Sunday, June 28, 2020


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:శహనా

వందే విశ్వంభరా
నమోస్తుతే ఋతంబరా
ధన్యోహం దిగంబరా
దండంబులు గొనుమిదే హరా నిరాడంబరా

1.ఎలా నీకు తెలుపగలను కృతజ్ఞత
ఎలా ప్రకటించను నా విశ్వసనీయత
ఏవిధి ఎరుకపరుచగలను  నా భక్తి ప్రపత్తత
ఏ రీతి మెప్పించను మార్కండేయవినుత
ధన్యోహం దిగంబరా
దండంబులు గొనుమిదే హరా నిరాడంబరా

2.ఉత్కృష్టమౌ ఈ నరజన్మ నిచ్చావు
ఆరోగ్యభాగ్యాలు నాకొసగినావు
చక్కని ధారా పుత్రుల దయచేసినావు
మిక్కిలి కవన ప్రతిభ వరమిచ్చినావు
ధన్యోహం దిగంబరా
దండంబులు గొనుమిదే హరా నిరాడంబరా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మల్లెలకెంత తొందర-నీ జళ్ళో మాలగా అలరొందాలని
వెన్నెలకెంత ఆత్రుత-నీ ఒళ్ళు ఒళ్ళంతా  పరుచుకోవాలని
తుమ్మెద కెంత కోరిక-నీ ముఖకమలంపై వాలాలని
ముత్యాలకొకే వేడుక-నీ నగవుల జల్లుగా రాలాలని

1.కిన్నెరసాని నీ నడకచూసాకే-మెలికలు తిరిగింది
పెన్నానది నీ నడుము కనగానే-అలకను పూనింది
కృష్ణవేణి నీ కురుల నలుపుచూసి-తలవంచుక సాగింది
పాపికొండల గోదారి నీ గుండెల ఉన్నతికి-అచ్చెరువొందింది

2.నర్మదానది లోయనే లోతైన -నీ నాభిని తలపించింది
తపతీ నది అందమైన ప్రవాహమే-నీ నూగారును పోలింది
తుంగభద్ర సంగమించ నిను మెళకువలడిగింది
కావేరి నీమేని సోయగాలకే నిలువెల్లా నీరయ్యింది
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఆమె:
తనువుకే యవ్వనం ముసలితనం
అతను:
మనసన్నది ఎప్పుడూ అజరామరం
ఆమె:
అందాన్ని ఇనుమడించు హుందాతనం
అతను:
నిండైన కట్టుబొట్టు నెలతకు సింగారం

అతను:
1.అరమరికలే లేని అపురూప కాపురం
సాంగత్యమె నిత్యమైన సిసలైన దాంపత్యం
అలకలు కలనైన  కనరాని సంసారం
అతివ చతురతతొ ఔతుంది గృహమే స్వర్గం

ఆమె:
2.కుటుంబమంతటి శ్రేయస్సే ఏకైక లక్ష్యం
సంతానపు ఔన్నత్యమే చేరిన శిఖరం
ఎదలోన అనురాగం ఎదుటేమో గంభీరం
 మగధీరుడే మగనాలికి ఆరాధ్య దైవం
తీరు చూస్తే జలపాతం
ఉరిమితే మరి ఉల్కాపాతం
మనసు లైతే నవనీతం
స్నేహితం మనకాపాతం

1.ఉబుసుపోని జీవితం
మూడునాళ్ళే శాశ్వతం
వెతకు చెలిమొక ఊతం
కరిగనీకు క్షణమే అమృతం

2.దొరికినదె మన ప్రాప్తం
అనుభూతులె అవ్యక్తం
సర్దుకుంటె అది యుక్తం
అంతరంగమన్నది గుప్తం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నీపదము తడిసింది స్వామి
నా అశ్రుధారతోని
గుడి మారుమ్రోగె వినవేమి
నా హృదయఘోష తోని
మిన్నకుందువేమి గోవిందా
నన్నుగానవేమీ ముకుందా

1.కన్నతండ్రివీవు చిన్నకొడుకునే నేను
చేయవైతివేల గారాబము
తప్పులెన్నబోకు గొప్పలేవిలేవు నాకు
మన్నించవేల నా అజ్ఞానము
పెంకెతనం మంకుతనం సహజమే కదా
మిన్నకుందువేమి గోవిందా
నన్నుగానవేమీ ముకుందా

2.శుంఠనై మిగిలాను మూఢునిగ మసిలాను
శ్రద్ధగా నీవే బుద్ధిగరపక
మొరవెట్టుకున్నాను నిన్ను తిట్టుకున్నాను
నా అవసరాలు నెరవేరక
సన్మార్గం చూపే బాధ్యత నీదే సదా
మిన్నకుందువేమి గోవిందా
నన్నుగానవేమీ ముకుందా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చలికాలమైనా మేనంతా చెమటలే
తానమాడినా గానీ తనువంతా మంటలే
వేగలేకపోతోంది అంగాగం నీవిరహం
తాళజాలకుంది తపన రేగి నాదేహం
రారా సఖా  ప్రియ ప్రేమికా-నా పరువమే నీకు కానుకా

1.పిచ్చుకల జంటకాస్తా ఇచ్ఛ రెచ్చగొడుతోంది
కపోతాల జతసైతం రచ్చ రచ్చ చేసేస్తోంది
చిలుకాగోరింకల మిథునం కలకలం రేపుతోంది
అభిసారిక ఆవహించి కామార్తి బుసకొడుతోంది
రారా సఖా  ప్రియ ప్రేమికా-నా పరువమే నీకు కానుకా

2.ఏకధార జలపాతం సరస్సులో దూకుతోంది
పుడమి చీల్చుకొంటూ మొలక వెలికి వచ్చింది
సెలయేటి కౌగిట కొండ ఒదిగిపోయింది
పదపడుతు నదితానే కడలితో సంగమించింది
రారా సఖా  ప్రియ ప్రేమికా-నా పరువమే నీకు కానుకా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

జీవితమే చింతల నాటకం
జీవితమే వింతల బూటకం
మనిషికి మనసుకి మధ్యన దొంగాటకం
మనిషికి మనిషికీ నడుమన పితలాటకం

1.రమణి చుట్టు తిరిగే రంగులరాట్నం
గొడ్డు చాకిరితో తిరిగే గానుగ చట్రం
కూపస్థ మండూకం తనలోకమె మైకం
జనన మరణ వలయంలో చిక్కిన జీవితం

2.భావానికి భాషణకు ఎంతటి అంతరం
కార్యానికి వచనానికి పొంతన బహుదూరం
సాటివారి సంక్షేమం మృగతృష్ణతొ సమానం
చిన్నారి నాబొజ్జకు శ్రీరామరక్షయే ప్రమాణం

Thursday, June 25, 2020

రెప్పలెక్కి తొక్కుతోంది కునుకు రక్కసి
తిప్పలెన్నె నీతోటి చక్కని నా ప్రేయసి
కలుసుకోనీయి కలల ఇంటి తలుపు తీసి
మరపురాని ఆనుభూతులనే నాకందజేసీ

1. భాష అడ్డుకాబోదు మన కాపురాన
కులం మతం ప్రసక్తిరాదు ప్రేమ గోపురాన
పేద ధనిక భేదం లేదు  ప్రణయపురాన
జాతి ప్రాంత వివక్షలేదు సంసార తీరాన
కలుసుకోనీయి కలల ఇంటి తలుపు తీసి
మరపురాని ఆనుభూతులనే నాకందజేసీ

2.ఆధిపత్య పోరు ఉండదు దాంపత్యాన
శంకకింక  తావులేదు ఇరువురి మధ్యన
అలకలకు చోటేలేదు సరే అన్న మాట మినహా
అపోహలకు వీలులేదు ఒకే భావమైన తరహా
కలుసుకోనీయి కలల ఇంటి తలుపు తీసి
మరపురాని ఆనుభూతులనే నాకందజేసీ



రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చెలియా చెలియా చేయకే గారడీ
లవ్ నే మార్చకే ప్యార్ కీ ప్యారెడీ
సయ్యంటే సయ్యంటూ దేనికైనా నేను రెడీ
సరదాల పేరిట కొట్టించకు నను బురిడీ

1.చాటింగ్ మీటింగ్ డేటింగ్ అన్నిటికీ నేనోకే
ఫైటింగ్ చీటింగ్ బ్రేకింగ్ అంటే మాత్రం చికాకే
షాపింగ్ చేసెయ్ టైమెంతైనా అవనీ హోటల్ బిల్లెంతైనా
బోర్ కొట్టే దూరాలకు ఎంతటి లాంగ్ రైడైనా

2.పబ్బుల్లో స్పెండ్ చేద్దాం లేట్ నైటైనా
పార్టీలలో ఎంజాయ్ చేద్దాం ఎంత ఖర్చైనా
వీకెండ్ రోజున రిసార్ట్స్ కెళ్ళి మజా మరాయిద్దాం ఇకపైన
మల్టీ ప్లెక్స్ కార్నర్ సీట్లలొ ఖుషీగ తిందాం పాప్ కార్నైనా
రచన,స్వరకల్పన&గానం:డా రాఖీ

వందల మందిరాలు సాయీ నీకు
లక్షలాది భక్తజనాలు
దినమంతా పూజలూ అర్చనలు
రోజుకైదు నీరాజనాలు
నిత్యనైవేద్యాలూ భోజనాలు
ఐనా ఏమి పొందినాము బాబా ప్రయోజనాలు

