Thursday, August 24, 2023

 https://youtu.be/AA8pAdFlh1c?si=CBEsSWbWxtm9ay60


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:అభేరి(భీంపలాస్)


జగమంతా ఎరిగినది అష్టలక్ష్ములని

మరవకండి పతులారా మహితులా నవమలక్ష్మిని

నిత్యం కంటిముందు నడయాడే మన ఇంటి లక్ష్మిని,గృహలక్ష్మిని


ఆదరించండి ఆరాధించండి అనవరతం మీ అనురాగం పంచండి

లాలించండి సేవించండి చండీలక్ష్మిగా భావించండి


1.చిరునవ్వుతొ స్వాగతించే తాను చిన్మయ లక్ష్మి ఒద్దికగా ఇల్లు చక్కదిద్ధే తానే పరిశుభ్ర లక్ష్మి

కమ్మగ వండీ వడ్డించి కడుపు నింపే తాను మాతృలక్ష్మి

అలసినవేళలో సేదదీర్చి సేవలందిస్తుందీ  దాస్యలక్ష్మి,శృంగార లక్ష్మి


ఆదరించండి ఆరాధించండి అనవరతం మీ అనురాగం పంచండి

లాలించండి సేవించండి చండీలక్ష్మిగా భావించండి


2.చిక్కులు ఎదురైతే మనపక్కన నిలబడే స్నేహ లక్ష్మి

మిక్కిలి గుట్టుగా ఒడుపుగా సంసారనావ నడుపు సాహసలక్ష్మి

పరువు మర్యాదలు పదిలంగా కాపాడే పావన లక్ష్మి

జీవితాన అడుగిడి జీవితంతొ ముడిముడి జీవితమే తానయే జీవనలక్ష్మి


ఆదరించండి ఆరాధించండి అనవరతం మీ అనురాగం పంచండి

లాలించండి సేవించండి చండీలక్ష్మిగా భావించండి

Thursday, August 17, 2023

 https://youtu.be/95Z1EcypWk4


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


చేయి సాచనీయకమ్మ పరులముందు చెంచులక్ష్మీ

అప్పుల పాల్జేయకమ్మ ఎప్పటికీ మము ఆదిలక్ష్మీ

ధనవర్షమె కురియనీ మా ఇంటలో ధన లక్ష్మీ

కోరిన వరములొసగవమ్మా జననీ వర లక్ష్మీ


హారతి నీకిదే శ్రావణ శుభవేళ శ్రీ లక్ష్మీ

మంగళహారతిదే శుక్రవార వ్రతవేళ శ్రీ మహాలక్ష్మీ


1.పదిమందికి కడుపునింపు పాడిపంటలొసగవే ధాన్యలక్ష్మీ

ఎద ఎదలో వెలుగు నింపు చదువు నేర్పు ఎల్లరకు విద్యాలక్ష్మీ

పిల్లా పాపలతో చల్లగ వర్ధిల్లగా దీవించవే సంతాన లక్ష్మీ

కృషికి తగిన ఫలితమీయి విష్ణుపత్నీ విజయలక్ష్మీ


హారతి నీకిదే శ్రావణ శుభవేళ శ్రీ లక్ష్మీ

మంగళహారతిదే శుక్రవార వ్రతవేళ శ్రీ మహాలక్ష్మీ


2.రుజలను ఎడబాపవే నిజముగా జయ గజలక్ష్మీ

ఇడుములందు సత్తువనే సడలనీయకమ్మా ధైర్యలక్ష్మీ

ఉన్నంతలొ సంతృప్తిగ జీవించెడి బ్రతుకునీయి వైభవలక్ష్మీ

ఆయువున్నంత వరకు ఐదోతనమునే ప్రసాదించవే భాగ్యలక్ష్మీ సౌభాగ్యలక్ష్మీ




Monday, August 14, 2023

 https://youtu.be/oHzB1XUCSE8


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ఎర్రకోట మీద -ఎగురుతోంది -

త్రివర్ణపతాకం

నీలి నింగికే వన్నెల తలమానికం

దేశమంటే మనుషులేనని తలపోసే మాప్రజానీకం

జైహింద్ అను నినాదమే- మా -దేశభక్తిఉత్ప్రేరకం


జైహింద్ జైహింద్ జైహింద్


1.జననీ జన్మభూమి మేము నమ్మే దైవాలు

విశ్వజనీనమైన ప్రేమకలిగినవి మా భావాలు

శత్రువుకెన్నడు వెన్నుచూపనివి మా ధైర్యసాహసాలు

శాంతి సహనం ఔదార్యాలు మా భారతీయుల ఆనవాలు


జైహింద్ జైహింద్ జైహింద్


2.ప్రపంచాన్ని శాసించే వారూ మా మేధస్సు ఫిదాలే

కీలక పదవుల నలరించింది విశ్వవ్యాప్తంగ మా వారే

దేశం మాకేమిచ్చిందంటూ వాపోబోని మా పనితీరే

ప్రాణము సైతం దారపోయుటకు మేమెపుడూ తయారే


జైహింద్ జైహింద్ జైహింద్