యక్తిత్వం-తలపడే ధీరత్వం
తరువుకున్న త్యాగము-తర్కించే లౌక్యము
అవరోధాలెదురైనా-ఆపని నీ గమనం
ఆటంకాలెన్నున్నా-ఆగని నీ పయనం

గుణపాఠాలెన్నో నేర్చుకొని-జీవన మార్గం చక్కదిద్దుకొని
సాగిపోగలిగావు అవలీలగా-కలనైన తలవవు నువు బేలగా
హ్యాపి బర్త్డేటూయూ-విష్యూ హాపీబర్త్డే టూయూ

2.విధికే ఎదురీది-విషమ పరీక్షలేనెగ్గి
చుట్టుముట్టు సవాళ్ళను-సులువుగా ఛేదించి
ప్రతిక్షణం పురోగతిని పునస్సమీక్షించుకొంటు
ఇరుగుపొరుగునేస్తాలతొ అవగాహనగలిగియుంటు

అందమైన నీనవ్వును అందరితో పంచుకో
జన్మాంతరాలుదాటు అనుబంధం పెంచుకో
హ్యాపి బర్త్డేటూయూ-విష్యూ హాపీబర్త్డే టూయూ
ధన్యవాదాలు వదాన్య మిత్రులకు..
కృతజ్ఞతలజల్లు ప్రేమ పాత్రులకు
ఎంచలేనివీ మీ అభిమానాలు
వర్ణించ లేనివిమీ గుణగణాలు

1.వెన్నుతట్టు ప్రోత్సాహమె నా విజయ కారణం
భుజంతట్టు ప్రేరణయే నా గెలుపు మర్మం
ఆదర్శమూర్తులైన మీరె స్ఫూర్తిదాయకం
కురిపించే ప్రశంసలే
నా ప్రగతి కారకం

2.జీవితాన ప్రతిమలుపున మీరేకద నాతోడు
అడుగడుగున మీరిచ్చే సూచనలే కాపాడు
నను మరువక తెలిపేరు శుభాభినందనలు
నమస్సులనగ వినా ఏమీయను కానుకలను
శూన్యమంటె తెలిసింది
దైన్యమంటె ఎరుకైంది
నీవు లేని బ్రతుకంతా ఎంతెంతో ఇరుకైంది
నేనెవరో ఎరుగనంతగా నాదినాకె మరుపైంది

1.గాలి వీచినా గాని
ఊపిరాడలేకుంది
నాడికొట్టుకుంటున్నా మెదడు
మొద్దుబారింది
లబ్ డబ్ అని అనడం మాని
గుండె స్థాణువయ్యింది
అవయవాలు పనిచేస్తున్నా
నియంత్రణే కరువయ్యింది

2.వెతకులోతు ఎంతుందో
అవగతమిపుడయ్యింది
భవిత ఎండమావంటే
అతిశయమనిపించకుంది
ఎలాతిరిగితెచ్చుకోను
కోల్పోయినజీవితాన్ని
మరుజన్మకైనా పొందగ
చేసెదనిక ఘోరతపాన్ని
ఎందుకు కొందరికి అవకరమిస్తావు
ఎందుకు కొందరికే సుఖకరమౌ బ్రతుకిస్తావు
ఎందుకు కొందరిని ఆపదలలొ తోస్తావు
ఎందుకు కొందరినే అందాల అందలమెక్కిస్తావు
అంతా నీ బిడ్డలైతె ఇంతపక్షపాతమా
గుణదోషాల కర్త నీవన్నది అనృతమా

1.ఆగర్భ శ్రీమంతులు కొందరు
ఆజన్మాంత నిర్భాగ్యులు కొందరు
అద్భుతమౌ మేధస్సుతొ కొందరు
అయోమయపు మందమతితొ కొందరు
చెదరని ఆరోగ్యంతో కొందరు
మందేలేని రుగ్మతలతొ కొందరు
ఎందుకు స్వామీ ఇంత నిరాదణ
ఏమిటిస్వామీ అస్మదీయ వివక్షత