1.రాసాను కీర్తిస్తూ ఎనలేని గీతాలు
నీ గుణ గానాలు నామ భజనలు
చేసాను దీనులకు  సేవలు దానాలు
మోసాను నువ్వెక్కిన పల్లకీ పలుమార్లు
ధరించాను ధుని విభూతి అన్నిదినాలు
ఐనా ఏమి పొందినాము బాబా ప్రయోజనాలు

2.ముగించాను సచ్చరిత్ర పారాయణాలు
చేసాను షిర్డియాత్ర ప్రయాణాలు
కన్నాను కనులారా నీ సమాధి విభవాలు
స్పృశించాను నువు తిరిగిన ప్రదేశాలు
విన్నాను నువు తెలిపిన సూత్రాలు బోధనలు
ఐనా ఏమి పొందినాము బాబా ప్రయోజనాలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పాట రాసేదే నీకోసం-నీవుంటే మధుమాసం
వరమీయి దరహాసం-తాళజాల నే మోసం
మెలితిరిగేను నిను చూసి నా మీసం
నిరంతం నీ సన్నిధిలో అంతులేని సంతసం

1.వంచాను అందుకో నీలాల ఆకసం
దించాను హరివిల్లు చేసుకో కైవసం
పెంచాను పూవనం కోసుకో సుమ మానసం
పోషించానీ  గీతంలో ఆసాంతం సరసరసం

2.తారామణులను త్రెంచుకొచ్చి మెళ్ళోమాలవేస్తా
చందమామను తీసుకొచ్చి గుమ్మాన తగిలిస్తా
కీలుగుర్రం ఎక్కివచ్చి నిన్నెత్తుకొని వెళతా
దేవలోక సామ్రాజ్ఞిగా నీకే నే పట్టం కడతా

Wednesday, June 24, 2020

ముక్కలు చేసినా రాదు చప్పుడు
పిడికిట నొక్కినా ఉంటుంది గుప్పెడు
మంటబెట్టి మసిచేసినా కత్తిబెట్టి కోసేసినా
నీకోసమే కొట్టుకుంటోంది నా గుండె
నీ నామమే జపిస్తూ మిన్నకుండె

1.ఎవడుకనిపెట్టాడో గాని ప్రేమ అన్న ఈ పదాన్ని
ఎలా అంటగట్టాడో ఏమో లలనతో అనుబంధాన్ని
వ్యాపకాలన్నిటికీ తిలోదకాలిచ్చేలా
వ్యామోహపు వలలోనా పడిచచ్చేలా
మధురమైన ప్రణయానా ఈ మరణయాతన
తగదునీకు నెచ్చెలీ దూరమౌట జీవితాన

2.నారి మనసు మర్మమేదో హరికైనా తెలియదంట
పడతి యోచనేంటో పరమేశ్వరుడెరుగడంట
మాయలోడి ప్రాణం చిలుకలోనా
నా పంచప్రాణాలు నీ పలుకులోనా
ఔనని మననీయి నీపాద దాసునిగా
అందాల చేయందీయి పడిఉంటా బంధీగా

Tuesday, June 23, 2020

శుభోదయం ఓ సుకుమారీ!!
హృదయం నీదే మేరే ప్యారీ
పగలూ రేయీ యాదేఁ తేరీ
సతాయించకే ఓ వయ్యారీ

1.బుర్కపిట్టలాగ దొర్కవాలుతావు
తాయిలం కర్చుకొని తుర్రుమంటావు
చేపపిల్లలాగ చిక్కినట్లే తోస్తావు
పట్టుకొనేలోగా పట్టుజారిపోతావు
నిన్ను సాదుకుంటానే ఎంతోప్రేమగా
నిను చూసుకుంటానే అపురూపంగా

2.దోబూచులాడగా నీకెందుకే సరదా
దొంగాటలాడేవు మజాకా నీకు సదా
సీరియస్గా లవ్ చేస్తుంటే లైట్ తీసుకోనేల
నాపక్కన రిజర్వ్ చేస్తే బ్రేకప్పుల గోలేల
నా ఎదలో చోటుంది నీ ఒక్కదానికే
అప్సరసలె దిగిరానీ లెక్కచేయదే
చెముడున్నదా ఏం వినిపించుకోవు
మిడిసిపాటేమొ నీకు పట్టించుకోవు
ఎంత మార్ధవంగా నే పలకరించినా
ఎంతప్రేమగా నీతో ప్రవర్తించినా
తగదు నీకీ తెగువా తరుణీమణీ
మనసులేని మగువా నా ప్రియభామినీ

1.అనిమేషవు నీవనుకోకు
మిషలింక వెతుకబూనకు
అమరకాంతనీవని తలవకు
కారణాలు వివరించకు
నాకన్న మిన్నగా ప్రేమించరెవ్వరు
అనురాగమంతా నీ ఎదలొ వంపరు

2.తిరిగి తిరిగి అరిగాయి
వెంబడించి నా పాదాలు
వెంటబడి అలిసాయి
విసుగెత్తిన నా తపనలు
తెగేసైన చెప్పవే తప్పుకొమ్మని
తెగతెంపులు చేయవే మూడుముళ్ళని
తనువంతా పూవుల తోట
మనసంతా తేనెల తేట
నను మెచ్చిన నెచ్చెలి  నేనచ్చరువొందేలా
అల్లంత దూరంనుండే పరిమళాలు గుప్పించింది
అధర మందారాల మకరందం అందించింది

1.కన్నుల్లో కార్తీకాలు
గళసీమ మాణిక్యాలు
నను మెచ్చిన నెచ్చెలికి  నేనచ్చరువొందేలా   
నింగిలోని వెన్నెలంతా అంగనపై పరుచుకుంది
తారలన్ని గుచ్చిన హారం మెడను అలరించింది

2.ఇంద్ర ధనుసు కోక
పడమటెరుపు రవికె
నను మెచ్చిన నెచ్చెలికి  నేనచ్చరువొందేలా
అలంకారాలన్ని సృష్టే సమకూర్చింది
అందాలనెన్నెన్నో దృష్టి ఇనుడించింది

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఆషాఢమాసాన  అతివలకు
అరుణిమ నొలుకగ అరచేతులకు
మరులెన్నగొలిపేను మగువలకు మైదాకు
ఫిదాగా మారుతారు సుదతులు హెన్నాకు
గోరింటాకుతో  కన్నుల పంట
నిండుగ పండగ కలలపంట

1.ఆరోగ్యాన్నే అందగజేస్తూ
సౌభాగ్యాన్నే ప్రసాదిస్తూ
వర్షాకాలం వైరస్ నంతా
ఒంటికంటకుండగ జేసే
అపూరూపమైన చింతామణి
అపూర్వమైన లోహితమణి

2.ఇంతుల అందం ఇనుమడించగా
పడతుల మనసే పరవశించగా
తీరైన తీగలతో కరములనలరిస్తూ
ఇంపైన పువ్వులనే విరియగజేస్తూ
గోరింట తెలుగింట అమ్మాయిలకాప్తంగా
గోరింట భరతావని సంస్కృతి ప్రాప్తంగా

Monday, June 22, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కనులలో ఎన్నెన్ని కమనీయ కావ్యాలు
తనువులో ఏవేవొ రమణీయ దృశ్యాలు
నవ్వుల్లొ విరిసేను వేవేల హరివిల్లులు
పలుకుల్లొ కురిసేను పుట్టతేనెల జల్లులు

1.అల్లసాని ప్రబంధంలో వరూధినీ సొగసు నీది
ఆముక్తమాల్యద లో తులసిమాల వలపు నీది
రవివర్మ కుంచె దించిన దమయంతి రూపు నీది
రామప్ప గుడిలోని  శిల్పాల నునుపు నీది

2. మల్లెలు మందారాలు మెరిసేను అధరాన
రోజాలూ సంపెంగా వెలసేను ఆననాన
వాఙ్మయమే నెలకొంది నీ  రసన కొసన
కైతలే జపాతాలై జాలువారె నీ కలాన
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నీ చూపటు నా చూపిటు
ఎలా కలిసేను మనసైటు(Sight)
నీ బాటటు నా చోటిటు
ఎలా ఒకటౌను మన సైటు(Site)
రెచ్చగొట్టమాకు పిచ్చిపడుతోంది
కచ్చతీర్చుకోకు కసిరేగుతోంది

1.ఏం దాచుకున్నావో ఎదలోన సంగతులు
ఎరుగలేకున్నాను నీ చేతల మతలబులు
మొహం తిప్పుకుంటావు మోహనంగ మురిపించి
ఏమెట్టిచేసాడో విరించి వన్నెలన్ని మేళవించి
రెచ్చగొట్టమాకు పిచ్చిపడుతోంది
కచ్చతీర్చుకోకు కసిరేగుతోంది

2.సింగారించి హొయలన్ని ఒలకబోసేవు
సింగారాన్ని రంగరించి గారాలెన్నొపోయేవు
బ్రహ్మచర్యం చౌర్యం చేసే నంగనాచి జాణవె నీవు
మాయామర్మమెరుగని దానిలా బుంగమూతి పెట్టేవు
రెచ్చగొట్టమాకు పిచ్చిపడుతోంది
కచ్చతీర్చుకోకు కసిరేగుతోంది

