Thursday, April 19, 2018

"ఓధీర వనిత.,ఓ జగజ్జేత"


ఓ ఆడపిల్లా.. 'ఆడ'పిల్లవె
నువ్వేనాటికైనా...
ఓ లేడి'కూనా...
విషాదభరితమె 
నీకథ ఏ'నాటికైనా

అండంగాఉన్ననాటి నుండి
గండాలే నీ మనుగడకెపుడైనా
పసికందుగ చిన్ననాటి నుండి
అగచాట్లే అడుగుతీసి అడుగేసినా

ఆంక్షల లక్ష్మణ రేఖలు
అనుక్షణం అగ్నిపరీక్షలు
ఓ భూజాతా ,ఓ వహ్నిపునీతా

బాల్యాన అమ్ముడయే దైన్యమైనా
బాలికవధూ దురాచారమైనా
అలనాడు స్త్రీగా విద్యకు దూరమైనా
బాల్యవింతతువుగ బ్రతుకు భారమైనా
నిస్సహాయంగా, ఏతోడు లేక
నిర్హేతుకంగా ,నీకుమద్దతే లేక
బాలగా తలవంచావు
బేలగా విలపించావు

ఆంక్షల లక్ష్మణ రేఖలు
అనుక్షణం అగ్నిపరీక్షలు
ఓభూజాతా,ఓ వహ్నిపునీతా

వికృతసతీసహగమనమైనా
ఒకనాటి కన్యా శుల్కమైనా
ఈనాటి వరకట్న పిశాచమైనా
ఉద్యోగినిగా ఆకాశపు సగమైనా

ప్రకృతే పదేపదే బెదిరించినా
సమాజమే హద్దు నిర్ణయించినా
వంచితగా వేదన సహియించావు
పరిణీతగా వెతలు భరియించావు

ఆంక్షల లక్ష్మణ రేఖలు
అనుక్షణం అగ్నిపరీక్షలు
ఓభూజాతా,ఓ వహ్ని పునీతా

 3.రోదసిలో శోధనలే చేసినా
క్రీడలలో చరిత్రలే రాసినా
పదవులతో ప్రపంచమే ఏలినా
హిమవన్నగ శిఖరాల చేరినా

వివక్షనే ఎదురుకొన్నాగాని
విధేనీకు ఎదురుతిరిగిన గాని
నిన్ను నీవు నిరూపించుకుంటున్నావు
పోరాడిమరీ సాధించు కుంటున్నావు

స్వావలంబన దిశగా
సాధికారతే లక్ష్యంగా
ఓ ధీరవనితా,ఓ జగజ్జేత...!!