Monday, May 4, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

విఘ్నాధిపతివి కదా వినాయకా
కరోనా వ్యాప్తికి అవరోధము కల్పించరా
సంకటహర గణపతీ అభీష్టదాయకా
వైరస్ బారినుండి మము కడతేర్చరా
అన్యధా నాస్తి శరణాగతి నీయరా
నిను వినా వేడనైతి వేగమె కరుణించరా

1.తొలుత నిన్ను తలువకుంటె తప్పదు ఆటంకము
నిను పూజించకుండ సఫలమవదు కార్యము
ఇష్టదైవ మీవేయని స్పష్టపరచినానయ్యా
కష్టాలను తీర్చిమమ్ము గట్టెక్కించవయ్య
అన్యధా నాస్తి శరణాగతి నీయరా
నిను వినా వేడనైతి వేగమె కరుణించరా

2.చిన్ననాటినుండి నిన్ను నమ్మికొలిచినానయ్యా
ఎన్నడైనగాని స్వామి కోరినదొసగితివయ్యా
మన్నించర మహాకాయ నా పొరపాట్లను
పరిమార్చర ప్రమధనాథ నా ఇక్కట్లను
అన్యధా నాస్తి శరణాగతి నీయరా
నిను వినా వేడనైతి వేగమె కరుణించరా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కొందరి నవ్వుల్లో పూసేను మల్లెలు
కొందరి నవ్వుల్లో విరిసేను జాజులు
ముత్యాలు రాల్చేను మరికొందరి నవ్వులు
రతనాలు పొదుగుతూ మెరిపించేనవ్వులు
నవపారిజాతాలే నెచ్చెలీ నే మెచ్చిన నీ నవ్వులు

1.మొగిలి రేకులై గుచ్చేను కొన్ని నవ్వులు
ముద్దబంతులై విచ్చేను కొన్ని నవ్వులు
చేమంతుల ఘాటుతో కొన్ని నవ్వులు
గులాబీ నాజూకుతొ మరికొన్ని నవ్వులు
నవపారిజాతాలే నెచ్చెలీ నే మెచ్చిన నీ నవ్వులు

2.తంగేడు పూలంటి పాల నవ్వులు
గన్నేరు పూలవంటి గోల నవ్వులు
నందివర్దనాలే నవ్వీనవ్వని నవ్వులు
దవనంలా మత్తుగొలుపు మరికొన్ని నవ్వులు
నవపారిజాతాలే నెచ్చెలీ నే మెచ్చిన నీ నవ్వులు
బ్రహ్మ భువికి రాలేకా అమ్మను పంపాడు
ప్రేమనంత రంగరించి అమ్మద్వార వొంపాడు
సృష్టికే మూలంగా అమ్మని మలిచాడు
అమ్మ ప్రేమకోసమే జన్మలెన్నొ ఎత్తాడు

1.రెండు భిన్న కణాలతో గమ్మత్తే చేసాడు
తొమ్మిది మాసాలూ ప్రేగుతొ ముడివేసాడు
ఊపిరిలో ఊపిరిగా అమ్మతొ జతచేసాడు
దేహాత్మ భావనగా పుట్టుకనేర్పరచాడు

2.శిశువుగ ఉద్భవించ అమ్మ ఒడిలొ వేసాడు
స్తన్యమునే అమృతముని గ్రోలగ చేసాడు
బ్రతుకునేర్పు గురువుగా అమ్మను మార్చాడు
సాటిలేని అనుబంధం అమ్మతో కూర్చాడు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నీ గళమున పొంగి పొరలిందనా
నా గొంతులొ నింపావు గరళాన్ని
నీ కన్ను భగభగ మండిందనా
నా గుండెలొ రేపావు మంటలని
ఎందుకయా ఓ నీలకంఠా భావ్యమా పరమదయాళా
దేనికయా ఓ ఫాలనేత్రా న్యాయమా ఆశ్రితపాలా

1.గంగలాగ నిరంతం నా కంఠ మంతా కఫం
ఆమ్లంతో జ్వలిస్తోంది నా ఉరఃపంజరం
అలసటగా సాగుతోంది నాహృదయ పనితనం
నాడులే సుడివడి నడక నరకయాతనం
ఎందుకయా ఓ వైద్యనాథా భావ్యమా పరమదయాళా
దేనికయా మృత్యుంజయా న్యాయమా ఆశ్రితపాలా