Sunday, June 21, 2020

ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా-శుభాకాంక్షలతో

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

షడ్జమం సౌరభమందించనీ-రిషభం పరిమళించనీ,
గాంధారం  గుభాళించనీ-మత్తేభం మత్తెక్కించనీ
పంచమం పరవశింపజేయనీ,-ధైవతం తన్మయమొందించనీ,
నిషాదం  ఖుషీలనే పంచనీ-సంగీత వనంలో మనజీవనంలో

1.మంద్ర మధ్యమ తారా స్థాయిల్లో శ్రుతిపక్వమవనీ
ఆరోహణ అవరోహణ సప్త స్వరముల వరమవనీ
లయ గతి జతి గమకాలు గానమందు వికసించనీ
భావ రాగ తాళాలు మనో రంజకమై మేళవించనీ

2.కర్నాటక హిందుస్తానీ భారతీయ సంగీతం వెలగనీ
విశ్వజనీనమై సంగీతం అనురాగ మొలికించనీ
శిశువులు పశువులు పాములనూ గానం అలరించనీ
సంగీతం సాహిత్యం యుగళమై సర్వదా చెలఁగనీ

Saturday, June 20, 2020

బోర్ కొడుతోంది రొటీనైన జీవితం
ఉల్లాసమే కోల్పోయిందీ మానసం
గానుగెద్దులా అదే గాడిలో
తిరుగాడి తిరుగాడి
పాసుపండ్ల పాటగాడిలా
పాడిందే పాడి పాడి

1.ఉబలాటం అన్నదే మరుగయ్యింది
గోప్యతలేని మార్మికాలే కనువిందవగా
ఆరాటం అన్నదే కరువయ్యింది
అడగముందే అవసరాలే ఈజీగ పొందగా
వినోదాలు అరచేతిలో ఆడుతుండగా
అనుబంధాలు విలువలనే వీడుతుండగా

2.చెమటోడ్చే తత్వమే  బాధయ్యింది
వక్రమార్గాల తక్కువ శ్రమకే సంపద చేరగా
ఎదురుచూపులో తీపంతా చేదయ్యింది
ఇన్స్టంట్ గా కోరినవన్నీ ఇట్టే నెరవేరగా
మనీకి మనిషికి వాల్యుయే మృగ్యమవగా
ఎవరికివారే యమునతీరే దౌర్భాగ్యమవగా

Friday, June 19, 2020

నీటికరువు అనుభవమే ఇలలోనా
కన్నీటికి కరువన్నది  కనలేదు కలలోనా
హృదయ కుహరమందు ఊట ఆగిపోదు
ప్రమేయమే లేకున్నా బ్రతుకున వెత ఒడవదు

1.రుధిరమేమొగాని అశ్రుధారె నరనరాన
ఆనందమె మరీచిక మనిషి జీవితాన
మనుగడకై పోరాటం బ్రతికినంతకాలం
శ్రమకు తగ్గ ఫలితం శూన్యమే ఆసాంతం

2.దుఃఖాలు పలువిధాలు కారణాలనేకం
నవ్వుల ముసుగేసుకుంది ఈ విషాద లోకం
మునకలేయడంలోనే సంతోషం చవిచూడు
చరమగీతినైనా మోహనంగ పాడు

గరళము మ్రింగితే ఘనతేమున్నది
కఫము నిండ గొంతు యాతనెరుగుదువామరి
పంచభూతనాథుడవైతె మాకేమున్నది
వాతపైత్యాలతో సతమతమై పోబడితిమి
కాశీవిశ్వేశ్వరా కాళహస్తీశ్వరా
కాళేశ్వర ముక్తీశ్వర నమో రామలింగేశ్వరా

1.చావు భయం బ్రతుకు భయం మాకేల శంకరా
మృత్యుంజయ పాహిపాహి అభయంకరా
నిరతము నీనామజపము నీపైనే ధ్యానము
కనికరముతొ చేర్చుకోర నీ సన్నిధానము
కాశీవిశ్వేశ్వరా కాళహస్తీశ్వరా
కాళేశ్వర ముక్తీశ్వర నమో రామలింగేశ్వరా

2.అనివార్యమె మరణము అన్నది సత్యము
అనాయాస మరణమీయి అదే నీ ప్రసాదము
చిత్రవధతొ చిరకాలము మాకొద్దీ జీవితము
మూడునాళ్ళ బ్రతుకైనా కడకీయి కైవల్యము
కాశీవిశ్వేశ్వరా కాళహస్తీశ్వరా
కాళేశ్వర ముక్తీశ్వర నమో రామలింగేశ్వరా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మానవతి

సప్తగిరులపై వెలిగే వేంకటరమణ
సప్త ఋషులు కీర్తించెడి శ్రీ చరణ
సప్తద్వారాల వైకుంఠమె నీ విలాసము
సప్తజన్మల దోషాలు హరించు నీ స్మరణము
స్వామీ నీకిదే మనసావాచా కర్మణా ప్రణామము

1.పద్మనాభ పురుషోత్తమ ఫణీంద్ర శయన
మాధవా రమాధవా మధుసూధనా
కేశవా సంకర్షణ హృషీకేశ వామనా
సహస్రనామాంకిత శ్రీనివాస పావనా
స్వామీ నీకిదే మనసావాచా కర్మణా ప్రణామము

2.జగన్నాథ జనార్ధనా జగదీశ వాసుదేవా
గోవిందా ముకుందా పుండరీక విఠలా
ఉపేంద్రా అచ్యుతా హరి నారసింహా
సహస్రనామాంకిత నారాయణ శ్రీధరా
స్వామీ నీకిదే మనసావాచా కర్మణా ప్రణామము
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నా అంతట నేనే పలకరించాలా
నా మటుకు నేనే పులకరించాలా
ఊసులెన్నొ చెప్పాలా బాసలెన్నొ చేయాలా
ఎంతకాలమే చెలియా ఒన్ వే ట్రాఫిక్
ఎందుకోసమే ప్రియా దిల్ మే ధక్ ధక్

1.వెంటబడినా కొద్ది ఏం మిడిసిపడ్తున్నావే
అతిగా పట్టించుకొంటే మితిమీరి పోతున్నావే
అందగత్తెవే నువ్వు కాదని అనలేను
మంత్రగత్తెవే నీవు నీ మాయలొపడినాను
దిక్కువేరె లేనేలేదు నీవు మినహా
లక్కుగా మారిపోవే లవ్ తో సహా

2.జగదేక సుందరికి గర్వం సహజమే
అభిమాన ప్రేయసి టెక్కు అంగీకారమే
నేనెలా మసలాలో సెలవీయవే సఖీ
ఏరీతి మెప్పించాలో చెప్పవే చంద్రముఖీ
వేరుదారి లేదు దాసోహమనకుండా
ఎదిరించలేనే నీకు లొంగిపోకుండా
రచన,స్వకల్పన&గానం:డా.రాఖీ

నయానాలు తెలిపేను నవరసాల భావనలు
నేత్రాలు పలికేను కొంగ్రొత్త భాషలు
చక్షువులు లిఖించేను మది చదివే ప్రేమలేఖలు
కనుదోయి వెలయించేను కమనీయకావ్యాలు
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
అభినయ నృత్తానికి దృక్కులే ఉత్కృష్టం

1.అంబకాన సంభవించు అశ్రువర్షపాతం
అక్షులే కురిపించు శరశ్చచంద్రాతపం
ఈక్షణమే కలిగించు తీక్షణ శరాఘాతం
లోచనమే ప్రకటించును యోచనసారం
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
 అభినివేశ సాధనమున అవలోకనముచితం

2.హృదయానికి లోకానికి పీతువు సేతువు
జ్ఞానదృష్టి కలుగుటలో అంతర్నేత్రమె హేతువు
కళ్ళలో విరిసేను చెలిని కాంచ హరివిల్లు
ఆహ్లాదవేళ విశ్వంకరాల దరహాస పరవళ్ళు
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
అనుభూతి ఆస్వాదనకై నేత్రం అర్ధనిమీలితం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నువ్వంటె నాకెంతొ లవ్వంట
నువు సయ్యంటే నరాల్లొ జివ్వంట
విప్పిచెప్పినా ఇనుకోవె నీతో తంట
పెట్టేవు గుండెల్లొ హాయిగొల్పు మంట
రావె నారంగీ సింగారి మంగీ ఓ నవ్వుల సారంగీ
మోహనాంగీ కొంటెకోణంగీ ఒహో సంపంగి

1.నిద్దురలేస్తాయి సుద్దులే అవలిస్తు పొద్దుగుంకగానే
వద్దువద్దంటూనే పద్దులే రాస్తాయి ముద్దుముద్దుగానే
ముద్దమింగకున్నామానె  కడుపునిండేను ముద్దులతోనే
పట్టుపరుపులేకున్నగాని అలుపుతీరు నీ ఒడిలోనె
రావె నారంగీ సింగారి మంగీ ఓ నవ్వుల సారంగీ
మోహనాంగీ కొంటెకోణంగీ ఒహో సంపంగి

2.దుప్పట్లొ దూరితే చాలు మొదలౌను ముద్దుమురిపాలు
కౌగిట్లొ ఒదిగితే చాలు దొరికేను అన్ని నాక సుకాలు
హద్దుపద్దులేకుండ గుద్దులాడజూస్తావె ముద్దరాల
ఎక్కితొక్కి ఎక్కిరించి మాయజేసి నెగ్గేవు సిగ్గురాల
రావె నారంగీ సింగారి మంగీ ఓ నవ్వుల సారంగీ
మోహనాంగీ కొంటెకోణంగీ ఒహో సంపంగి

