Monday, July 30, 2018


గోవింద గోవింద అభివందనం
పాహిముకుందా పరిమార్చు భవబంధనం
తిరుమల గిరివాస ఇదెనీకు శ్రీచందనం
వేంకటాచలమిల నవనందనం

1.నిత్యవైభోగ నీ నిజ దర్శనం
జన్మాంతర కృతదోషభంజనం
కృష్ణవిగ్రహనీ రూపేమనోరంజనం
దుఃఖహారక నీహాసమే నిరంజనం

2.ఆపదమొక్కుల వాడ
సార్థకనామధేయుడ
శ్రీనివాసుడ సిరిరేడ
సంపద వరదుడ
నామస్మరణతొ నామాలవాడ
దరిజేర్చుకోనా ఎదమాలవాడ

Saturday, July 28, 2018

https://youtu.be/7zalZd09Vh0?si=dn6NGtiDAq_VKd7F


అలుపుసొలుపు లేక
నిమిషమాగిపోక
చెయ్యాలి సాధన
గెలుపొకటే భావన
జీవఝరే నీకు గుఱి
జలధి వరకు సాగు మఱి

1.ప్రయత్నమే ప్రశస్తము
పాల్గొంటెనె ప్రాప్తము
ఓటమి నూహించి
ఆటమానుకోకు
నెగ్గేవరకెపుడూ
తల ఒగ్గి ఉండకు
విత్తనమై మొలకెత్తు
వృక్షమల్లె రేకెత్తు

2.విజయలక్ష్మి కొరకు
ఊపిరున్న వరకు
అనుయోగమే చెయ్యి
అనుమానం వదిలెయ్యి
నెరవేరును సంకల్పం
విజితి కైపు అనల్పం
పిపీలికం నీకు ప్రతి
పట్టుదలకు ప్రతినిధి

Friday, July 27, 2018

మరచినావ మహేశా
నీకు మహిమలున్న సంగతి
బధిరునివైపొయినావా
నీ భక్తులకెవరు గతి
(పర)ధ్యానమింక వీడరా
ధ్యాసపెట్టి చూడరా
ముక్కుమూసుకొంటు మమ్ము
లెఖ్ఖచేయవేలరా

1.మరణము తప్పించినావు మార్కండేయునికి
ముక్తి ప్రసాదించినావు శ్రీ కరి నాగులకు
మొరలిడినదె తడవుగా ఆపదల్లొ కాచేవు
పరమదయాళువన్న బిరుదెపుడో పొందినావు

2.(పార్వతమ్మకైన)అమ్మకైన వినిపించద
ఆర్తజనుల వినతి
తొలిపూజలు గొనుటకేన నీతనయుడు గణపతి
షణ్ముఖునికి తెలియదా చేరదీయు పద్ధతి
అయ్యప్పా ఎరుగడా ఏమిటొ శరణాగతి

3.అంతులేని వేదనను భరించాను మౌనంగా
గుండెకోతనైన స్వీక రించాను నీ వరంగ
హద్దుఅదుపు లేదా నువు పెట్టే పరీక్షకు
ఈ తీవ్రత సరిపోదా  నువువేసిన శిక్షకు



Tuesday, July 24, 2018


అనివార్యమేఅని తెలిసినా ఉద్యోగధర్మమే ఐనా
బంధాలనొదలలేకా బదిలీని సైచలేకా
అతలాకుతలం ప్రభుత్వ ఉద్యోగి జీవితం
సర్కారు వేతనజీవి సతమతమే సతతం సతతం

1.బ్రతుకు పోరాటంలో వలసలు అతిసామాన్యం
బాధ్యతలను నిర్వహించగా అనుబంధం పద్మవ్యూహం
ఉన్నతకాలం ఆనందం పంచాలి
విడిచివెళ్ళినా గాని మధుర స్మృతులు మిగల్చాలి
మనదైన ముద్రను శాశ్వతంగ వేయాలి
ఎన్నినాళ్ళు ఐనాగాని గుర్తుండిపోవాలి