2.ఉన్నదాంట్లొ తృప్తితో కొందరు
తాపత్రయముల బారిన కొందరు
కీర్తిశిఖరమెక్కతూ కొందరూ
ఆర్తితోనె కడతేరుతు కొందరూ
మానవత్వ తత్వముతో కొందరు
పాశవికత జతకడుతూ కొందరూ
మంచిని నేర్పించగ నువు నేరవా
నువ్వాడిందే ఆటయనుట మానవా

Friday, April 20, 2018

నిద్దురమ్మా రావమ్మా నీకు వందనం
సిద్ధపరచి ఉంచానమ్మా కలల అందలం
మత్తు మత్తుగ నన్నూ హత్తుకోవమ్మా
చిత్తమంతా ఆక్రమించి చుట్టుకోవమ్మా

1.మెత్తనైన పరుపు వేశా
నా గుండెసొంటి దిండునుంచా
హాయిగొలుపే జోలపాటలు
అల్లనల్లన ఆలపించా

నల్లనైన తెరలు దించా
కళ్ళఅలసట నంత తీర్చా
దోమలేవీ దూరకుండా గట్టి బందోబస్తే చేసా

నీఒడిలో చోటునివ్వు నిద్దురమ్మా
సేదదీరగ చేరదీయవె నిద్దురమ్మా

2.ఉక్కపోతను దూరం చేసా
అగరు బత్తుల ధూపం వేసా
ఎంతగానో బ్రతిమిలాడి రెప్పల్నీ వాలగజేసా

తీపి కబురుల ఊసులు తెలిపా
వింత వింత కథలే చెప్పా
తలను నిమిరి వెన్నుజో జోకొట్టి
వెచ్చగా నే అక్కున జేర్చా
 రాక తప్పదు నీవింక నిద్దురమ్మా
కరుణజూడవె నావంక నిద్దురమ్మా

Thursday, April 19, 2018

"ఓధీర వనిత.,ఓ జగజ్జేత"


ఓ ఆడపిల్లా.. 'ఆడ'పిల్లవె
నువ్వేనాటికైనా...
ఓ లేడి'కూనా...
విషాదభరితమె 
నీకథ ఏ'నాటికైనా

అండంగాఉన్ననాటి నుండి
గండాలే నీ మనుగడకెపుడైనా
పసికందుగ చిన్ననాటి నుండి
అగచాట్లే అడుగుతీసి అడుగేసినా

ఆంక్షల లక్ష్మణ రేఖలు
అనుక్షణం అగ్నిపరీక్షలు
ఓ భూజాతా ,ఓ వహ్నిపునీతా

బాల్యాన అమ్ముడయే దైన్యమైనా
బాలికవధూ దురాచారమైనా
అలనాడు స్త్రీగా విద్యకు దూరమైనా
బాల్యవింతతువుగ బ్రతుకు భారమైనా
నిస్సహాయంగా, ఏతోడు లేక
నిర్హేతుకంగా ,నీకుమద్దతే లేక
బాలగా తలవంచావు
బేలగా విలపించావు

ఆంక్షల లక్ష్మణ రేఖలు
అనుక్షణం అగ్నిపరీక్షలు
ఓభూజాతా,ఓ వహ్నిపునీతా

వికృతసతీసహగమనమైనా
ఒకనాటి కన్యా శుల్కమైనా
ఈనాటి వరకట్న పిశాచమైనా
ఉద్యోగినిగా ఆకాశపు సగమైనా

ప్రకృతే పదేపదే బెదిరించినా
సమాజమే హద్దు నిర్ణయించినా
వంచితగా వేదన సహియించావు
పరిణీతగా వెతలు భరియించావు

ఆంక్షల లక్ష్మణ రేఖలు
అనుక్షణం అగ్నిపరీక్షలు
ఓభూజాతా,ఓ వహ్ని పునీతా

 3.రోదసిలో శోధనలే చేసినా
క్రీడలలో చరిత్రలే రాసినా
పదవులతో ప్రపంచమే ఏలినా
హిమవన్నగ శిఖరాల చేరినా

వివక్షనే ఎదురుకొన్నాగాని
విధేనీకు ఎదురుతిరిగిన గాని
నిన్ను నీవు నిరూపించుకుంటున్నావు
పోరాడిమరీ సాధించు కుంటున్నావు

స్వావలంబన దిశగా
సాధికారతే లక్ష్యంగా
ఓ ధీరవనితా,ఓ జగజ్జేత...!!

