Saturday, September 17, 2016

ఓడిపోకు వెంటనే- గెలుపు వలచు కృషి ఉంటేనే...
సాగిపో సాధన వెంటనె- సాధ్యమగును కలల పంటనే..
ఆదిలోనె బెదరకురా నా అనుంగు సోదరా
ప్రయత్నాలు మానకురా ప్రతివిజయం నీదేరా
1. డంభాలు పలికేవారు ఆరంభ శూరులు
అడ్డంకులు దాటేస్తారు మొక్కవోని ధీరులు
గేలిచేస్తు విసిరే రాళ్ళతో కోటలనే నిర్మించాలి
అపజయాల అనుభవాలతో కొత్తదారులేయాలి
ఆదిలోనె బెదరకురా నా అనుంగు సోదరా
ప్రయత్నాలు మానకురా ప్రతివిజయం నీదేరా
2. అర్భకులకు దొరికే సాకు అదృష్టం అన్నమాట
దౌర్బల్యం మనబోదు సంకల్పం ఉన్నచోట
ఉధృతిగా కదిలే నదికి కొండలైన వదులును బాట
ఊకదంచుడి౦కమానితే ఉట్టికొట్టగలవేపూట
ఆదిలోనె బెదరకురా నా అనుంగు సోదరా
ప్రయత్నాలు మానకురా ప్రతివిజయం నీదేరా
3. లక్ష్యమే లక్ష్యంగా రేయిపగలు తలపోయాలి
గుణపాఠం ఒక పాఠంగా శిరసావహించాలి
ప్రాణాలు ఫణమోడి శిఖరాల నెక్కేయాలి
చరితలనే తిరగ రాస్తూ నువు చరిత్ర సృష్టించాలి
ఆదిలోనె బెదరకురా నా అనుంగు సోదరా
ప్రయత్నాలు మానకురా ప్రతివిజయం నీదేరా

Wednesday, September 14, 2016

ఎరుగము స్వామి ఎన్నడుగాని నీ లీలలు
సహజమె స్వామి చూపవదేమి నీ మహిమలు

1.అష్టాదశ పురాణాలు నిజమగు తార్కాణాలు
అష్టసిద్దినవనిధి లబ్దులు కొల్లలుగా సాదృశాలు
అడుగడుగున వెలసిన గుళ్ళు నీ దర్శన నిదర్శనాలు
ఉత్సాహాల ఉత్సవాలే నీ మనుగడ కానవాళ్ళు

కరుగదదేమి పరమదయాళ నీ హృదయము
కనికరమేది కరుణాసాగర మేమన జాలము

2.ఎక్కిన శిఖరాలు జారిన లోయలు నీ ప్రసాదాలు
పొందిన సంపదలు అందిన ఆపదలు నీ వరదానాలు
రెప్పపాటు లో ఆటుపోటులే మా జీవిత గమనాలు
కప్పదాటులే వేయక కురిపించు ఆశీర్వచనాలు

తాళగలేము కఠినతరమగు నీ గుణపాఠాలు
వదలము స్వామీ దయగనువరకు నీ చరణాలు

https://www.4shared.com/mp3/3Ng9QP3Sce/ERUGAMU_SWAMY_ENNADU_GAANI.html

Monday, September 5, 2016

వినాయక చవితి శుభాకాంక్షలతో.,
స'వర్ణాత్మక గణపతి గుణ గణ గీతి

సంకట నాశక - సంతస దాయక
సమ్మోహన ముఖ - హే సుముఖా
సతతము నిన్నే స్మరణము జేసెద
శుభకర సుఖకర సిద్ది వినాయక

1.శ్రీ గౌరీసుత -శీఘ్ర వరద
సిద్దిబుద్దియుత-సునిశిత వీక్షిత
సకలలోక సంపూజిత సన్నుత
సర్వాభీష్ట ప్రదాయక సంస్తుత

సతసతము నిన్నే స్మరణము జేసెద
శుభకర సుఖకర సిద్ది వినాయక

2.సకారాత్మక -స్వప్న సాకార
సంక్లిష్ట వారక-సురనర వందిత
శంకర నందన శమదమ వారణ
శరణము నీవే శత్రు భంజన

సతతము నిన్నే స్మరణము జేసెద
శుభకర సుఖకర సిద్ది వినాయక