2.ప్రకోపించ సాగింది కపాలాన పైత్యరసం
ఒంటినాక్రమిస్తోంది విచ్చల విడి వాతం
నరనరాన సన్నగిల్లె పట్టరాని పటుత్వం
సడలనీకు నీ ఎడల ఏమాత్రం విశ్వాసం
ఎందుకయా ఓసుందరేశా  భావ్యమా పరమదయాళా
దేనికయా ఓ కాలకాలా న్యాయమా ఆశ్రితపాలా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హిందోళం

రేపంటూ ఒకటుంది
చీకటులకు సెలవంది
చిగురించును వసంతాలు
ప్రభవించును జీవితాలు

1.ఒంటరినని ఇపుడెంచక
దిగులేల ఏకాంతమనుభవించక
ఆత్మీయుల నడుమన కదలక
గడపడం వరమే ఇంచుక

2.అరచేతి స్వర్గం వదలక
అంబరాన ఉందని భావించక
బలపడు బంధం ప్రేమ దీపిక
కాపురాన కరువిక అరమరిక

3.శుచీ శుభ్రత శుభసూచిక
కల్మష రహిత మలయవీచిక
శతమానం భవతి ఆయువిక
అంతామన మంచికె గనక
రచన,స్వరకల్పన&గానం :డా.రాఖీ

చిగురుటాకూ కదలమాకూ కీచురాయీ ఈలనాపూ
చందమామా తప్పుకో ఇక మబ్బుచాటుకూ
చీమభామా నీవు సైతం చిటుకు మనకూ
చిన్నారి కన్నయ్యా నిదురపోయేనూ
నా జోల పాటకూ ఈ లాలి పాటకూ
లాలీజో లాలీజో లాలిలాలి లాలీజో

1.ఆటలాడీ అలసిపోయెను చల్లగాలీ వీచాలీ
పాలుతాగక గోల చేసెను నీవే బుజ్జగించాలీ
కిర్రుమనకే ఊయలమ్మా నిదురలోకి జారసాగే
జారిపడకే కొయ్యబొమ్మా ఉలికిపడుతూ బెదరసాగే
లాలీజో లాలీజో లాలిలాలి లాలీజో

2.వంత పాడగ చింత పడకుర పాటలన్నీ నేర్పుతానుర
వీడిపోదను భీతి వీడర హత్తుకొని నిన్నూరడింతుర
కలవరించకు కన్నయ్యా కలత నిదుర ఏలయ్యా
బంగారూ కలలు కంటూ విహరించి రారా విశ్వవీథుల
లాలీజో లాలీజో లాలిలాలి లాలీజో
రచన,స్వరకల్పన&డా.రాఖీ

ప్రేమని మోసుకొస్తుంది
ఒక అల్లరి పలకరింపు
బంధం చిగురింపజేస్తుంది
ఒక చల్లని చిలకరింపు
మానవీయ బంధాలను మించి ఏమున్నది
మహదానందం
మనసువిప్పి మాటాడితే జీవితాన
మకరందం

1.మనుషులమని మరిచిపోయి ముసుగులేసుకొంటాము
కులమతాల రంగులను మేన పూసుకొంటాము
ఎక్కించే రక్తానికి ఎవరిదైన ఎరుపు రంగె
కొట్టుకునే గుండెలధ్వని లబ్ డబ్ లబ్ డబే

2.సంపన్నవర్గమైన తిను అన్నం పరిమితమే
సబ్బండ వర్గానికైనా ఆకలి తీరగ ఉచితమే
ఉన్నోడికి లేనోడికి తేడాయే లేదులే
సంతృప్తి లేనప్పుడు ఏ బ్రతుకూ చేదేలే

3.ఇవ్వడమను గుణానికి పేదతనం తెలియదు
లోభత్వానికీ ఎంతగ ఉన్నా చాలనేచాలదు
పోగేసుక పోయేందుకు నూలుపోగూ రాదు
సాయపడగ సిద్ధపడితె ఏ మాత్రం తరిగిపోదు