Wednesday, April 18, 2018

జాగేలా ప్రభూ ననుజేర
నిను తలపులలో నిలిపి ఉంచా
నా ఎద తలుపులు తెరిచే ఉంచా
రావేరా బిరబిర నను చేర
రావేరా పరుగున దరి చేర
యుగయుగాలుగా నా ప్రతీక్ష
నువు లేక ఈ బ్రతుకే శిక్ష

1.కథలెన్నో నీ గాథ లెన్నో
తార్కాణాలు పు రాణాలెన్నో
మహిమలు లీలలు మరియింకెన్నో
ఋజువులు సాక్ష్యాలింకెన్నెన్నో
నా నమ్మికనే వమ్ము సేయకా
నా ఆశను అడియాస జేయకా

2.సరసములాడుతు సిరితో నుంటివొ
ఘన భక్తుల కడకేగి యుంటివో
నాపై కినుకను పూనియుంటివో
నా మెరలను వినీ వినకయుంటివో
రా తీరిక లేకున్న నను రప్పించుకో
పరమ దయాళుడ వని మెప్పించుకొ
అన్నయ్య పక్కనుంటె చాలు
బ్రతుకంత నందన వనాలు
అన్నయ్య అండగుంటె చాలు
గుండెల్లొ ధైర్య సాహసాలు

రాముడంటి అన్నయ్య తాను
నేను లక్ష్మణుడిగ మారిపోతాను
ధర్మరాజె అన్నయ్య నాకు
సిద్దపడిపోతాను తన సేవకు

అన్నయ్య తోడుగుంటె చాలు
ఛేదించ గలను ప్రతి సవాలు
అన్నయ్య వెన్నుతడితె చాలు
గెలిచేయగలను అన్ని యుద్ధాలు

అమ్మలాగ నన్ను లాలిస్తాడు
నాన్నలాగ నన్ను నడిపిస్తాడు
నాకొంటెచేష్టలు భరిస్తాడు
సరదాగతీసుకొని క్షమిస్తాడు

అన్నయ్యఅంటె నాకు అపురూపం
అన్నయ్యె దేవుడి ప్రతిరూపం
అన్నయ్యతానౌట నాకువరం
అన్నగా నేను పుట్టి తీర్చుకుంట తన ఋణం
పెదవి మీద విరిసెడి మరుమల్లివి నువ్వు
కన్నుల్లో ఉబికెడి కడలివి నువ్వు
మనసుంతా పరుచుకున్న వెన్నెల నువ్వు
గుండెలోన ఎగసిపడే లావా నువ్వు
ప్రాణవాయువు నువ్వు ప్రాణదీపము నువ్వు
ప్రాణ పంచకమీవు

1.చిరుగాలిగ ననుతాకే పులకింతవు నువ్వు
చిరుజల్లుగ మదితడిపే గిలిగింతవు నువ్వు
చిరుచెమటల సెగరేపే కవ్వింతవు నువ్వు
చిరునామా నీదిక నా ఎద యగు వింతవు నువ్వు
నా భావము నువ్వు
నా భవమువు నువ్వు
నా స్నేహము నువ్వు

2.చేరువయీ చేరరాని దూరము నువ్వు
దూరమైనా చేరగలుగు తీరము నువ్వు
నిర్వచించ గలుగలేని బంధము నువ్వు
జన్మలుగా వీడని అనుబంధము నువ్వు
నా బ్రతుకువు నువ్వు నా భవితవు నువ్వు
వీడ్కోలు పలుకలేని ఆత్మవు నువ్వు-అంతరాత్మవు నువ్వు