Sunday, October 6, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:హంసధ్వని

విజయ దుర్గా కనకదుర్గా విజ్ఞాన దుర్గా
సన్మార్గము నడపవే మానవాళి నవదుర్గా
దుర్గమమే నీ ఉపాసనా భార్గవి
యంత్ర తంత్ర మంత్రాత్మిక భగవతి

1.భద్రకాళీ నీదే ఈ జననమరణ జీవన కేళీ
మహంకాళీ దనుజారీ మహిష మర్ధినీ
రుద్ర కాళీ అసుర దమనీ దైత్య హనని
ఖడ్గ ధారిణీ శార్దూల వాహిని భవానీ

2.ధన మాన ప్రాణ పోషణీ రమణీ
చంచల మనస్వినీ ఐశ్వర్య రూపిణీ
వైభోగ యోగిని వైభవ ప్రభవిని
మహా లక్మి మనోహరి శుభంకరీ

3.వేదమయీ ఓంకార నాదమయీ
మనో బుద్ధి చిత్తానురాగమయీ
పర విద్యా శ్రీవిద్యా ఆత్మవిద్యామయీ
సామ్రాజ్ఞీ సరస్వతీ సాధ్వీ జ్ఞానమయీ


రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:నవరస కానడ

ప్రియమార ఆరాధన చేసెద
భక్తిమీర నిను అర్చించెద
సిద్ధిధాత్రీ అరవిందదళనేత్రీ
క్షీరాబ్దిపుత్రీ నమోస్తు జగద్ధాత్రీ

1.శంఖచక్ర ఆయుధ దారీ
డోలాసుర భయంకరీ
పద్మాసన సంస్థితే సిరీ
అష్టసిధ్ధి వరదే జాడ్యాపహారీ

2.దుర్గే నిర్గుణే దురితనివారిణీ
కామితార్థ విజయ కారిణీ
మహిషాసుర మర్ధనీ మదనజననీ
విశ్వైక పాలనీ దర్శించనీ నీ రూపాలనీ

3.కీర్తి వర్ధినీ సంకీర్తనానురక్తిని
ఆర్తబాంధవి పరమార్థ దాయిని
పరమానంద ప్రదాయినీ
నారాయణీ బ్రాహ్మణీ రుద్రాణీ



రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:మధ్యమావతి

మహాగౌరీ మహాదేవ సహధర్మచరీ
శుభకరీ నాదబిందు కళాధరీ
వృషభవాహన సంచారీ పరాత్పరీ
నయగారీ కొల్తునిన్ను అనునయమే కోరి

1.త్రిమూర్తులైన నీకు భృత్యులే
మహామునులు నీశరణార్థులే
నీ కరమే అభయకరము
నీ పదమే పరమ పదము
నిఖిలలోక జననీ నిరంజనీ
పరవిద్యా పరాశక్తి పరమపావనీ

2.ఢమరుక శూలధరి శ్వేతాంబరి
కరుణామృతలోచని కృపాకరీ
నీ వదనమె కుముదము
నీవే సౌందర్య  సదనము
దైత్య దమని దానవ సంహారీ
నిత్యానందినీ  సత్య శివ సుందరీ