Thursday, April 21, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నయనాలు రాస్తాయి చూపులతో ప్రేమ లేఖలు

అధరాలు గీస్తాయి ముద్దులతో ప్రణయ రేఖలు

నీ అందచందాల్లో గతమెరుగని ప్రబందాలు

నీ హావభావాల్లో అపూర్వమైన  కావ్యాలు

ప్రేయసి నీవేలే నిలువెత్తు గ్రంథాలయం

పరువాల రాశీ నీఎదనే మన్మథాలయం


1.నీ నీలి కురుల భాష్యం శృంగార నైషధం

నీ అధర మకరందం విరహ బాధకు ఔషధం

నువు చెంత ఉన్నంత కాళిదాసు శాకుంతలం

నువు లేనివేళంతా మనసు అతలాకుతలం

ప్రేయసి నీవేలే నిలువెత్తు గ్రంథాలయం

పరువాల రాశీ నీఎదనే మన్మథాలయం


2.  అగుపింతురు నీలోనే అష్టవిధ నాయికలు

వగపు మించి ఆలపింతురు జయదేవ గీతికలు

నీ విలాసమందున ద్యోతకమౌ హరవిలాసం

నీవుంటే జీవితమంతా శాశ్వతమౌ వసంతమాసం

ప్రేయసి నీవేలే నిలువెత్తు గ్రంథాలయం

పరువాల రాశీ నీఎదనే మన్మథాలయం


PIC COURTESY: SRI Agacharya Artist

 

https://youtu.be/Xi6Cy-vTu-0?feature=shared

రచన,స్వరకల్పన&గానం:డారాఖీ


నా ప్రతి అవయవం సాంబశివం

నా కాయం పరమశివ మయం

నా ప్రాణం నాజీవం సదా శివం

దేహాత్మ భావరహితమై శివోహం శివోహం 

శివోహం శివోహం శివోహం అహరహం

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


1.మదము నదిమితె నాశిరం శివశంకరం

ముదము నోచని నాకనులు గంగాధరం

అదుపుతప్పెడి నా నాల్క నాగేశ్వరం

మధువులొలుకని నా గళం గరళధరం

శివోహం శివోహం శివోహం అహరహం

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


2.మమకార మయమై నా మనసు రాజేశ్వరం

స్వార్థపూరితమై నా తలపు అరుణాచలేశ్వరం

సాయమెరుగని నా కరద్వయం కాశీ విశ్వేశ్వరం

సరిదారినెరుగని నా పదయుగళి కేదారేశ్వరం

శివోహం శివోహం శివోహం అహరహం

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాటకు ప్రాణం పోయుదమా

పాడుతు ఎదలే మీటుదమా

ఆహ్లాదమొలికే రాగముతో

సాంత్వన పలికే భావనతో


1.శ్రుతిలో లయలో సమతుల్యతతో

అలతి అలతి పద ప్రాస రమ్యతతో

శ్రవణపేయమై లలిత గేయమై

రసికుల నలరించు రీతిగా

ఓలలాడగ మురిపించు గీతిగా


2.పల్లము పారే ఏరుగా పల్లవి తీరై

ఉల్లము పొందే హాయికి మారు పేరై

చరణాలు వడివడి సాగెడి రాదారై

ఎలుగెత్తి మైమరచి ఆలపించి

సహానుభూతితో పలవరించి


3.కోయిల కమ్మని పాటకు దీటుగ

జుమ్మను తుమ్మెద నాదపు సాటిగ

మార్ధవమే రంగరించి మాధురి మేళవించి

ప్రకృతిగా మేను పరవశించ

సుకృతిగా మనసు పులకరించ