PIC courtesy: Agacharya Artist

Thursday, June 18, 2020

గుర్తుచేసుకుంటున్నావో
నన్ను తలచుకుంటున్నావో
పొలమారుతోంది తెరలు తెరలుగా
కాకి అరుస్తోంది గోలగోలగా
ఏం చేస్తున్నావో నేస్తమా
నీ దర్శనం నాకు ప్రాప్తమా

1చల్లగాలి నై వచ్చి నిన్ను తాకనా
.వానజల్లునై వచ్చి నిన్ను తడపనా
మల్లెపూవునై విచ్చి జడలొ ఒదగనా
తెల్లచీరనై మెచ్చి నిన్ను చుట్టనా
ఏం చేస్తున్నావో నేస్తమా
నీ దర్శనం నాకు ప్రాప్తమా


2.గోరింటాకునేనై నీ చేతిలో పండనా
పారాణిగా మారి పాదం ముద్దాడనా
చెవికి బుట్టానై ఊసులే గుసగుసలాడన
మువ్వల పట్టీనై కాలికి సవ్వడులే రేపనా
ఏం చేస్తున్నావో నేస్తమా
నీ దర్శనం నాకు ప్రాప్తమా

Wednesday, June 17, 2020

గులాబి మొగ్గ తొడిగింది నేడే
నిశితా నువు పుట్టిన రోజీనాడే
శుభాకాంక్షలందుకో నవ్వుల ఖజానా
అందుకో మామయ్య గీతికనే నజరానా
హ్యాప్పీ బర్త్ డే విష్యూ హ్యాప్పీ బర్త్ డే
హ్యాప్పీ బర్త్ డే నిశితా హ్యాప్పీ బర్త్ డే

1.ఇందారపువంశానికె అందాలరాణి
భవానీసత్తెన్నల ప్రియనందిని
రవిచంద్రుని సహధర్మిణి,శ్రీద్వైత జనని
దండనాయకుల ఇంట అదర్శగృహిణి
హ్యాప్పీ బర్త్ డే విష్యూ హ్యాప్పీ బర్త్ డే
హ్యాప్పీ బర్త్ డే నిశితా హ్యాప్పీ బర్త్ డే

2.వాగ్ధాటికి వాగ్దేవివి చదువుల మేధావిని
నీ పిక గాత్రముతో మురిసిపోవు ఆమని
సోగసూ సోయగం కలబోసిన భామిని
మమత మానవత సంగమ మనస్విని
హ్యాప్పీ బర్త్ డే విష్యూ హ్యాప్పీ బర్త్ డే
హ్యాప్పీ బర్త్ డే నిశితా హ్యాప్పీ బర్త్ డే

Tuesday, June 16, 2020

నాన్న ప్రాణ స్నేహితుడు
నాన్న జ్ఞాన బోధకుడు
నాన్న మార్గదర్శకుడు
నాన్న శిక్షకుడూ సంరక్షకుడూ
కనిపెంచే కనిపించే నాన్న దేవుడు

1.విశ్వసించగలిగే  ఆత్మీయుడు
విస్మరించలేని ఆప్తమిత్రుడు
మన ఉన్నతి కాంక్షించే గురువర్యుడు
లౌక్యాన్ని నేర్పించే ఆచార్యుడు
కనిపెంచే కనిపించే నాన్న దేవుడు

2.బ్రతుకు బాట వేసే శ్రేయోభిలాషి
దారితప్పనీయని అనవరత హితైషి
క్రమతతొ నడిపించి దరిజేర్చే దిక్సూచి
మన ప్రగతే తనదిగా భావించే మహర్షి
దైవత్వం నింపుకున్న ఇలోని మహా మనిషి


రచన,స్వరకల్పన&గానం.:డా.రాఖీ

జగమే ఒక ఉయ్యాల-కాలమే జంపాల
జనులనూరడించగా జోలనీవె పాడాల
జంగమదేవరా అర్ధనారీశ్వరా
జననివి జనకుడివీ నీవేరా నీవేరా
రాజరాజేశ్వరా భవా భీమేశ్వరా

1.నీ విశ్వరచనలో మేము తోలు బొమ్మలం
నీ జగన్నాటకంలొ వచ్చే అతిథి పాత్రలం
ఆడించినట్టుగా ఆడి అలసిపోయాము
నడిపించినట్టుగా నడిచి సొమ్మసిల్లాము
మమ్ముల లాలించి పరిపాలించరా
నీ ఒడిలో సేదదీర విశ్రమించనీయరా

2.నియమాలే అతిక్రమించు జీవిత చదరంగం
నిబంధనలు పాటించక సాగు కాలచక్రం
నీ మాయల మర్మమైతె ఎరుగమైతిమయ్యా
నీ లీలల పరమార్థం నీకే తెలియునయ్యా
శోధించగ వేదనలే మిగిలేనయ్యా
నీ పదసన్నిధికై పొగిలితిమయ్యా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎంతగానో  మాకిష్టం -భక్షభోజ్యచోష్యలేహ్యాలు
భోజన ప్రియులకు ఆత్రం పంచభక్ష పరమాన్నాలు
లొట్టలేస్తు లాగించేస్తాం షడ్రసోపేతాలు
నోరూరించే కమ్మనైన తినుబండారాలు

1..నలభీమపాకమైతే చెప్పడానికేముంది
నేతి తీపి మిఠాయిలైతే రసన మురిసిపోతుంది
ఆవకాయ గోంగూరతో అదరహో ప్రతిపూట
అప్పడాలు వడియాలుండగ అదేకదా పండగ

2.అతిథిలాగ వచ్చేస్తాం తృప్తిగా భోంచేస్తాం
అమ్మలా ఆదరిస్తే కొసరికొసరి వడ్డిస్తే
ఆయాసమొచ్చేదాకా కడుపారా తింటాం
అన్నదాతా సుఖీభవా అంటూ దీవిస్తాం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

స్నేహమంటె నాకెంతో  వ్యామోహం
నేస్తాల అంతరంగమంతా అనురాగం
ఏ ప్రేగు బంధం లేకున్నా రక్త సంబంధం కాకున్నా
అనిర్వచనీయమీ అనుబంధం
చిత్రమేసుమా మైత్రీబంధం-మన మైత్రీబంధం

1.ఏ గాలి కలిపిందో ఏ వేళ కలిసిందో
ఏ తీరు నచ్చిందో ఎదలోకి చొచ్చిందో
బలీయమైపోయింది బాంధవ్యం
అనంతమై సాగుతుంది ఈ పయనం
అనిర్వచనీయమీ అనుబంధం
చిత్రమేసుమా మైత్రీబంధం-మన మైత్రీబంధం

2.అద్దమల్లె మనవన్నీ స్పష్టంగా తెలుపుతుంది
కనబడని మనవెన్నే  కంటికి చూపెడుతుంది
పరకాయ ప్రవేశమే చెలిమికెపుడు తగు అర్థం
పరసువేది తత్వమే సఖ్యతకు పరమార్థం
అనిర్వచనీయమీ అనుబంధం
చిత్రమేసుమా మైత్రీబంధం-మన మైత్రీబంధం

Monday, June 15, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

జిత్తులమారి ఓ సుకుమారి
కత్తులునూరి చంపకె ప్యారీ
ఎత్తులతోని మత్తులొ ముంచి
చిత్తం దోచకే ఓ వయ్యారి
నను కడతేర్చడమే నీ వ్యూహం
నీ కడుపు నింపడమే నా ధ్యేయం

1.కొత్తిమీర రెమ్మవో అత్తి పత్తి కొమ్మవో
కమ్మని కరేపాకు రెబ్బవో దబ్బనిమ్మవో
కలపనా పులుసుతో ఘువఘమ  పులిహోర
అందించనా నంజుకోను నా మదితో నోరూర
నను కడతేర్చడమే నీ వ్యూహం
నీ కడుపు నింపడమే నా ధ్యేయం

2.విత్తులేలేని  ద్రాక్ష పళ్ళతోని
రసమే చేసి నోటికీయి సరసంగా
చిక్కనైన గుమ్మపాలు నీ ముద్దు మురిపాలు
తటపటాయించక చేయవె నా పాలు
నా కడుపు నింపనీయి నీ ధ్యేయం
నిను కడతేఱనీయుట నా వ్యూహం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:భీంపలాస్

బంధాలు పెంచకు-బాధ్యతల ముంచకు
నీనుండి క్షణమైనా-నన్ను దూరముంచకు
రాజరాజేశ్వరా రామలింగేశ్వరా
కోరికలను నాలోన కలిగించకు

1.జిల్లుజిల్లుమంటోందా -లింగం పై నీళ్ళధార పోస్తుంటే
గుండె ఝల్లుమంటోందా-నీపై పూలు పత్రి పెడుతుంటే
ఎలా సేవించను నిన్ను-ఏ తీరున మెప్పించను
రాజరాజేశ్వరా రామలింగేశ్వరా
అభయకరము నీకరము-శుభకరము నీ దర్శనము

