Wednesday, April 8, 2020


రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:భీంపలాస్

చిత్తములో నీవున్నా ప్రాప్తమేల ఈ గతి
భావనలో కొలువున్నా భవిత కేల దుర్గతి
నిదురలోన కలగా నీవే
నిజములోనా కనులానీవే
నన్నేల ఏలవో నగజా విభో
శరణాగతవత్సలా హరహర శంభో

1.పలుకుతున్న ప్రతి పలుకూ పంచాక్షరిగా ఎంచా
ఎదురైన ప్రతి శిలనూ శివలింగమని తలిచా
కురిసేటి వర్షాన్నే భగీరథిగ భావించా
జీవరాశినంతటినీ నీవుగా ప్రేమించా
నన్నేల ఏలవో నగజా విభో
శరణాగతవత్సలా హరహర శంభో

2.ఉఛ్వాసే నమక స్తోత్రం నిశ్వాస నాకు చమకం
ఆత్మలింగానికి సతతం  రుధిర రుద్రాభిషేకం
నవనాడుల మ్రోగుతుంది నాప్రాణ రుద్రవీణ
గుండెయే తాండవమాడ బ్రతుకే శివా నీకర్పణ
నన్నేల ఏలవో నగజా విభో
శరణాగతవత్సలా హరహర శంభో
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నీ కళ్ళే కలువరేకులు
ఆ కళ్ళే ఎదకు బాకులు
నీ కళ్ళే కదలనీక పాదాలకు మేకులై
ఆ కళ్ళే మెదలనీక గుళ్ళున్న తుపాకులై

1.నీ కళ్ళు నేర్పాయి తారలకు తళుకులెన్నో
నీకళ్ళు కూర్చాయి మెరుపులకు జిలుగులెన్నో
నీకళ్ళే అరువిచ్చాయి నిశీధికే నీలవర్ణము
నీకళ్ళే  స్మృతి తెచ్చాయి నెలలోని కృష్ణపక్షము

2.నీకళ్ళు చూసి చూసీ కృష్ణుడాయే నందబాలుడు
నీకళ్ళు గీసిగీసీ చకితుడాయే చతురాననుడు
నీ కళ్ళే  వరమిచ్చాయి వెన్నెలకు  ఆహ్లాదాన్నీ
నీ కళ్ళే దయతలచాయి కరిమబ్బుకు నల్లదనాన్నీ
దీపం పెట్టి వెతికినా ఆస్కారమెలేదు అందచందాలకి
ఆసాంతం పరిశీలించినా సంస్కారముండదా వ్యక్తికీ
ఉంటారు కొందరు ఊకదంపుడు వాళ్ళు
భజంత్రీలు కార్చేస్తారు ఎనలేని సొల్లు
విచ్చలవిడి తనమన్నదే అర్హతగా
విశృంఖల జీవితమే ఆలంబనగా

1.తలిదండ్రుల ప్రేమకైనా నోచనివాళ్ళు
అందరూ ఉండికూడ ఔతారిల అనాథలు
చిరునవ్వుల ముసగేసుకొని గొంతులే కోస్తారు
నమ్మించినట్టే ఉండి నట్టేట ముంచేస్తారు
పైశాచికత్వమన్నదే ఒక అర్హతగా
హింసించే ఆనందం కడువేడుకగా

2.మనోవైకల్యమే వారికో వైపరీత్యం
బ్రతుకున వైఫల్యమే అసహన కారణం
ఓర్వలేరు సంతోషించే సాటివాళ్ళను
జీర్ణించుకోలేరు తమకు బోధించేవాళ్ళను
అదను చూసి వలవేయడమే అర్హతగా
మోసగించి అవమానించే నెలతగా

ఆధిపత్యం లేనపుడే అన్యోన్య దాంపత్యం
ఏ దాపరికం లేనపుడే అపురూపమౌను కాపురం
మూడు ముళ్ళే బంధించాలా ముడిపడిన మనసులుంటే
ఏడడుగులు నడిపించాలా ఏడుజన్మలు తోడుంటే
ఒకరికి ఒకరై జతకడితేనే ప్రణయం
మనసుల మధ్యన వారధియే పరిణయం

1.ఎలా ఏర్పడిపోతాయో అపరిచితమౌ బంధాలు
ఎందుకు పెనవేస్తాయో ఎరుగలేము బాంధవ్యాలు
కళ్ళుమూసి తెరిచేలోగా చిక్కుబడి పోతాము
ఎంతగా విదిలించుకున్నా తప్పుకొని రాలేము
కార్యకారణ సంబంధం ఉండితీరుతుంది
ప్రతి చర్యకు ప్రతిచర్యై ప్రేమగా మారుతుంది

2.భారతీయ వ్యవస్థలో పవిత్రమే వివాహబంధం
హైందవ తత్వంలోనే అద్భుతమీ కళ్యాణ బంధం
ఒడిదుడుకులు ఎదురైనా సర్దుబాటు చేకొంటారు
పొరపొచ్చాలెన్నున్నా దాటవేసి పోతుంటారు
సంతానం లక్ష్యంగా బ్రతుకు బండి సాగుతుంది
కుటుంబమే ఐక్యంగా గండాలు దాటుతుంది