2.విద్యార్థులందరికీ విజ్ఞానం అందించాలి
మానవత్వ విలువలను ప్రతివారికి బోధించాలి
పెదవుల పూదోటల్లో నవ్వులు పూయించాలి
సాటి ఉద్యోగులతోనూ సఖ్యతగా మెలగాలి
ఉన్నతాధికారుల మెప్పుపొందగలగాలి
ఫలానా వారంటూ ప్రజలు మనను కొనియాడాలి

Saturday, July 21, 2018

కలనైన కలుసుకుందాము
వెతలన్ని పంచుకుందాము
జతగూడ నోచలేకున్నా
చితిదాక తోడు ఉందాము

1.గతస్మృతులు  నెమరు వేసుకుంటూ
అనుభూతులు కల బోసుకుంటూ
ముడి వడని బంధం మనదన్నా
సంఘమంత చోద్యమనుకున్నా
అనిర్వచనీయమైన అనురాగం ఆలపిద్దాం
అమలినభావుకతతో స్నేహగీతి  వినిపిద్దాం

2.నీ కష్టం నాదిగ తలపోస్తూ
నా వేదన నీదిగ భరియిస్తూ
అవసరాల్లొ ఆసరానందిస్తూ
ఆపదల్లొ ఆదుకొంటుంటూ
నిజమైన మైత్రికి పర్యాయపదమౌదాం
చెలిమి అంటె ఏమిటో లోకానికి నేర్పిద్దాం

Tuesday, July 17, 2018

పలుకుతోనె జీవితం
మాటతోనె మనుగడ
నా వాక్కున తేనియలే చిలికించవె శ్రీవాణి
నా నుడుగులు మీగడలా తలపించవె గీర్దేవి


1.శరముల కానీయకు నాఅక్షరమ్ముల
ఎదుటివారి గుండెలను గాయపరచగ
పదముల నను పదిలముగా వాడగజేయి
ఎద ఎద కవి నవనీతముగా తోచగా

వందనాలు గొనవే వీణాపాణి
నా నాలుక  స్థిరవాసము చేసుకోగా
ప్రణతులందుకొనవే వేదాగ్రణి
నా గళమే అవనీ ఇక నీ దేవళముగా

 2.నా కవనము నువు మనియెడి పూవనమైపోనీ
పాఠకులకు సుమగంధము మకరందము పంచగా
నా గీతములన్ని నీకు నగలై ఒప్పారనీ
సాహిత్యము సంగీతము ధగధగలతొ మెరియగా

నమస్సులివిగో సారస్వత సామ్రాజ్ఞి
క్రీగంటనైన నన్ను నువుకాంచగా
చేజోతలందుకోవె పారాయణి
నాతలపై చేయుంచి దీవెనలందించగా

Monday, July 16, 2018



తొలిపూజ గైకొనే ఘన దైవమా
మా గణపతి కావుమా
పలువిధముల నీకు పబ్బతులివె గొనుమా

1.మేలుకొన్న వెంటనే విఘ్ననాయకా
నీ రూపమె చూసెదము మరియేది కనక
మొదటి మాట పలికెదము శ్రీ గణనాయకా
నీ నామమొక్కటే ఇంకేది అనక

కష్టమొచ్చినా కడకు నిట్టూర్చినా
తలుచుకునేది నిన్నె సిద్దీ వినాయకా

2.ఏ చోటికి పనిమీద బయలుదేరినా
ముందుగ మొక్కేదినీకె మూషక వాహన
శుభకార్యమేదీ తలపెట్టినా
తొలుత నిన్నె కొలిచేము గజాననా

అణువణువున నీవుగ మా బ్రతుకువైనావు
కడతేర్చి దరిజేర్చు కరుణాంతరంగా

https://www.4shared.com/s/fINaOK3KNee

Sunday, July 15, 2018



హితము కూర్చని మతములేల
మానవత నేర్పని బోధలేల
హిందువైనా ముస్లిమైనా
బంధుజనులమె అందరం
రాముడైనా రహీమైనా అందకోరా మనసలాం
కృష్ణుడైనా క్రీస్తువైన అందుకోరా వందనం


