Monday, August 3, 2009

మేలుకో నరహరే మేలుకో
ఏలుకో ధర్మపురి హరే ఏలుకో –మమ్మేలుకో

1. నిన్న అందరి కోర్కెలు తీర్చగా
నిశిలొ అదమరచి నిదురించేవా
భానుడుదయించె మేలుకో
బాధలను కడతేర్చ మమ్మేలుకో

2. ఆశలనెన్నో కలిపించేవు
అంతలొ నిన్నే మరపించేవు
వరదాభయ ఇది భావ్యమేనా
నరసింహా నీ కిది న్యాయమౌనా

3. మాయానిలయం ఈ లోకం
విషవలయం ఈ జీవితం
మమకారములే తొలగించుమా
నీ కరుణమాపై కురిపించుమా

4. తూరుపు సింధూరం
వెలికి వచ్చెను నీకోసం
నీవే నిండిన నా హృదయం
నీ పూజకు కోసిన మందారం

5. చదివేము నీకై సుప్రభాతాలు
పాడేము ఓదేవా మేలుకొలుపులు
హాయిగ వింటూ శయనించేవా
ఆదిశేషుని పైన పవళించేవా

6. మాయమ్మ మాలక్ష్మి నీవైన చెప్పవే
మాపురవేల్పుని మేలుకొలుపవే
పొద్దెక్కిపోతోంది లేవమని
సద్దుమణిగాకా తిరిగి బజ్జోమని

7. దూరతీరాలనుండి భక్తులు వచ్చారు
గోదారినీటిలో నిండా మునిగారు
నీరు వడయుచునుండ నీగుడి చేరారు
చలికి పాపము వారు వణుకుతు నిలిచారు

8. పాపులను దునుచుటకు నీవే
జాగేల సంసిద్ధుడవు కావే
నారసింహేశ మేలుకో
దష్టసంహారా మేలుకో

9. భూసురుల వేద మంత్రాలతో
భక్తుల గోవింద నామాలతో
మారు మ్రోగెను నీదు ఆలయం
మెలకువ కాదంటె నమ్మరీజనం

10. దారి చూపర దేవ దేవా
చీకటి నుండి వెలుతురు లోనికి
దరిజేర్చరారా నారసింహా
అజ్ఞానము నుండి జ్ఞానావనికి
మార్గమేది ప్రహ్లాద రక్షకా
వేదననుండి నీపద సన్నిధికి
మేలుకో మమ్మేలుకో
ఏలుకో మమ్మేలుకో

No comments: