Tuesday, August 6, 2019

కలిసి ఉంటే కలదా సుఖము
బతుకంతా కన్నీటి పర్యంతము
కలో గంజో తాగిన నయము
వేరు బడితె దక్కుతుంది ఆత్మ గౌరవం-తెలంగాణ ఆత్మగౌరవం

1. వేరెవరైనా తెలుగువాడి వైపు
వేలు చూపినా చేయిచేయి కలుపు
సాటి ఆంధ్రుడే నిన్ను మంటగలుపు
ఆ క్షణమే కదా వేర్పాటునుసిగొలుపు
ఇంటికే పెద్దన్న తమ్ముల వంచించ తగున
కంచే చేనుమేస్తే పంట ఇంక మిగులునా

2. ఎందుకు పాండవులు ఐదూళ్ళనడిగారు
మోచేతి నీళ్లు వాళ్ళు తాగలేక
పీడిత దేశాలెందుకు స్వాతంత్ర్యం కోరాయి
బానిస దుర్భర బ్రతుకులు మోసాయి గనక
అయిన వారికి ఆకుల్లోన కానివారికి కంచాల్లోన
వడ్డించేది మనోడేకద ఉంచాలెందుకు పస్తుల్లోన
వడ్డించినా అడుగులో బొడుగులో ఎంగిళ్ళేనా

3. నక్కలు వేదాలను వల్లిస్తే నమ్మాలా
తోడేళ్ళు ధర్మాలు చెబితె పాటించాలా
దొరికినంతదోచుకొంటు-భూకబ్జాల్జేసుకొంటు
తెల్లవాడి తరహాలో ఏకై వచ్చి మేకనిపిస్తు
అంటారు కలిసి ఉంటె కలదు సుఖమని
చెపుతారు విడిపోవుట అవసరమా అని
రగులుతోంది తెలంగాణా
ప్రతిగుండె ఆరిపోని రావణకాష్ఠంలా
పారుతోంది నెత్తురే వరదలా
నరనరాన ఉరకలెత్తె గంగాప్రవాహంలా
సాగుతోంది ఉద్యమం-సత్యాగ్రహాలతో
అంతిమపోరేయనే కనని వినని బాటలో

1. లాగివేయడానికి దిక్కులేని శవాలా
విద్యార్థులంటేనే అనాధలనుకోవాలా
న్యాయమైన ఆకాంక్షలు మానుకోవాలా
ఆటవికుల రాజ్యమని భావించాలా

2. వీలైతే సమర్థించు నిజాయితీగ ఉద్యమాన్ని
చేతనైతె ఎఱుక పఱచు నీ సంఘీభావాన్ని
నీచమైన యోచనతో నీరుగార్చబోకురా
కుటిలమైన రీతిలో కూల్చివేయబోకురా

3. నోటిముందు కూటిని త్రోసివేయ న్యాయమా
వెన్నుపోటుపొడుచుటకై కాలుదువ్వ ధర్మమా
ఇన్నాళ్ళు లేని బాధ ఇప్పుడె మీకనిపిస్తోంది
తెలంగాణ అన్నప్పుడె ఉలుకు మీకు పుడుతోంది
తెలంగాణ అన్నప్పుడె సమైక్య రాగమొస్తోంది
ఆంధ్రా కోస్తా రాయలసీమ ప్రత్యేకత నిన దిస్తోంది
హాస్యాస్పదంగా ప్రత్యేక హైద్రా బాధని వినిపిస్తోంది

కసాయి కఱకు పాలన
కబంధ హస్తాల్లొ తెలంగాణా
నైజాము రజాకార్ల జమాన
కళ్ళముందు కదులుతున్న భావన

1. ఏ రాజ్యాంగంలోనిదీ అధికరణ
ప్రజలమనోభావాల ధిక్కరణ
“ ప్రజలకొఱకు ప్రజలచే ప్రజలు ” అనే
మరిచారా ప్రజాస్వామ్య వివరణ

2. దిక్కులేనివయ్యాయి ప్రాథమిక హక్కులు
నడకసాగనీయకుండ ఎన్నెన్ని చిక్కులు
శాంతి స్వేఛ్చలకే కడితే సమాధులు
నిరంకుశత్వానికి ఉండవుగా పుట్టగతులు

3. తిరుగుబాట్లు కావుకదా ఈఉద్యమాలు
ప్రజాకాంక్ష తెలుపుకొనుటకీ సాధనాలు
గదిలొపెట్టినోరుకట్టి కొట్టె ఈ వైనాలు
పులిగమారి పిల్లైనా తీయదా ప్రాణాలు
ఒకే గానం అందరినోట-తెలంగాణం-తెలంగాణం
ఒకేప్రాణం అందరిలోనా-తెలంగాణం-తెలంగాణం
అణగారిన తెలంగాణ అన్నలారా!
మసిబారిన తెలంగాణ తమ్ములారా!!
ఒకటే వాదం తెలంగాణం-మనదొకటే నాదం తెలంగాణం
జైతెలంగాణా!-జైజై తెలంగాణా!!

1. చీకటి కుహరాలు చీల్చుకొని రారండి
ఆశల దీపాలు వెలిగించుకతెండి
మీ బిడియపు శృంఖలాలు ఇకనైనాత్రెంచుకొండి
నిర్లిప్తపు పంజరాలు ఛేదించుక రారండి

2. హీనంగా బాంఛన్ కాల్మొక్తమని అన్నారు
తరతరాలు ఏదో ఒక పీడనలో ఉన్నారు
పనిచాతకాదని తెలివసలే లేదని
అభాండాలనెన్నెన్నో తలమోసి ఉన్నారు

3. అసువులు బాసారు అమాయకులు ఎందరో
ఆత్మార్పణ చేసారు యువకులెందరెందరో
ఎవరికొఱకు సాగుతోంది ఈ దమన కాండ
ప్రతిఒక్కరు నిలవాలి ఉద్యమానికే అండ
తెలంగాణ ఉద్యమానికే అండ
జైతెలంగాణా!-జైజై తెలంగాణా!!
బందులతో ఇబ్బందులు ఒకనాటివేగా
చెఱసాలలు ఉరికొయ్యలు ఇట అలవాటేగా
నరమేధాల్లో నలిగిన చరితే తెలంగాణా
బలిదానాల్లో వెలిగిన ఘనతే తెలంగాణా

1. పోరాడితే పోయేదేమి ప్రాణం మినహా
సాగించరా సమరం నేడు సరికొత్త తరహా
నిరాహార దీక్షలతో నీ నిరసనలు
సత్యాగ్రహాలతో ఆక్షేపణలు
నీ మౌన దీక్షలతో అభ్యర్థనలు
సమ్మెలు,ధర్నాలతో ఆకాంక్షలు

2. అణగారిన భావం నీలో పాతాళ గంగ
దాహాలనే తీర్చేయగా తరుణమిదే ఉప్పొంగ
మేధావులందరూ చేయి చేయి కలుపంగ
యువకులంత ముందు నిలిచి ఉద్యమాలు నడపంగ
వచ్చితీరు తెలంగాణ ప్రత్యేకంగా
ఇచ్చితీరుతుంది ప్రభుత సాదరంగ
ఇనుప బూట్లు తుపాకి బానెట్లు
పొడవలేవు ఉద్యమాని కే తూట్లు
ఏ లాఠీలు గుండెచీల్చుతూటాలు
ఆపలేవు లేవు తెలంగాణ పోరాటాలు
జైతెలంగాణా-జైజై తెలంగాణా

1. దాయాదులమైనామా సొంత ఇంటిలోనే
బిచ్చమెత్తుకోవాలా-హక్కులున్నచోటనే
ప్రజాస్వామ్య భారతంలొ-రెండోజాతి పౌరులమా
తెలంగాణ ప్రజలమంటె-భారతీయిలం కాదా
ఎందుకీ వివక్షా-సహనానికేనా పరీక్షా

2. విద్యార్థులలో కూడ మీ పిల్లలు ఉన్నారు
విచక్షణారహితంగా ఎందుకు కొడుతున్నారు
వైద్యులూ రోగులూ మందొకటే కోరుతుంటె
తెలంగాణ ఇచ్చుటనే అందరుఆశించుతుంటె
ఎందుకీ రాజకీయం-ఎందుకుదొంగాటకీయం

3. నానబెడితె శనగలైన-ఉబ్బిపోవునని తెలియద
తాత్సారం చేస్తుంటే – రక్తమేరులైపారద
ప్రత్యేక తెలంగాణ – అనివార్యంఅనివార్యం
ప్రభుత కళ్లు తెఱవకుంటె-ఇది క్రౌర్యం కడు ఘోరం
ఎప్పుడాగిపోతుంది మారణహోమం
ఏంచేస్తె ఇస్తారో తెలంగాణం
జబ్బ చఱచి సాగరా తమ్ముడా!
ఇజ్జత్కే సవాలిది తమ్ముడా
మానమా ప్రాణమా తమ్ముడా
తెగవేసి తేల్చుకో తమ్ముడా