2.కన్నునీయలేను తిన్ననివోలే-నిను కనక మనలేను రెప్పపాటైనా
కన్నవాణ్ణీయలేను చిరుతొండనంబివలే-మమకారం విడలేను పొరపాటైనా
ఎలా నిన్ను వేడుకోను-ఎలా నిన్ను చేరుకోను
రాజరాజేశ్వరా రామలింగేశ్వరా
కరుణా సాగరం నీ హృదయం-ఆనందనందనం నీ సదనం
సంతోషం దుఃఖం రెండూ కానిది ఆనందం
జననం మరణం తేడా లేనిది ఆనందం
ఇహమూ పరమూ ఏదైనా అదేసదానందం
నీలోనీవే నీతోనీవే రమించడమే ఆత్మానందం

1.నిరామయమై అలౌకికమౌ
అనిర్వచనీయ అనుభూతే
ఆనందం బ్రహ్మానందం పరమానందం
సుఖాల్లో పొంగక కష్టాల్లో కృంగక
నిశ్చల నిర్మల ప్రశాంతమైన దివ్య భావనే
ఆనందం మహదానందం యోగానందం

2. పసిపాప మోమున వసివాడిపోనీ
బోసినవ్వుల్లొ తరగని చెరగని
ఆనందం బాలానందం భవ్యానందం
సంసారం పరిత్యజించి బంధాలను వదిలేసి
అలక్ నిరంజనని తిరిగే యతికి
ఆనందం సత్యానందం నిత్యానందం



కలలొ కలుసుకుందాం ప్రతి రాత్రి
నెమరువేసుకుందాం మన మైత్రి
నిరాశయే దరిరాదు నీకు నేను తోడుంటే
నిస్పృహే మరిలేదు నీవే నా నీడంటే

1.ఉక్కగా ఉన్నాగాని తిక్కగా ఉన్నాగాని
నా పక్కన నువ్వనుకుంటె అదే అదే ఆమని
చీకటే చిమ్మినగాని  అమావాస్య కమ్మిన గాని
నీతో సాహవాసమే   కార్తీక పౌర్ణమి

2.నీ ఊహే మలయసమీరం నీ ఊసే మధుర సంగీతం
నీవున్న  తావే మొగిలి పూల తావి
నీ పలుకే మంజులనాదం నీ భావం పవిత్రవేదం
బంధాలకే అందం నీతో అనుబంధం

ఒక పాట నాకోసం.. పాడవే బంగారూ
నేనంటె ఏలనే నీకంత కంగారూ
నీ గొంతులోనా శంఖనాదాలు
నా మనసులో నీ వీణారవాలు
చెవులలో దూరేనూ తేనెల జలపాతాలు
తనువు తనివితీర్చేను నీ మధురగీతాలు

1.కోయిల జాడేలేదు నీ గళాన కొలువైంది
సన్నాయి ఉలుకేలేదు నీ స్వరాన నెలకొంది
వాయులీన వాద్యమే ఊపిరిలో దాగుంది
వేణువైతేనేమో  పెదవులతో ముడివడింది
ఎద మృదంగమై మ్రోగి లయగ గీతి నడిపింది
నరాలన్ని జివ్వుమనగ మువ్వల సడిరేగింది

2.కొంగ్రొత్త రాగాలే పలుకుతోంది నీ అనురాగం
మత్తుగొలుపు భావాలే చిలుకుతోంది రసయోగం
సంగీత శాస్త్రం లో అద్భుతమే మన అధ్యాయం
గాంధర్వ తత్వంలో అపూర్వమే మనసంయోగం
భావరాగతాళాలై గానమందు ఒదిగుందాం
యుగళగీతమై మనమే యుగయుగాలు బ్రతికుందాం

నీ మాటలు మత్తెక్కిస్తాయి-నీ పాటలు మైకాన్నిస్తాయి
నీ చూపులు కైపుగ తోస్తాయి-నీ నవ్వులు మాయను చేస్తాయి
ఎంజైమ్ లనే ఊరిస్తాయి నీ జ్ఞాపకాలు
ఎంజాయ్ నే కలిగిస్తాయి నీతో ఉన్నక్షణాలు
రసమాధురి హసితాఝరి-మనమైత్రియే పూమంజరి

1.సాంప్రదాయమంతా మేనపూసుకుంటావు
ఆధునాతన భావాలే వెళ్ళబుచ్చుతుంటావు
మూతికేమొ బట్టకట్టి కనువిందు విందులిస్తావ్
కాలికేమొ బేడివేసి ముందుకెళ్ళమని తోస్తావ్
ఎంజైమ్ లనే ఊరిస్తాయి నీ జ్ఞాపకాలు
ఎంజాయ్ నే కలిగిస్తాయి నీతో ఉన్నక్షణాలు

2.ఎక్కడెక్కడో ఎదమీటి రాగాలు పలికిస్తావు
ఒళ్ళంతా తీపులురేపే యోగాలు కలిగిస్తావు
పరుగుతీయబోతుంటే పగ్గాలు బిగబడతావ్
తప్పుకొనిపోయే వేళ తట్టిలేపి ఎగబడతావ్
ఎంజైమ్ లనే ఊరిస్తాయి నీ జ్ఞాపకాలు
ఎంజాయ్ నే కలిగిస్తాయి నీతో ఉన్నక్షణాలు
అందాలరాశి తరిగిపోదు నీ అందం కావ్యాలెన్ని రాసినా
పరువాల రాశి కరిగిపోదు నీ పరువం ఎంతగా గ్రోలినా
చిత్రమైన పొంకాలన్ని చిత్తం మొత్తం చిత్తుచేయగా
తీర్చుకుంట ఉబలాటం నిను వర్ణిస్తూ కించిత్తు రాయగా

1.నిండు జాబిలంటి ముఖబింబ సోయగము
దేవశంఖమంటి కంఠ సౌభాగ్యం
పూర్ణ కుంభాలనే తలపించు కుచద్వయం
నితంబినీ అమోఘమే నీ జఘనాల ఔన్నత్యం

2.పిడికిట ఒదిగెడి కటి సౌష్ఠవం
చూపుతిప్పుకోలేని నాభి ఆగడం
నూగారు రేపేను మరుగైన మరులను సైతం
ఊరువులే ఊరించేను జారేలా రసపాతం

3.తమలపాకు బోలిన లేత అరిచేతులు
అందెలతో డెందము దోచే సుందరమౌ పాదాలు
రతికేళివేళ పరిమితులకు తావేది అంతుచూడగా
స్వేదనదిలో ఈదులాడ ఇరువురొకరిగ కరిగి భావతీరాలు చేరగా

Sunday, June 14, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అల వల కల శిల బోధకులే
చెట్టు మెట్టు గుట్ట పిట్ట ఉపదేశకులే
మనిషి నడవడికి మార్గ దర్శకులే
చక్కనైన పరివర్తనకు నిర్దేశకులే

1.పట్టుదలను ప్రతిబింబించును అల
గుట్టుగా పట్టుకొనుటకు ప్రతీకయే వల
గాలిమేడలెప్పటికీ కూలేనంటుంది కల
శిల్పంగా మలుచుకొమ్మని చెబుతుందీ శిల

2.త్యాగాన్ని నేర్పుతుంది ప్రతిచెట్టు
విజయాన్ని చేర్చుతుంది ఒక్కోమెట్టు
స్థైర్యాన్ని సూచిస్తుంది చెదరని గుట్ట
బ్రతుకునెలా ప్రేమించాలో తెలుపుతుంది పిట్ట
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ప్యార్ కరోనా ముఝె ప్యార్ కరోనా
నీ నిర్ణయమే చెలియా మేరా జీనా యా మర్నా
నువ్వే నా లవ్వు దేవత నా గుండెలొ గుడి కడతా
నువ్వే నా లైఫ్ నమ్మవే కాదంటే  నైఫ్ దింపవే
ఎన్నిజన్మలైనా నిన్నే వైఫ్ గా చేసుకుంటా
నీ  ఇంటి క్వారంటైన్ లో ఖైదీలా పడిఉంటా

1.నీ ఊసే వైరస్ లా నను వెంటాడుతోంది
నీ యాదే కోవిద్ లా వేధించివేస్తోంది
సానిటైజరేదివాడినా నన్ను వదలకుంది
ఫేస్ మాస్క్ యూజ్ చేసినా ఆపలేక పోతోంది
లాక్ డౌన్ చేయాలేమో నా మనసుకి
షడ్డౌనే చేయాలేమో నా తపనకి

2.వ్యాక్సినంటు లేనేలేదు వయసుపోరుకు
మందోమాకొ దొరకదాయే తనువు తీరుకు
భౌతికంగ దూరముండి కళ్ళుకళ్ళుకలపాలి
విహారాలు మానేసి విరహాన్ని గ్రోలాలి
ప్రేమరోగమంటూ రాకుండ మెలగాలి
అనురాగం బారినపడితే చావోరేవో తేలాలి
కుటుంబ నావకు నావికుడు
సంతతికంతా నాయకుడు
అలుపెరుగని అసలైన శ్రామికుడు
తెర వెనకన నడిపించే దర్శకుడు
నాన్నేగా  ఆదర్శ పురుషుడు
నాన్నేగా  భవితకు మార్గదర్శకుడు

1.అవసరాలు నెరవేర్చే ఏటియం కార్డు
అనుక్షణం కంటి రెప్పలా కాచుకునే గార్డు
దారితెన్ను చూపించే కూడలి డైరెక్షన్ బోర్డు
దైవమే కనికరించి మనిషికొసగిన రివార్డు
నాన్న అల్లావుద్దీన్ దీపం
నాన్న బయటపడని ప్రేమరూపం

