Saturday, September 8, 2012

ఆనందం..!కణకణమున..క్షణ క్షణమున..


రాఖీ||ఆనందం..!కణకణమున..క్షణ క్షణమున..!!||

పెంచుకొన్న పావురాన్ని–అరచేతిలొ ఉంచుకొని
ప్రేమగా నిమిరితే ఎంతటి ఆహ్లాదమో..
సాదుకొన్న రామ చిలకని-ముంజేత పెట్టుకొని
జిలిబిలిగా పలికితే ఎంత మోదమో..

దొరకని దెక్కడా-ఆనందమె అంతటా
అనుభవించు హృదయముంటే లభియించును అన్నిటా

1.       నింగి లోని సింగిడి చూసి-అబ్బురంగ ఆస్వాదిస్తూ
మైమరచి పోతుంటే పరితోషము..
ఊరవతలి చెరువు లోనా-వచ్చీరాక ఈడులాడుతూ
కేరింతలు కొడుతూ ఉంటే సంతోషము..

దొరకని దెక్కడా-ఆనందమె అంతటా
అనుభవించు హృదయముంటే లభియించును అన్నిటా

2.       తొట్లెలోని పాపతోటి-వెర్రి మొర్రి చేష్టలు చేస్తూ
తుళ్ళి తుళ్ళి నవ్విస్తుంటే..చెప్పరాని పరవశము
కల్లాకపట మెరుగని వారితో-కల్మషమే లేని మనసుతొ
కబురులాడుతుంటే కొదవలేని హర్షము...

దొరకని దెక్కడా-ఆనందమె అంతటా
అనుభవించు హృదయముంటే లభియించును అన్నిటా

3.       కోరి కోరి పొందిన దాన్ని-అడిగినదే తడవుగా
ఆత్మీయుల కందజేస్తే అభినందము
పోరి పోరి గెలిచిన దాన్ని-నవ్వుతు తృణప్రాయంగా
పరాజితుల కొదిలేస్తే ప్రహ్లాదము

దొరకని దెక్కడా-ఆనందమె అంతటా
అనుభవించు హృదయముంటే లభియించును అన్నిటా



Wednesday, September 5, 2012

“సంగీతా౦గన”


“సంగీతా౦గన”
నఖ శిఖ పర్యంతమూ
నువ్వే సంగీతమూ
ఏ చోట మీటినా 

అద్భుత మగు నాదము


1.       నువ్వు నవ్వు నవ్వితే
మువ్వలే మ్రోగుతాయి
నీ నడకలు సాగితే
మృదంగాలు నినదిస్తాయి
చేయి కదిపినావంటే
సంతూరు స్వానమే..
కన్ను గిలిపినావంటే
సారంగి సవ్వడే

2.       పలుకు పలికి నావంటే
వీణియ బాణము.
గొంతు విప్పినావంటే
సన్నాయి మేళము
మేను జలదరించెనా
జలతరంగమే
మౌనము దాల్చినా
తంబురా రావమే