1. కదంతొక్కి కదలాడు- కదనంలా పోరాడు
గెలుపు నీ లక్ష్యంగా- కడదాకా కలబడు
విజయమో స్వర్గమో వీరుడా
నవోదయం నీదిరా సూర్యుడా

2. ఎన్నాళ్ళీ వివక్షలు-ఎందాక సమీక్షలు
గోటితొ పోయేదానికి-గొడ్డలితో శిక్షలు
సమరమా అమరమా ధీరుడా
చావోరేవో దాటరా నావికుడ

3. సాహసాలు ఉగ్గుపాలు- బలిదానాలోనమాలు
ఉద్యమాల బాటలే-నీకు లాలిపాటలు
తెలంగాణ సాధించర యోధుడా
మడమతిప్పబోకుర అభిమన్యుడా
అమ్మా తెలంగాణా! నీకు వందనం!!
అనాధవనుకోకమ్మా-ఉండగ నీ బిడ్డలం
కంటికి రెప్పలాగ కాచుకుంటాము
ఇంటికి అమ్మోరుగా కొలుచుకుంటాము

1. ఎన్నాళ్ళో నైజాము చెఱలోన మగ్గేవు
ఇంకెన్నాళ్ళో పాలోళ్ళ పాలనలో చిక్కేవు
సవితిపోరు అనాదిగా అనుభవించావమ్మా
బాంచనంటు బ్రతుకుతూ నరకం చవి చూసావమ్మా
ఆన తెలంగాణా..మా ప్రతిన తెలంగాణ
పోరు తెలంగాణా..మా గెలుపు తెలంగాణ ||అమ్మా తెలంగాణా||

2. ఆగమై పోయినాము నీ బిడ్డల మిన్నాళ్ళు
అర్భకులం కాదమ్మా అణగద్రొక్క బడినాము
ఒక్కతాటిపైన ఇప్పటికైన నిలిచాము
గొంతెత్తిజై తెలం గాణఅంటు అరిచాము
జై తెలంగాణా జాగో తమ్ములారా
జైజైతెలంగాణా లెండీ రుద్రమ్మలార ||అమ్మా తెలంగాణా|

3. నెత్తురు పారినా పోరాటం సాగిస్తాం
ప్రాణాలొడ్డైనా నిన్ను కాపాడుకొంటాం
నిక్కచ్చిగ మనకంటూ రాష్ట్రం సాధిస్తాము
తెలంగాణ కీర్తినంత జగమంతా చాటుతాము
జై తెలంగాణ జై శాత వాహనులార
జయహో తెలంగాణ జై కాకతీయులార
ఖని ఆమె హైమ కన వరం-
ఇదిమన తెలంగాణ జిల్లాల వివరం
కొత్తదేది మనలో చేరే అక్కరలేదు-
ఉన్న ఈ పదింటిని వదిలే ప్రసక్తిలేదు

1. గోదావరి ప్రాణహితలు మన జలనిధులు
మానేరు శ్రీరాంసాగర్ మన ప్రాజెక్టులు
ప్రత్తివరిపసుపుచెఱకు మనకు పసిడి పంటలు
కొదవలేదు మనకెప్పుడు పాడీపశుసంపదలు

2. సింగరేణి గనులు తెలంగాణ శిరోమణులు
ఎంత తోడినా తరగవు బంకమన్ను నిల్వలు
ఎన్టీపీసి థర్మల్ యునిట్ విద్యుత్ ప్రదాతలు
పేపర్ జిన్నింగ్ రైస్ మిల్సు మనపారి శ్రామికతలు

3. భేషజాలుఎరుగని మాండలీక తెలుగు మనది
రోషాలను ప్రతిఫలించె పోరాట చరిత మనది
వేదాలకు నిలయమిది-జనపదాల కాలయమిది
బతుకమ్మాయనికోరే ఉత్తమ సంస్కృతి మనది

4. భాగవతం రచియించిన పోతన్న పల్లె మనది
శతకాలు పలికిన శేషప్ప ఊరు మనది
జ్ఞానపీఠి గెలిచిన సినారె ఖ్యాతి మనది
ప్రగతి బాట పట్టించిన పీవీజన్మ భూమి మనది

5. రామయ్య వెలిసిన భద్రాద్రి మనది
రాజన్న వెలిగేటి లెములాడ మనది
చదువులమ్మ నెలకొన్న బాసరనే మనది
నర్సన్న కొలువున్న యాదగిరి మనది-ధర్మపురి మనది