2.సింహాలను ఆడించే రింగ్ మాస్టర్
తప్పులన్ని మన్నించి చెరిపే డస్టర్
ఆపదలను పసిగట్టే పవర్ టెస్టర్
ఎప్పుడూ మద్దతు తెలిపే ఎనర్జి బూస్టర్
నాన్నంటే పంచప్రాణాలు
నాన్నవెన్నంటే  ప్రయాణాలు

Saturday, June 13, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:శుభాళి

తిట్టితిని మరి మరి గీపెట్టితిని
గొంతెమ్మకోర్కెలకై నే పట్టుబట్టితిని
తిరుమలేశ  నీ పాదాలా తలపెట్టితిని
ఎట్టకేలకు నీ  కావ్యగీతి  తలపెట్టితిని

1.ఒళ్ళుజలదరించేలా నీళ్ళుకుమ్మరించితిని
అభిషేకమేదో అయ్యిందనిపించితిని
తొడిమలైన తీయకుండా పూలన్ని చల్లితిని
వక్షానికి గుచ్చుకున్నా పూజపూర్తి చేసితిని
ఆరాధన పేరిట అపరాధమొనరించితిని
అహంభావినై నీకడ నే ప్రవర్తించితిని

2. ఓరిమిగా మనలేకా నిన్ను నిగ్రహించితిని
బాధ్యతనే విడినాడి నేనాగ్రహించితిని
అనుభవాల సారమంతా నే సంగ్రహించితిని
కర్తా కర్మా క్రియనీవేనని ఇపుడే గ్రహించితిని
ఫలితమేదైనా నే పరిగ్రహించితిని
బ్రతుకునీ  ప్రసాదమనీ ప్రతిగ్రహించితిని

*ఇక నేనాగలేకా చేరితిని తిరుపతిని
శ్రీవేంకటేశ్వరా కనులారనిన్ను దర్శించితిని
నే తరియించితిని*
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఇంద్రజాలమేదో నీ పలుకుల్లో ఉంది
మత్తుమందుఏదో నీ తలపుల్లో ఉంది
కనికట్టుతోనే కదలకుండ చేస్తావు
మంత్రమేదొ వేసి మనసుకాస్త దోస్తావు

1.పెదాల్లోని మధువంతా నవ్వుల్లో చిందిస్తావు
కళ్ళల్లోని కైపంతా చూపుల్తో అందిస్తావు
భ్రామరాన్నై నేను తనువంతా వాలుతాను
పిపాసినైన నేను ప్రతి చుక్కా గ్రోలుతాను

2.రసన రసము సుధతో సరి సమానము
ఆదిష్టమైతేనో తేనెలా భావనము
తనురసము ప్రేపించు నిక్షిప్త మైకము
షడ్రసోపేతము దేహవిందు సత్యము

Friday, June 12, 2020

నీ ప్రతి కదలిక ఒక గీతి
నీ ముఖకవళిక బహుప్రీతి
ఆనందమే క్షణక్షణము నీతో సోపతి
ఆహ్లాదమే అనుదినము నీతో అనుభూతి

1.మండే ఎండలోనూ నీవొక చలివేంద్రం
కుంభవృష్టిలోనూ నీవే కదా నా ఛత్రం
నేనంటేనే  నేస్తమా నీకు ప్రేమపాత్రం
కలిపిఉంచుతోంది ఏదో చిత్రమైన సూత్రం

2.ఏదో చెప్పలేని వింత ఆరాధన
గుండె గుట్టుకోసమే నా శోధన
నిన్నుకనక పోతే ఎంతో వేదన
ఎలాతెలుసుకోగలవు నామది మధన
మందాకిని సొగసులు నీకే సొంతం
అలకనంద కులుకులు నీ పాదాక్రాతం
చూడబోతె అయస్కాంతం
చుప్పనాతి సూర్యకాతం
ననుచేకొనవే నవనవ లా చేమంతి
మనసందీయవె మిసమిసలా పూబంతి

1.గంగాతరంగిణే నీ అంతరంగం
యమునా తటియే నీ కటియోగం
తరించినా అంతరించినా నీ దయావిశేషం
వరించినా సవరించినా నీ కృపాకటాక్షం
ననుచేరరావే త్రివేణీగ సంగమించినా
నాలో లీనమైపోవే సాగరంగ పరిణమించినా

2.అధిరోహించగలనా ఇరుమేరు పర్వతాలు
అధిగమించగలనా వింధ్యగిరుల శిఖరాలు
లోయలు మైదానాలు దాటలేను నువు వద్దంటే
అరణ్యాలు కొండగుహలు అరయలేను కాదంటే
 సఖీ  నీవుతోడుంటె సాధ్యమే స్వర్గారోహణ
నువ్వు వినా బ్రతుకంటే స్పష్టంగా నరక నమూన








Thursday, June 11, 2020



సజల నయనాలు-తెలుపు కథనాలు
వదన వర్ణాలు-ఎద దర్పణాలు
ముడిచిన ఆ పెదాలు-అణిచె వాస్తవాలు
ముదిత వెతకు ఒక్కటే భూతభవిష్యద్వర్తమానాలు

1.అడవి గాచిన వెన్నెల అతివ  అందమే
కొమ్మమీదనే వాడి రాలెడి విరి చందమే
వండిన వెన్నున్నా విస్తరెపుడు ఖాళీయే
తిండి ధ్యాస లేనపుడు షడ్రుచులూ వృధాయే

2.సూటిపోటి మాటలే గుండెలో గునపాలు
సగమై మిగిలినా కరువాయే మురిపాలు
సాంత్వన దొరికినా సమసేను మనాదులు
సుదతుల సౌధాలకు బలహీనమె పునాదులు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అలక ఏలనే కులుకుల చిలుకా
ఎద పంజరాన బంధించాననా
పలక వేలనే వలపుల మైనా
నిన్ను వదలనే ఇక ఏదేమైనా

1.ఎండైనా వానైనా-గూడు నీడనీయకా
రేయైనా పగలైనా-తోడెవరూ దొరకకా
బేలవైన వేళ నిన్ను చేరదీసానుగా
ముద్దూమురిపాలతో ఆదరించానుగా

2.ఊసులెన్నొ చెప్పాను-బాసలెన్నొ చేసాను
ఊహల్లో తిప్పాను-ఊడిగమే చేసాను
అనుక్షణం వినోదాన్నె కలిగించాను
అనుభూతులెన్నెన్నో నీకై పంచాను

Wednesday, June 10, 2020

కుంతల జలపాతం నీ నవ్వుల్లో
కురిసెను మకరందం నీ పలుకుల్లో
మంజుల భాషిణీ సుమధుర హాసినీ
నీ డెందము కవితల అందలం
నీ అందము భూతల నందనం

1.పాలకడలియందు ఆవిర్భవించినావొ
పూల పరిమళాలే నీమేనదాల్చినావో
క్షీరజ సంబంధి చందన సౌగంధి
నీవదన కమలం సూర్యకిరణ వికసితం
నీ నయన కుముదం చంద్రాతప హసితం

2.కఛ్ఛపినే ఇఛ్ఛగా వెంటతెచ్చుకున్నావో
పెదవులు వేణుధరునికిచ్చుకున్నావో
మానవ కలకంఠీ అభినవ సితికంఠీ
గంధర్వ గానాలు నీకే ఇల సొంతం
నాట్యశాస్త్రమే నీ నడకలు ఆసాంతం


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కాలం అమృతకలశం
చేజార్చకు ఏ నిమిషం
నిరర్థకంగ కోల్పోతే బ్రతుకు విలువ శూన్యం
నిజం తెలుసుకోకుంటే అది ఎంతటి దైన్యం

1.సుఖం దుఃఖమంటూ వేరువేరు లేవు
దృక్పథం మార్చుకుంటె  రాలేవవి నీ తెరువు
వేదనలో మోదములో ఆనందమె పొందేవు
అనుభవాలు ఏవైనా  ఆస్వాదించేవు

2.అభద్రతే ప్రతిఒక్కరి ఆందోళన హేతువు
నేటికంటె రేపటికే ప్రాధాన్యతనిచ్చేవు
భవితకై వగచివగచి ప్రస్తుతాన్ని వదిలేవు
మనిషిగా జీవించూ  చేరేవు దివిరేవు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మధ్యమావతి

చిత్తశుద్ధిలేకపాయె సాయిబాబా
నా ఏకాగ్రత మాయమాయె సాయిబాబా
మొక్కుబడిగ గుడికేగుట దేనికి బాబా
మొక్కులు ముడుపులేల సాయిబాబా
దిక్కులుచూడనేల చక్కని నీ రూపుగనక
మక్కువ ఎక్కువగా నీపై లేనే లేదుగనక
సాయినాథా షిరిడీ సాయినాథా
సాయినాథా షిరిడీ సాయినాథా

1.మనసు ధ్యాస ఎప్పుడూ నీమీదనే నిలుపనీ
మాటమాటకు మాటిమాటికీ సాయీ అని పలుకనీ
ఏపని చేసినా మునుముందుగ నీకే తెలుపనీ
సఫలమో విఫలమో ఫలితం నీకే సమర్పించనీ
సాయినాథా షిరిడీ సాయినాథా
సాయినాథా షిరిడీ సాయినాథా

