Wednesday, September 16, 2020



సమర్థ సద్గురుసాయినాథా
సమస్తలోకాలకే అధినేతా
భక్త సులభ భవబంధమోచకా
అనురక్తి యుక్త ముక్తిమార్గ బోధకా
జయజయధ్వానాలు సాయీ నీకు
సాష్టాంగ వందనాలు నీ పాదాలకు

1.సాయనిపిలువగనే ఓయంటావు
మా ఇంటితలుపు తడుతుంటావు
నిండుగ గుండెలోన స్థిరపడతావు
కొండంత అండగ నిలబడతావు
జయజయధ్వానాలు సాయీ నీకు
సాష్టాంగ వందనాలు నీ పాదాలకు

2. మా మొరలే నీకు వేదమంత్రాలు
మా పంచప్రాణాలే పంచహారతులు
మా నాలుకయే నీకు పల్లకీ సేవ
ఏకాదశ సూత్రాచరణ మాకు త్రోవ
జయజయధ్వానాలు సాయీ నీకు
సాష్టాంగ వందనాలు నీ పాదాలకు
https://youtu.be/R3zUnJOa1m4?si=wuF4fIhfQtj3v1WP

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

నింగిన పూసే సింగిడి నీవు
నగవులు కాసే జాబిలి నీవు
దారితప్పి నేలన రాలిన ఉల్కవు నీవు
వేకువ వాకిటి వెలిగే వేగుచుక్కవు నీవు
మన మైత్రీబంధం హిందోళరాగమై
మన కవన సుగంధం సంధ్యార్ణవమై

1.కైలాసగిరిపై మెరిసే పసిడి ఉషఃకిరణం  నీవు
తాజ్ మహల్ పైన కురిసే చంద్రాతపం నీవు
కొలనులో విచ్చుకున్న ఎర్రకలువవే నీవు
రవినిగాంచి తలతిప్పే సూర్యకాంతి పూవు నీవు
మనస్నేహ యోగమే మోహనమై
సాహితీ సంగమమే జీవనమై

2.ఎడారిలో పిపాసికీ ఒయాసిస్సు నీవు
ఊబిలోకి జారేవేళ ఊతమై నిలిచేవు
ఊపిరాగిపోతుంటే ప్రాణవాయువౌతావు
నీవున్న తావులో మోదాన్ని పంచుతావు
మన చెలిమియే హంసానందియై
సారస్వతలోకంతో మనం మమేకమై

చిత్ర సహకారం: Sri.  Agacharya Artist
https://youtu.be/6_bRoPESnCI?si=OwWzczRjVnmRQ7W1

రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మోహన

అన్ని కాలాలూ అనుకూలాలే వలపుపంటకు
అన్ని సమయాలూ ఆమోదాలే పడుచుజంటకు
మధుమాసం పంపుతుది ఆహ్వానం
పికగాత్రం పలుకుతుంది స్వాగతం

1.గ్రీష్మతాపం ఆర్పివేయును మరుమల్లెల సౌరభం
వర్షదారలు తడిపివేయుగ పునీతమౌ యవ్వనం
కార్తీక వెన్నెల కాల్చుగ హాయిగొలుపెడి అనుభవం
తమకపు ఎదతాపాలకు చందనాలు
తడిసిన తనువందాలకు వందనాలు

2.హేమంత శీతలకోతల ఉపశమనం పరిష్వంగం
మాఘ ప్రణయ రాగాలకు పరవశించు అంగాంగం
శిశిరాలు రేపగ విరహం మది మదన కదనరంగం
రతికేళీ నిపుణత అంటే నెగ్గిస్తూ నెగ్గడం
రసరమ్య క్రీడలో ఇరుజట్లకూ విజయం

చిత్ర సహకారం: Sri.  Agacharya Artist

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చూసి రమ్మంటే కాల్చివచ్చిన ఘనుడవయా
ఓషధికావాలంటే గిరినే తెచ్చిన యోధవయా
మరిచావా మము -మా ఇలవేల్పువు నీవేనయ్యా
మన్నన చేసి ఆదుకొనరా ఆంజనేయా వీరాంజనేయా
భక్తాంజనేయా అభయాంజనేయా స్వామీ ప్రసన్నాంజనేయా

1.చిటికెడు సింధూరంతో రాముడు వశమగునంటే
మేను మేనంతా పులుముకొన్న భక్తుడవయ్యా
రామనామ మనునది రాముడికంటె గొప్పదని
శరణాగతుడిని కావగ నిరూపించినావయ్యా
మన్నన చేసి ఆదుకొనరా ఆంజనేయా వీరాంజనేయా
భక్తాంజనేయా అభయాంజనేయా స్వామీ ప్రసన్నాంజనేయా

2.అంతులేని అంబుధినే అవలీలగ దాటేసావే
సీతమ్మకు ముద్రికనిచ్చి సంబరాన ముంచేసావే
నినుకోరినదేమి స్వామీ పిడికెడంత సంతోషాన్నే
నిను ఏమని వేడితిమయ్యా చిమ్మెడంత ఆనందాన్నే
మన్నన చేసి ప్రసాదించరా ఆంజనేయా వీరాంజనేయా
భక్తాంజనేయా అభయాంజనేయా స్వామీ ప్రసన్నాంజనేయా