Saturday, August 8, 2020

నా చేయి వదిలావు ఎందుకు స్వామి
ఒంటరిని చేసావు ఇది న్యాయమా ఏమి
నీవూ నేనే కదా మనదైన లోకాన
నను ముంచివేసావు కడలేని శోకాన

1.నిర్మలమైన నామది కడలిని
కల్లోల పరిచెడి కాఠిన్యమేల
నిశ్చలమైన నా హృదయాన
అలజడి రేపెడి కరడు నీకేల
నను వేరుచేయకు పరమ దయాళా
నను మరచిపోబోకు ఏవేళా

2.నే కోరుకున్నాన ఈ భవబంధాలు
నిను వేడుకున్నాన ఇహలోక సౌఖ్యాలు
నువులేక నేనెపుడు అనాథనే
నినుగనక నాకు నిత్య వ్యథనే
ననుచేర్చుకో స్వామి నీ అక్కున
ఎడబాటు నోపను రావయ్య గ్రక్కున


వన వాటిక సంచరించె ముని కన్యకవో
నెలనాటి జాబిలి వెన్నెల తునుకవో
జలపాతధారల నురగల మెరుపువో
హిమవన్నగ శ్వేతవర్ణ కాంతిరేఖవో
సౌందర్యం సౌశీల్యం కలబోసిన కలికివో

1.అలనాటి దుష్యంతుని శాకుంతలవో
అవీక్షితుని వరించిన వైశాలినివో
ఋష్యశృంగ పత్ని దశరథపుత్రి శాంతవో
శ్రీరాముని పదతాడిత సతీ అహల్యవో
సాంప్రదాయ సోయగం సొంతమైన దానవో

2.కలనైనా పరపురుషుల తలవని సీతవో
పతికోసం దండధరుని ఎదిరించిన సావిత్రివో
త్రిమూర్తులకె పాలిచ్చిన అనసూయా మాతవో
యజ్ఞోద్భవి పంచ పాండవ సతి ద్రౌపది నీవో
విలువలకే కట్టుబడిన అల దమయంతి వీవో


నింపావు కళ్ళలో సప్తసముద్రాలు
దింపావు గుండెలో అగ్నిపర్వతాలు
పదేపదే పెల్లుబికే కన్నీటి ఉప్పెనలు
నిరంతరం బ్రద్దలౌతు అడియాసల లావాలు
ప్రభూ నేను ఆటబొమ్మనా
స్వామీ నీలీలగ నే నమ్మనా

1.ఎందుకు అందలాలు ఎక్కిస్తావో
ఎప్పుడు ఊబిలోకి నను తోస్తావో
దేనికొరకు విర్రవీగ నను చేస్తావో
అంతలోనె న్యూనతనే కలిగిస్తావో
ప్రభూ నేను ఆటబొమ్మనా
స్వామీ నీలీలగ నే నమ్మనా

2.నీ క్రీడకు సమవుజ్జీననుకున్నావా
నీ కేళికి ప్రేమతొ నన్నెంచుకున్నావా
మించిపోయిందిలేదు తగు శిక్షణ నాకివ్వు
చెరగనీకు స్థిరమదితో నాపెదాల చిర్నవ్వు
ప్రభూ నేను నేనే కానే కానా
స్వామీ నీవు నాలో లేనే లేవా