Friday, July 13, 2018

ఫలించిన కలవే నీవు-వరించిన వరమే నీవు
హృదయాంతరాలలోని-ప్రణయ భావన నీవు
జన్మాంతరాలనుండి-పెనవేసిన బంధము నీవు
త్వమేవాహమైన వేళ-తన్మయత్వమేనీవు

ఆనందము నువ్వు ఆహ్లాదము నువ్వు
తలపులకే పులకరమొలికే-అనుభూతివి నువ్వు
జీవన 'గీత'వు నువ్వు

1.నన్ను లాలిస్తూ అమ్మవైపోతావు
నడవడికను సరిదిద్దుతూ నాన్నగా మారుతావు
లౌక్యాన్ని బోధిస్తూ గురుతుల్యవౌతావు
నీడలాగ తోడుంటూ నేస్తమే నీవైనావు
బేలగా అడుగిడినావు భార్యామణివైనావు
ఆలిగా ముడిపడినావు అర్ధాంగివైనావు

ఆనందము నువ్వు ఆహ్లాదము నువ్వు
తలపులకే పులకరమొలికే
అనుభూతివి నువ్వు జీవన 'గీత'వు నువు

2.ఇంటికే వన్నెలుతెచ్చే-ఇల్లాలివైనావు
మాటకే పదుగురు మెచ్చే-మమతవే నీవైనావు
మా చిన్ని సామ్రజ్యాన మహారాణివే నీవు
పలు చింతల కాపురాన చింతామణివైనావు
ఊరుఊరంతా బాంధవ్యం కలిపేస్తావు
ఆతిథ్యం అన్నపదానికి మరో అర్థమేనీవు

ఆనందము నువ్వు ఆహ్లాదము నువ్వు
తలపులకే పులకరమొలికే అనుభూతివి నువ్వు
జీవనగీతవు నువ్వు