Sunday, November 10, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:శివరంజని

నిన్నటిదాకా నీవెవరో నేనెవరో
అపరిచితులమైన మనము ఎవరికి ఎవరమొ
ఏ జన్మ బంధమో కలిపింది ఇద్దరినీ
ఇలా ప్రేమ బంధమై మనల ముడివేసింది

1.నదిలాగ సాగే నన్ను కడలికడకు చేర్చింది
గొంగళిపురుగైన నన్ను సీతాకోకచిలుకగమార్చింది
ఆలింగనమ్ముతో నిన్నాదరించానే
పూవుగామారి నా మకరందము పంచానే
ఏ జన్మ బంధమో కలిపింది ఇద్దరినీ
ఇలా ప్రేమ బంధమై మనల ముడివేసింది

2.కాలమాగిపోయింది మనం కలుసుకున్న క్షణంలో
ప్రకృతే స్తంభించింది పరస్పరం నిరీక్షణంలో
సంగమాలు సంభవించి సంభ్రమానికి లోనైనాను
ఎడబాటు సడలగనే ఎదలయతో లయమైనాను
ఏ జన్మ బంధమో కలిపింది ఇద్దరినీ
ఇలా ప్రేమ బంధమై మనల ముడివేసింది



చిన్నమొలకకూ లేవు రామచిలకకూలేవు
వాన చినుకుకైన లేవు వాగువంకకింకలేవు
నీకేలనో ఓమనిషీ ఇంతటి ఈర్ష్యాద్వేషాలు
నీకెందుకో ఓ నరుడా ఈ అసూయా మోసాలు

1.నీకు లేక వగచేవు అదియే  ఒక వ్యధ
సాటివారు కలిగి ఉంటె ఓర్వలేనిదొక బాధ
నీ కళ్ళమంట వల్ల నీవే దుఃఖింతువు
నీ కడుపుమంట నీకే దహన హేతువు
కడలి కెప్పుడూ లేవు ఖంబుకెంతయూ లేవు
నీకేలనో ఓమనిషీ ఇంతటి ఈర్ష్యాద్వేషాలు
నీకెందుకో ఓ నరుడా ఈ అసూయా మోసాలు

2.ప్రతిభను ఈసడిస్తె నీకొరిగే దేమిటి
గుర్తింపును నిరసించే సంస్కారమేపాటిది
సూర్యునిపై ఉమ్మితే పడుతుంది నీపైనే
విద్యుత్తుని ముట్టకుంటె ఎప్పటికీ నీకు హానె
చెట్టుచేమకూ లేవు కొండకోనకూ లేవు
నీకేలనో ఓమనిషీ ఇంతటి ఈర్ష్యాద్వేషాలు
నీకెందుకో ఓ నరుడా ఈ అసూయా మోసాలు