6. కొయ్యనే బొమ్మగ మలిచే నిమ్మల మనది
అగ్గిపెట్టెలోపట్టే చీర నేసే సిరిసిల్ల మనది
ఫిలిగ్రీ కళాకృతుల కరినగరం మనది
తివాచీ ప్రసిద్దమైన ఓరుగల్లు మనది

7. శీతల రంజన్ల సృష్టి ఏదులపురి మనది
ఇత్తడి ప్రతిమల స్రష్ఠ పెంబర్తి మనది
ఖద్దరు చేనేతల విఖ్యాతజగతి మనది
బిర్యానంటె నోరూరే హైద్రాబాదు మనది

8. శతావధాని కృష్ణమాచార్య కోరుట్ల మనది
అభినవ పోతన వానమమలై చెన్నూరు మనది
రంగులకల నర్సింగరావు పుట్టిన మట్టిది
కత్తివీరుడు కాంతారావును కన్నపుడమిది

9. సింహమెక్కిన శాతవాహన సామ్రాట్టు దీ నేలనె
శత్రువులకె సింహ స్వప్నం రుద్రమాంబ దీ గడ్డనే
గోల్కొండమంత్రులు అక్కన్నమాదన్నతావిదె
గోండురాజులు కోయదొరలు కొమురంభీముదీమట్టే

10. ప్రజాగాయకు డైనగద్దర్ కదం త్రొక్కె భూమిదే
తెలంగాణ ఊపిరైన కేసియార్ సిద్దిపేటఇచటే
ఉద్యమాల పులిబిడ్డ-విప్లవాల పురిటిగడ్డ
శాంతికి రతనాల వీణ-ఫిరంగియే తెలంగాణ రణాన


https://youtu.be/Lu8Q0fseM5A"

వేదభూమి నాదేశం  జ్ఞానసుధను పంచనీ
నాదభూమి నా దేశం ఓంకారం నినదించనీ
కాశ్మీరం భారతి నీ కిరీటమై
కన్యాకుమారి పదపీఠమై
సంగీత సాహిత్య సంస్కృతీ సంపదలు
నీదయా విశేషాన వికసించనీ
హైందవ సాంప్రదాయ ప్రభలే
నీ చలవతొ విలసిల్లనీ

1.దుండగుల దండయాత్రలెన్నో ఎదుర్కొని
తురుష్క ముష్కరుల అక్రమాలు తట్టుకొని
పాశ్చాత్య నాగరిత పోకడలను ఢీకొని
అజరామరమై వెలుగుతోంది భారతీయత
జగతికి ఆదర్శమైన తెగువచూపు నడత
సరస్వతీ నీ కృపతో విశ్వవ్యాప్తమవనీ అవని
శారదా నీ వరముతొ దిగంతాలు చేరనీ

2.నీవున్న ప్రతి తావు ఉచిత విద్యాలయము
నువు వెలసిన అణువణువు కళానిలయము
వాడలలో రతనాలు రాశులుగా కురియనీ
క్రీడలలో పథకాలు వేడుకగా అరయనీ
ప్రపంచాన భరతమాత అగ్రగామికానీ
వాగ్దేవీ నీవాక్కుతొ యోగవిద్య సిద్ధించని
శ్రీవాణీ నీదృక్కుల శాంతి కాంతి ప్రసరించనీ
కవితాను అపర బ్రహ్మరా
ప్రసవవేదనెరిగిన అమ్మరా
ఆత్మతో రమించి
అనుభూతిని మధించి
భావనతో సంగమించి
కంటాడు కావ్యకన్యను
కల్పనచేస్తాడు రస రమ్యను

1.అక్షరాలు సంధించే అభినవ గాండీవి
పదముల పథముల నడిపించే మార్గదర్శి
నిరంతరం పరుగుతీసె మనోరథం  సారథి
ఎదను  ఎదను ఒకటిగ కలిపే వారధి
కలమునే ఉలిచేసే కవి భావశిల్పి రా
వస్తువేదైనగాని పసిడిగమార్చివేయు పరసువేదిరా

2.ఆటంకములెదురైనా తన పని ఆపనివాడు
ఎవరుగేలి చేసినా అసలే లెఖ్ఖించని వాడు
తోచింది రాయడమే ఎరిగినవాడు వాడు
ప్రతి స్పందన అభినందన ఆశించనివాడు
కలము కుంచెగా ఎంచే చిత్రకారుడు
మనసువర్ణాలన్ని ప్రస్ఫుటింపజేసే కవి ఇంద్రధనసురా