2.మనిషి మనిషిలో బాబా నిన్నే కాంచనీ
ఉన్నంతలొ కాస్తైనా నిరుపేదకు పంచనీ
పెద్దల కడ వినయముతో నా తలవంచనీ
ఎదుటివారిలోని మంచి నన్నే గ్రహించనీ
సాయినాథా షిరిడీ సాయినాథా
సాయినాథా షిరిడీ సాయినాథా
మాట్లాడుమా ప్రియా అక్షరాలబాటలో
పలుకరించవే చెలీ పదాల పూలతోటలో
మధువును గ్రోలే మధుపం ఈర్ష్యపడేలా
సీతాకోకచిలుకే అలకతొ అంగలార్చేలా
పచ్చని పచ్చికబయళ్ళే తివాచీలు పరుచగా
అచ్చిక బుచ్చికలాడుతూ నన్నే అలరించగా

1.ఉద్యానవనమందు అందించు వలపులవిందు
వడ్డించవే వగలన్ని రంగరించి సొగసంతకుమ్మరించి
కొసరికొసరి తినిపించు మిసమిసలా పరువాలు
తాంబూలాన్ని మరిపిస్తూ అందించు అధరాలు

2.పవనాన్ని బ్రతిమాలి వీయమను శీతలాన్ని
ఎండవేడి నీడనీయ వేడిచూడు రసాతలాన్ని
నీ ఒడినే పడకగ మార్చి పవళింపనీయవె నన్ను
కలబడిన బడలికనే తీరిపోగ కునుకనిమ్ము
ఇంత చెప్పినా ఎరుగవైతివా-నా ప్రేమ సంగతీ
తెలిసికూడ తెలియనట్టుగా-నటిస్తే ఎలా నా పరిస్థితీ
ఐ లవ్యూ అన్నమాట బూతుకాదుగా
ప్రేమతెలుపడంలో ఏ రోత లేదుగా
మానెయ్యీ మనసుకు ముసుగెయ్యడం
కానియ్యి పారదర్శకం -ఎందుకు దాచెయ్యడం

1.పున్నమి వెన్నెలను ఆస్వాదించరా
మలయ సమీరాన హాయి పొందరా
జలపాతధారలెపుడు మదికి ఆహ్లాదమే
ప్రకృతి పచ్చదనం నయనానందకరమె
కోల్పోక సైతం అభిందించవచ్చు
మనోగతం తెలుపుతూ మన్నన సేయవచ్చు

2.బిడియపడితె భావాలు ఎలావ్యక్తపర్చగలరు
మొహమాటాలతో ఎలా స్వేఛ్ఛ పొందగలరు
తటపటాయిస్తుంటే తరుణం మించిపోదా
భాష చాలదనుకుంటే మార్గమేదొ దొరకదా
నువ్వు నువ్వుగా ఉన్నపుడే బ్రతుకునకర్థం
అర్థవంతమైన కాన్క అర్థమనుటె పరమార్థం

Tuesday, June 9, 2020



నువ్వా చిన్నదానివి( ?! )ఎన్నో వన్నె లున్నదానివి
వగలే పోతున్నదానివి
మాయచేసి మంత్రమేసి మదిదోచుకున్నదానివి
నీ గుండెలోతుల్లో దాచుకున్నదానివి

నువ్వా చిన్నోడివి (!! )మంచి మనసు ఉన్నోడివి
లౌక్యమే లేనోడివి
పాలేవో నీళ్ళేవో అసలేమాత్రం ఎరగనోడివి
నోట్లో వేలెడితే కొఱకనోడివి

1.1.ఏడ నేర్చుకున్నావే ఇంతటి నెరజాణతనం
చూడబోతే విస్తుబోయె నంగనాచి వైనం
1.2.విప్పిచెప్పినా గాని వినుకోని విశ్శెన్నవు
తెరిచి ఉంచినా నేరుగ చొరబడనేరవు
పాలేవో నీళ్ళేవో అసలేమాత్రం ఎరగనోడివి
నోట్లో వేలెడితే కొఱకనోడివి

2.1కన్నుగీటి సైగచేసి నన్నుకాస్త పిలిచేవు
పంటినొక్కు లెన్నొనొక్కి నీ బాంచను చేసేవు
2.2.మెచ్చిందా మగువ నిను చచ్చేదాక వదలదు
అలకొచ్చిందా మగడా కాళ్ళబేరమైతెగాని కుదరదు
మాయచేసి మంత్రమేసి మదిదోచుకున్నదానివి
నీ గుండెలోతుల్లో దాచుకున్నదానివి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:కామవర్ధిని(పంతువరాళి)

అర్థంకాదు అందరికీ నాలోని భావన
వ్యక్తమే చేయలేను నీపై ఆరాధన
నా మౌనభాషకే భాష్యం రాసే నేర్పరినీవు
నీ చిలిపి ఊహకే పదములు అల్లే కూర్పరి నేను
కలలు కల్పనలే కమ్మని కవనాలు
కరుగుతున్న ఈ క్షణాలు ఆనందనందనాలు

1.నేను నిజం నా కవిత నిజం
స్ఫూర్తినీవే అన్నమాట ముమ్మాటికీ నిజం
నీవో భ్రమగా ఒక మధురిమగా
మరులను రేపుతున్నదే పచ్చినిజం
కమలం భ్రమరం సంపర్కం
మిథ్యయన్నదే గుప్పిటగప్పిన నిజం
సృజనకు మూలం సుదతియన్నదే
అనాదిగా ఎల్లరు ఎరిగిన పరమనిజం

2.పరిమితి లేదు అనుమితి కృతిగా
నీ అందచందాలు నీమేని గంధాలు
ఎల్లలు లేవు పరిగణ చేయగా
నీతో ఊసులుబాసలు విరహాలు విహారాలు
ఇంతకన్న గొప్పగా ఎంతగానొ చెప్పినా
పోలికకందదు నీ సౌందర్యం
ఎన్నిసార్లు గ్రోలినా అనుభూతెంత పొందినా
చేదనిపించదు నీ మాధుర్యం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మీనాల నయనాలు వేసేను గాలాలు ఎంతో చిత్రంగా
చూపుల విరితూపులు చేసేను గాయాలు ఎదకే ఆత్రంగా
కనుబొమల కనుమల్లొ భానూదయాలు
సమసేను ప్రేమల్లో అనుమాన తిమిరాలు
ముంగురులే పాడేను  ప్రణయ గీతాలు
దరహాస చంద్రికలే పూసే నవనీతాలు

1.కవనాలు మౌనంగ రాసే ప్రేమలేఖలు
 కపోలాలు సిగ్గుతొ చేసేను నృత్యాలు
కనుపాపలొ నా రూపును బంధించినావు
కలలోను నను కలువగ తపియించినావు
కడకొంగుకే నన్ను ముడివేసుకున్నావు
కడదాకా నడిచేందుకె చేయందుకున్నావు

2.ఎన్నెన్ని తిరిగానో గుళ్ళూగోపురాలు
అనురాగ దేవతకై మది మందిరాలు
నీయంత నీవే ఎదురొచ్చి మెచ్చావు
గురిఎంతో కుదిరి నీ  మనసిచ్చినావు
నినువీడి మనలేను ఏడేడు జన్మాలు
చావైన బ్రతుకైన తోడుంటే అదిచాలు

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:భీంపలాస్

అమ్మా నిన్నే నమ్ముకుంటే
వమ్ముకాదు ఆశయెన్నడు
అమ్మా నీ పంచన జేరితె
చెమ్మరాదు కంటికెప్పుడు
ముల్లోకాలకె కన్నతల్లివి
దయగల్ల తల్లివి కల్పవల్లివి

1.ఆకలి సంగతి  నీవెరుగనిదా అన్నపూర్ణాదేవి
అన్నమో రామచంద్రా అంటూ అలమటించగానేమి
ప్రపంచానికే ధాన్యాగారమై భారతావని విలసిల్లనీ
ఆకలి కేకల శోకాలు లోకాన కనుమరుగవనీ

2.విద్యలేని మనిషేలేని వసుధగా సంస్కరించు
నలందా తక్షశిలల విద్యను పునరుద్ధరించు
బ్రతుకనేర్చు బుద్ధినీ మాలో జాగృత పరచు
పరమార్థ సాధనకై మమ్ముల సన్నద్ధపరచు

3.నలత కాస్త కలతగా పరిణమించనీయకమ్మ
వాస్తవ భాగ్యమైన ఆరోగ్యము నీయవమ్మ
వికృత వింత వ్యాధుల ధర దరి రానీయకమ్మ
నీవెరుగని సత్యమేది నీకసాధ్యమేదమ్మా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:చక్రవాకం

శ్రీదేవీ నమోస్తుతే శివాత్మికా
శ్రీచక్ర విలసిత శ్రీ లలితాంబికా
శ్రీవిద్యాన్వితా సురమునిపూజితా
శ్రీపీఠ సంశోభిత శ్రితజన సేవితా

1.పరమ దయాళూ పరాంబికా
సరగున బ్రోవవే వరదా వేదమాతా
పరిపరి విధముల నిను నుతియించెదా
పరసౌఖ్యమీయవే పరా పరవిద్యా

