Sunday, November 8, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:తోడి


ఉండీలేని రూపము నీది

సైకత నిర్మిత లింగము నీది

పార్వతి మాత పానవట్టము

శంభో  నీవేలే నా ఆత్మచుట్టము

ప్రణతోస్మి శ్రీరామలింగం శరణమహం సదాశివం


1.భవానీ నా దేహము భవా నీవె ప్రాణము

భవజలధిని దాటించే నావ నీ నామము

శ్రుతి తప్పని నా ఊపిరి ఉమాదేవి కాగా

లయ నీలో లయమయేలా నువు నాట్యమాడగా

ప్రణతోస్మి శ్రీ రామలింగం శరణమహం సదాశివం


2.ఐహికేఛ్ఛ తగ్గించి మతి నీ గతిగాననీ

మోహపాశాలన్నీ సమూలంగ సడలనీ

చతికిల పడనీయక నను నీపథమే సాగనీ

ఊరు దూరమవనీ నీ తావు కాడు చేరువవనీ

ప్రణతోస్మి శ్రీ రామలింగం శరణమహం సదాశివం



రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కన్నతల్లినే కలుసుకొన్నదే శుభోదయం

అమ్మ చల్లని దీవెన పొందగ మహోదయం

పుట్టినూరులో కాలుపెట్టిందె పావన ఉదయం

అన్నదమ్ములతొ గడుపగలిగిందె ఆనందోదయం


1.బాల్యమిత్రులతొ సమావేశమే  ఉల్లాసోదయం

మధురస్మృతుల మననంతో హసోదయం

సమాజసేవకు నడుంకట్టగల మా నవోదయం

 ప్రేరణనొసగే ప్రబోధగీతం పాడితె చైతన్యోదయం


2.ఎంతో కొంత వితరణ చేయగ దానోదయం

మితాహారమే భుజియించగ ఆరోగ్య ఉదయం

కుశల ప్రశ్నలతొ పలకరించగ స్నేహోదయం

కాఫీ చాయల కమ్మని రుచులతొ రసోదయం


శుభోదయం రసోదయం మహోదయం!!