1.శిశువుకెక్కడ గురుతులుండును
కులముమతముజాతులెరుగ
మనిషికెవ్వరు మార్గదర్శి
సాటిమనిషిని ద్వేషించగ
నేల సర్వుల తల్లిరా
అన్నమే మన నాన్నరా
ఎరుపువర్ణపు రక్తమే
ఎల్లరుల కలిపెడి బంధమౌరా

2. గీత బైబిల్ ఖురానెప్పుడు
భేదభావము నూరిపోసే
ఇరుగు పోరుగు ఎదలనెప్పుడు
గుడి మసీదులు వేరుచేసే
భారతీయత జాతిరా
ప్రేమతత్వమె నీతిరా
ఒకరినొకరు గౌరవించే
ఆనవాయతి మేలురా
వచ్చీనప్పూడల్లా నిన్ను వాటేసుకుంటానె పిల్లా
ముట్టీనప్పూడల్లా నిన్ను ముద్దెంటుకుంటానె పిల్లా
కలలోకొచ్చీనప్పుడల్లా
నిన్నుహత్తూకుంటానె పిల్లా
కబురు ముట్టీనప్పూడల్లా
పెరుగు ముద్దెట్టుకుంటానె పిల్లా

తగవూ నాతోనా  పిల్లా ఆపిక అలకలను
తగదే నీకిదీ అమ్మీ సరదాకైననూ

1.పొద్దూ పొద్దంత నిన్నూ బ్రతిమాలుకున్నా గాని
సుద్దుల సద్దే లేకా  మూతిముడుచూకుంటుంటావు
అద్దారాతిరి నువ్వు గుర్తూకొస్తుంటావు
వద్దూవద్దన్నగాని నన్ను గిచ్చీపోతుంటావు

తగవూ నాతోనా పిల్లా ఆపిక అలకలను
తగదే నీకిదీ అమ్మీ సరదాకైననూ

2.చుక్కలమల్లేలన్ని తుంచి సిగలో తురిమెదనమ్మి
వెన్నెల దుప్పటితెచ్చి పడకన పరిచెద నమ్మి
నీచేతి గాజులు మీటి కొత్తపాటలు కట్టెదనమ్మి
పూచేటి నవ్వులతోటి
సరసాల ముంచెద నమ్మి

తగవూ నాతోనా  పిల్లా ఆపిక అలకలను
తగదే నీకిదీ అమ్మీ సరదాకైననూ


విషాదమే పలికే వీణను మ్రోగించకు
వివాదమే రేపే వాదన పొడిగించకు
మరపునీకు హాయినిస్తే తలపు తలుపు తీయకు
రేపు నిన్ను భయపెడుతుందని నేడు నగవు వీడకు

చింతగూర్చి ఎందుకురా అనవరత చింతన
సంతసాల నందుమురా సమయం చేజార్చక

సంస్కారం నేర్పుతుంది నీకు దువ్వెన
శిఖరాన్ని చేర్చుతుంది నిన్ను నిచ్చెన
మానవతకు కావాలి నీవె వంతెన
అసాధ్యమే సాధ్యమురా చేయగ నువు సాధన

చింతగూర్చి ఎందుకురా అనవరత చింతన
సంతసాల నందుమురా సమయం చేజార్చక


దాహాన్ని తీర్చుతుంది పారేసెలయేరు
త్యాగాన్ని బోధిస్తుంది పచ్చనైన చెట్టు తీరు
మడమతిప్పనప్పుడే గమ్యాలు నిను చేరు
చిత్తశుద్ధి ఉన్నపుడే లక్ష్యాలు నెరవేరు

చింతగూర్చి ఎందుకురా అనవరత చింతన
సంతసాల నందుమురా సమయం చేజార్చక

***   ***   ***  ***   ***   ***   ***   ***  

ఏది ఆనందమో
ఎవరికేది మోదమో
ఏది సుధలు వర్షించే
రసరమ్య రాగమో
ఏది దిగులు తొలగించే
భవభవ్యయోగమో

1.తుషారమే మణులై మెరిసే
ఉషాకిరణ దర్శనమో
సమీరమే తనువు తడిమే
ఆత్మీయ స్పర్శసౌఖ్యమో
సీతాకోకచిలుకలు ఎగిరే
పుష్పవన దృశ్యమో
గిరిశిఖర చుంబనతో
పులకించే మేఘమైకమో