2.నీమాయావశమే చరాచరజగము
నీ కనుసైగలతో కదులును మా పదము
తల్లివి నీవనీ తలపున నమ్మితీ
తక్షణమే దయజూపి నీ అక్కునజేర్చవే

Sunday, June 7, 2020


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మాయామాళవ గౌళ రాగం

నీ వెండికొండ నాగుండె
నా కంటగంగ కొలువుండె
నా మూడో కన్నుమూసుండె
నీకై బ్రతుకు దీపమై మండే
హరహరా సార్థకనామధేయా
శివశివా పరమార్థ ప్రదాయా

1.నా బుద్ధిబూడిదాయె పూసుకో
కామం బుసకొట్టె మెళ్ళోవేసుకో
చిత్తం చపలమాయె మొలకు చుట్టుకో
యోచన వక్రమాయె నెత్తినెట్టుకో
హరహరా సార్థకనామధేయా
శివశివా పరమార్థ ప్రదాయా

2.నీకాలి మువ్వలై మ్రోగనీ నానవ్వులు
నీ చేతి శూలమై చెలగనీ నా బలము
నీ వాహనమవనీ  నా యీ దేహము
ఆవాహనమవనీ నీ స్వస్వరూపము
హరహరా సార్థకనామధేయా
శివశివా పరమార్థ ప్రదాయా

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం: షణ్ముఖ ప్రియ

స్వరముల రసమయ సంయోగమే రాగం
హృదయాల లయ లయమైనదే అనురాగం
రంజింప చేసేదె రాగం
మది బంధింపజేసేదె అనురాగం

1.మనసే స్పందింప ఎద పలుకునొక రాగం
నవరసము లందునా చెదరదు అనురాగం
రాగమంటే రసికుల కనురాగం
అనురాగముంటే ఉప్పొంగును రాగం

2.తన్మయముగ తలలూగేను కమ్మని రాగానికి
జీవనమే పావనమై తరియించేను అనురాగానికి
పదముల కదుపును నట్టువాగం
బ్రతుకుల కుదుపును అనురాగయోగం


గునపాలై దిగినాయి నీ చూపులు నా గుండెలో
ననుకట్టి వేసాయి కనుపాపలు  చెఱసాలలో
నను ముంచివేసాయి చిరునవ్వులు సరసాలలో
పందాలే విసిరాయి అందాలే అందమని ప్రతి పొద్దులో

1.పరాక్రమించావు  నీ అస్త్రశస్త్రాలతో
నువు విక్రమించావు నీవైన వ్యూహాలతో
మది నాక్రమించావు తీయని మాయని గాయాలు చేసి
బ్రతుకంతా సేవించే అధరసుధను సేవించే బానిస చేసి

2.వంపులనీ వయ్యారం మరులేగొలిపే
పుష్కలమౌ సౌష్ఠవమే తమకము రేపే
సింగారం నయగారం రంగరించ అంగాంగ సంగమమాయే
సింధూరం మందారం మేళవించ రేయంత జాగారమాయే
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఇసుకతిన్నెలు అడుగుతున్నవి
చెలి జాడ ఏదని ఏమైందని
వెన్నెలమ్మా వెతుకుతున్నది
మన జంట ఆచూకి ఏదని
గోదావరి కంటనీరే కారికారి ఇంకిపోయే
ఏకాకిగ మారినానని ఎరిగినంతనే ఖిన్నయై

1.గట్టుమీది వేపచెట్టు జాలిగా ననుచూస్తోంది
చెట్టుకొమ్మన పాలపిట్ట ఓదార్చగ కూస్తోంది
బడిగోడల చెక్కబడిన మన పేర్లు వెక్కిరిస్తున్నవి
గుడిలొజేగంట సైతం నన్నుగని మౌనవిస్తోంది
మోడుతోడై నిలుస్తోంది ఇద్దరం ఒకటేనని
కాడు ప్రేమగ పిలుస్తోంది నను రారమ్మని

2.కొండలాంటి బండలే నాగుండె కన్నా మెత్తనైనవి
పాడుబడిన కోటకూడ నామనసుకన్నా కొత్తనైనది
మండువేసవి ఎండ ఎంతో హాయినిస్తోంది నాకు
నల్లతుమ్మ ముల్లుగుచ్చిన నొచ్చినట్టే లేదు నాకు
నీవు లేని లోకమంతా ఎడారల్లే తోస్తోంది
నిన్ను చేరగ ప్రాణమే ఎంతగానో తొందరిస్తోంది

(TOUCH the PIC)

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చెప్పడమెంతో తేలిక
చేయగ మనసే రాదిక
పరులకు పెట్టక మనమూ నోచక
కూడబెడుతూ జీవితమే
గడిపేస్తామూ వ్యర్థంగా

1.పరోపకారం తలవకపోతే ఉండీ ఎందుకు శరీరము
ఉన్నంతలో ఏకొంతైనా ఆపన్నులకిస్తే ప్రయోజనం
పిట్ట చెట్టు నీటిపట్టు దాచుకోవు కలకాలం
అభద్రతా భావనే సంశయానికి మూలం
తెలివికి కృషియే తోడైతే సడలదుగా నమ్మకం

2.దధీచి శిభి బలి ఎందరులేరు చరిత్రలో
దానకర్ణులు నేడు సైతం ఉన్నారు ధరిత్రిలో
వెసులుబాటైతె ధనసాయం శ్రమదానం
రక్తనేత్రఅవయవదానం మరణానంతరం
దానం సంతృప్తికారకం సాయం సంతోషదాయకం

Thursday, June 4, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

తెలుపు బలుపుకు
నలిగె నలుపె
విర్రవీగెడి అధికార జులుమే
మానవత్వం మంటగలిపె
నలుపుజాతిని అణీచివేసే
హక్కులేదను విశ్వసూత్రం విస్మరించే

1.మనుషులంతా ఒక్కటే యని
చర్మవర్ణ వివక్ష తగదని
నగ్నసత్యం తెలుపు జనతయె
తెలుపుచుండుటె మంచిమలుపు

2.తరతరాలుగ తెగని వేదన
నలుపు బ్రతుకే యాతన
నలుపు నలుపన సలుపుభావన
కలుపుగోలుతొ మనగ ప్రార్థన

3.నల్లవారలూ మాననీయులె
రామకృష్ణులు నీలి రూపులె
నలుపువారిని కెలుకుచెపుడు
నలుపువారిని నలుపసూచన

Tuesday, June 2, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వెన్నదాచి పెట్టమాకు గొల్లభామ
నీమనసే వెన్న కదే తెలియద నా ప్రేమ
నన్ను సతాయించబోకె కలువభామ
సూర్యుడినై ఏలుకోన నమ్మవె లేమ

1.నీ వెంటపడుటకు ఇదికాదు మార్గము
నాతో జత కోసము ఏల ఇంత పంతము
చిత్తశుద్ధి ఉంటె సరి వశుడనై పోనా
మీరావై ఆరాధిస్తె పరవశుడనుకానా

2.నను బంధించడం సులభసాధ్యము
శ్రద్ధాసక్తులె కద చెల్లింగ మూల్యము
రుచులా ప్రాధాన్యము మమతేనైవేద్యము
శబరిలా తినిపిస్తే భుజియింతును తథ్యము
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నిదురలేని రాత్రులెన్నో-నీ జ్ఞాపకాలతో
మదిదాటని మాటలెన్నో-బిడియాలతో
చొరవ కరువైన వేళ-కాలమే పగబూనింది
మేలుకున్న తరుణాన-బ్రతుకు చేయిజారింది

1.రంగవల్లితొ నినుచూసాకే-నాకు పొద్దుపొడిచేది
గోదారిలొ ఎదురైతేనే-దినం నాకు గడిచేది
నీ జడలొ మెరిసేందుకే-మా గులాబి పూసేది
నీ మేను తడిపేందుకే-మేడపై వెన్నెల కాసేది

2.నా కొలువుతొలిజీతం-మువ్వలై నీ పదములుజేరే
నీవల్లిన ఊలు శాలువా-నను కౌగిట బంధించే
మౌనరాగాలెన్నో మారుమ్రోగె మన మధ్య
మీనమేష గణితాల్లో జీవితమాయె మిథ్య

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎంత కమ్మగుంటడో  సుందరాంగుడు
చూస్తుంటేనే నోరూరిస్తున్నాడు
ఎంత ముద్దగుంటడో ఆ నంద నందనుడు
వలపుల వలలేసి లాగేస్తున్నాడు
మగవారందరిలో పురుషపుంగవుడు
ఆడవారికైతే పరమ ఆరాధనీయుడు

1.చూపుల వెన్నెల్లొ తడవబుద్ధి
నగవుల తరగల్లొ నానబుద్ధి
బూరెల బుగ్గల్ని నిమిరేయ బుద్ధి
తేనేల పెదవుల్ని జుర్రేయ బుద్ధి
చెవితమ్మెచాక్లేట్ చప్పరించ బుద్ధి
కాజుకత్లిమేను కొరికేయ బుద్ధి

2.పాదపద్మాలను ముద్దాడబుద్ధి
ఊరువులతలవాల్చి సేదదీర బుద్ధి
బాహుబంధాల్లో కడతేరబుద్ధి
ఛాతిరోమాలతో క్రీడించ బుద్ధి
తనువు గంధాన్నీ ఆఘ్రాణించబుద్ది
జతగా బ్రతుకంతా ఆస్వాదించ బుద్ధి