Tuesday, September 13, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నేకన్న కలవే

నీవే నా అష్టవిధనాయికలవే

నాకున్న కళవే

పున్నమినాటి ధవళ చంద్రకళవే

కళకళలాడే కళగా నీవే నాలో కలవుగా

కల కలమే ప్రభవించనీ నిను నా కవనకళగా


1.నా జీవన భవానివి

నే మెచ్చిన విభవానివి

మరపురాని అనుభవానివి

నా బ్రతుకున అపురూప సంభవానివి

విరివిగా లభ్యమవని బ్రహ్మకమల విరివి

తలచినంత మేనంతా వ్యాపించే ఆవిరివి


2.నా ఎదబీడుకు తొలకరివి

నా ప్రబల ప్రణయ మకరివి

తోడై ననునడిపే అభయంకరివి

సతతము సంతసము కూర్చు శ్రీకరివి

ఈ ఇలలో నాకోయిలవై గీతాలయవైతివి

శ్రావ్యగాత్ర మాధురితో నాలో లయమైతివి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తెల్లారనీకు ఈ చీకటి రాతిరిని

భరించలేను నిజాల వెలుతురిని

పిల్లాడి నూరడించు అమ్మజోలని

మైమరచి వింటు కలల తేలనీ


1.ఏవో చిక్కులలో చిక్కుకొని

దిక్కూమొక్కేదో వెతుక్కొని

అంతుచిక్కక అభయం దక్కక

శరణంటిని స్వామీ నిను మొక్కుకొని


2.అంతులేని వింతకథలు

తల నిండా తరగని వెతలు

నిరతమూ మొలకెత్తే కవితలు

శ్రోతల ఓరిమికివె చేజోతలు

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హంసానంది


ఉగ్ర మహోగ్ర విగ్రహా నృసింహా

భీకరాకారా శ్రీకరా భక్తానుగ్రహా

గోదావరి నదీ తీర మా ధర్మపురీశా

ప్రహ్లాద రక్షకా శేషప్ప కవిపోషా

నమో దుష్ట సంహారా నరమృగవేషా


1.జ్వలిత రక్త నేత్రా విచలిత గాత్రా

విస్ఫులింగ వీక్షణ అరిదైత్యభీషణ

దంష్ట్రా కరాళ ముఖా వజ్రతీక్ష్ణ నఖా

స్తంభ సంభవా ప్రభో భార్గవీ వల్లభా

నమో దుష్ట సంహారా నరమృగవేషా


2.శంఖచక్ర భూషణా శరణు సంకర్షణా

అగణిత మహిమాన్వితా వందిత చరణ

త్రిగుణాతీతా త్రిజగన్మోహన నారాయణా

ఆశ్రిత వత్సల ఆగమ వర్ణిత కరుణాభరణా

నమో దుష్ట సంహారా నరమృగవేషా