Friday, January 10, 2020

నిరాశేగా నాకు ప్రాప్తం-నిరామయం ఇక జీవితం
ఊహలన్ని పాతిపెట్టి-గాలిమేడలు కూలగొట్టి
 బ్రతకలేక జీవశ్చవమై-చావలేకా నిత్యం హతమై
నెట్టుకెళ్ళాలి చచ్చేవరకు-వేచిచూడాలి చావొచ్చేవరకు


1.నా రచనలన్నీ నిన్నుటంకించేవే
నా గీతాలన్నీ నిను ప్రతిఫలింప జేసేవే
చిన్నగానైనా వెన్నుతట్టలేదెపుడు
మాటవరసకైనా నన్నుమెచ్చలేదెపుడు
నాది కవితే కాదన్నావు-నాకు భవితే  లేదన్నావు
ఎందుకే నాచెలీ చులకనగా చూస్తావు
గడ్డిపోచలాగా జమకట్టివేస్తావు

2.నిన్ను వర్ణించుటలో నేనోడిపోయాను
ఆకట్టుకొనడంలో విఫలమై పోయాను
ఆర్భాటలకే నువులొంగిపోయావు
అట్టహాసాలకే కట్టుబడిపోయావు
భావుకతకు చోటేలేదు-సృజనకైతే విలువే లేదు
పైపైమెరుగులకే పట్టం కడతావు
నను నన్నుగా ఎప్పుడు చేపడతావు

ఎలా నిను మెప్పించనూ -ఏమని నేనొప్పించనూ
అన్నీ తెలుసుననుకోనా-ఏదీ ఎరుగవని నేర్పనా
మనసు మనసు తో పలికే భాష ఏదో
కనులు కనులతో తెలిపే భావమేదో


1.అమాయకం అనుకోలేను గడసరివి నీవైతే
అయోమయం అనిఅనలేను లౌక్యమెంతొ నీకుంటే
నటనలందు నీవు ఘటికురాలివే
నాట్యమందు నీవు వనమయూరివే
నన్నేమార్చ చూస్తావు నా ఏమరుపాటులో
కొమ్మలుచాటు చేస్తావు నీ కమ్మని పాటల్లో
చాలించవే నీ సయ్యాటలు
ఆపేయవే నీ దొంగాటలు

2.జలతారు మేలి ముసుగులో అందాలు కననీవు
నీ కిలకిల నవ్వులతో ఎద సవ్వడి విననీవు
ఎక్కడో గిల్లుతావు ఎరుగనట్టె ఉంటావు
వలపునెంతొ చల్లుతావు మౌనంగ ఉంటావు
గుండెల్లోన పగలే రేగే దహించగానన్ను
రేయంతా కలలై సాగి స్మరించే నిన్ను
చెప్పబోకు నాకు నమ్మలేను కథనాలు
విప్పిచూపు నాకు మదిలోని మర్మాలు
ఎద కదులు కారణం నువ్వు-నా కవిత తోరణం నువ్వు
ఉండబోకు గుండెకు దవ్వు-దండిగా నవ్వులు రువ్వు
నీ సావాసమే పారిజాత పరిమళము
నీ సాన్నిధ్యమే ఉత్పేరక సుమశరము
కనుమరుగై పోకుమా నా నేస్తమా
నిను వీడి మనలేనూ నా మిత్రమా

1.కౌముదిని కనలేకా  కలువలకు మనుగడ యేది
జాబిలిని కోరలేకా చకోరాల బ్రతుకేదీ
నింగికాస్త మెరవాలంటే మబ్బు మబ్బు తాకాలి
మబ్బుమురిసి కురవాలంటే పవనమల్లుకోవాలి
తెలుసుకో నేస్తమా ప్రకృతి సత్యం
ఎరిగి మెలుగు మిత్రమా మన స్నేహితత్వం

2.కిసలయాల రుచిగనక పికమునకు సుఖమేది
మృణాళికల గ్రోలకనే కలహంసకు గతియేది
నెమలి నాట్యమాడాలంటే మేఘావృతమవ్వాలి
రామచిలుక పలకాలంటే మెత్తగా దువ్వాలి
తెలుసుకో నేస్తమా ప్రకృతి సత్యం
ఎరిగి మెలుగు మిత్రమా మన స్నేహితత్వం