2.లేడికూనలా దుమికే
జలపాత పరవశమో
చిరుజల్లుకు తడిసిన నేలన
గరికవిరుల సంబరమో
విరిసిన హరివిల్లుకు మురిసే
ప్రకృతికాంత ఆహ్లాదమో
వెన్నెల రేయి కొలను కలువకు
కలిగే కడు తన్మయమో
https://www.4shared.com/s/ffzpUKgJCgm

Friday, July 13, 2018

ఫలించిన కలవే నీవు-వరించిన వరమే నీవు
హృదయాంతరాలలోని-ప్రణయ భావన నీవు
జన్మాంతరాలనుండి-పెనవేసిన బంధము నీవు
త్వమేవాహమైన వేళ-తన్మయత్వమేనీవు

ఆనందము నువ్వు ఆహ్లాదము నువ్వు
తలపులకే పులకరమొలికే-అనుభూతివి నువ్వు
జీవన 'గీత'వు నువ్వు

1.నన్ను లాలిస్తూ అమ్మవైపోతావు
నడవడికను సరిదిద్దుతూ నాన్నగా మారుతావు
లౌక్యాన్ని బోధిస్తూ గురుతుల్యవౌతావు
నీడలాగ తోడుంటూ నేస్తమే నీవైనావు
బేలగా అడుగిడినావు భార్యామణివైనావు
ఆలిగా ముడిపడినావు అర్ధాంగివైనావు

ఆనందము నువ్వు ఆహ్లాదము నువ్వు
తలపులకే పులకరమొలికే
అనుభూతివి నువ్వు జీవన 'గీత'వు నువు

2.ఇంటికే వన్నెలుతెచ్చే-ఇల్లాలివైనావు
మాటకే పదుగురు మెచ్చే-మమతవే నీవైనావు
మా చిన్ని సామ్రజ్యాన మహారాణివే నీవు
పలు చింతల కాపురాన చింతామణివైనావు
ఊరుఊరంతా బాంధవ్యం కలిపేస్తావు
ఆతిథ్యం అన్నపదానికి మరో అర్థమేనీవు

ఆనందము నువ్వు ఆహ్లాదము నువ్వు
తలపులకే పులకరమొలికే అనుభూతివి నువ్వు
జీవనగీతవు నువ్వు

Tuesday, July 10, 2018

మెరిసి కురిసె ఘన మేఘం..
తడిసి మురిసె అవని దేహం
పాడెను ప్రకృతి అమృతవర్షిణి రాగం
పరవశించి నర్తించెను హృదయ మయూరం

1.పిల్ల తెమ్మెరలు అల్లన వీచగ
నీటి తుంపరలు ఝల్లన తాకగ
మోడులు సైతం చివురులు వేయగ
వర్ష ఋతువు హర్షాల నీయగ

పాడెను ప్రకృతి అమృతవర్షిణి రాగం
పరవశించి నర్తించెను హృదయ మయూరం


2.కరువు కాటకముల దరిరానీయక
చెరువులు నదులు
కళకళలాడగ
విశేషమ్ముగా పంటలు పండగ
కృషీవలుడి కిల కలలు పండగ

పాడెను ప్రకృతి అమృతవర్షిణి రాగం
పరవశించి నర్తించెను హృదయ మయూరం


https://www.4shared.com/s/fx3PCSyP_gm

Saturday, July 7, 2018

నిద్దురతో దూరము
మనసుకున్న భారము
శయనమె పరిహారము
వెతల చితుల హననము

గాయాలకు ఔషధము
బడలికకుపశమనము
మేను నేను పరస్పరం
మెలకువయే వరకు ఎరికివారం

కలలకు ఉద్యానము
కథలకు ఉద్దీపనం
వరించినంత భాగ్యము
దరిజేరకున్న  వైరాగ్యము

నిద్ర ఒక రోగము
నిద్ర వైభోగము
నిద్ర ఒక యోగము
నిద్ర మనిషికి యోగము