Sunday, August 30, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

శుభరాత్రి ప్రియతమా కలలోకి స్వాగతం
మనమైత్రి సాక్షిగా కలవాలి ప్రతిదినం
దూరాలు భారమాయే ఇలలోనా
మనసులే చేరువైన తరుణాన

1.నిదురే మన కలయిక వేదికగా
నేనే కృష్ణుడు నీవే రాధికగా
నను సేదతీరనీ నీ ఊహల కౌగిలిలో
అదమరచిన పసిపాపగ నీ ఒడిలో

2.దేహాలు దగ్ధమైన అద్వైతస్థితిలో
ఆత్మలేకమౌ దివ్య సంగమ గతిలో
మరణిద్దాం మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ
ఆనందించేందుకు మళ్ళీమళ్ళీ తుళ్ళీతుళ్ళీ
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కలత చెందనేల ఆనందం లేదని
దిగులే ఆవరించిన చోటేది అనుమోదానికి
వెదకడం ఎందుకని ఆహ్లాదమేదని
కొలువుందిగా నీ మదిలొ  దేవులాట దేనికని
ఆనందపడటం అన్నది నిత్యసాధన
ఉన్నదాంతొ తృప్తి పడితే దరికిరాదు వేదన

1.మెట్టవేదాంతం కాదు సంతృప్తి అన్నది
తృప్తి వల్ల ఆగిపోదు ప్రగతి అన్నది
కృషి శ్రమ సంకల్పంతోనే కలుగుతుంది వికాసము
అభ్యున్నతి వల్లనే ఒనగూరును సంతసము
ఆనందపడటం అన్నది నిత్యసాధన
ఉన్నదాంతొ తృప్తి పడితే దరికిరాదు వేదన

2.నొప్పి బాధ దుఃఖాలన్నవి అత్యంత సహజమే
సుఖమైనా దుఃఖమైనాదేహగతమైనవే
ఉద్వేగం ఉద్రేకం పరిపక్వరాహిత్యం
నిరామయ స్థితప్రజ్ఞతే పరిపూర్ణ వ్యక్తిత్వం
ఆనందపడటం అన్నది నిత్యసాధన
ఉన్నదాంతొ తృప్తి పడితే దరికిరాదు వేదన
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నీదీ నాదీ ఒక ప్రేమకథ
కంచికి చేరని మధుర వ్యథ
ఎలా మొదలయ్యిందో
ఏ మలుపులు తిరిగిందో
వాస్తవంలో  గాయాలెన్నో
నవనీతాల స్మృతులెన్నో
మదిని కాస్త మెలిపెడతూ
సుధను చిలికి ఊరడిస్తూ

1.నరకమూ నాకమూ నీ ప్రతి జ్ఞాపకం
శూన్యమై పోయిందే నీ జతలేక నాలోకం
నీ ఊహలు ఊపిరిగా నీ తలపులు ప్రాణంగా
బ్రతుకునీడుస్తున్నా జీవశ్చవంగా
ఎదురైన ప్రతిసారి నా ఎదకు ఛిద్రం
నా సంగతి వదిలెయ్యి నువ్ మాత్ర భద్రం

2.నీ నిస్సహాయత దీనంగా చూస్తోంది
నా అసహాయత శాపమై కోస్తోంది
గోదారి ఇసుక తిన్నెలు కనుమరుగైనాయి
వెన్నెల రాత్రులన్ని అమావాస్యలైనాయి
మరణం కోసమే నా ఈ నిరీక్షణ
మరుజన్మకైనా తీరనీ వేదన
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:తోడి

సంకటములు బాపవేర వేంకటేశ్వరా
సంతసమును కూర్చవేర శ్రీనివాసుడా
వ్రతములు పూజలు వాసిగజేయలేను
సతతమునీ నామస్మరణ మరువజాలను
మననమాపను
వేంకటేశ పాహిమాం తిరుమలేశ రక్షమాం
శ్రీనివాస పాలయమాం చిద్విలాస నమామ్యహం

1.ఎక్కలేను నీవున్న ఏడు కొండలు
నిక్కముగా అక్కరయే నీ అండదండలు
మొక్కలేను మొక్కుబడిగ ఏ పూటనూ
చక్కని నీరూపమే మది నెంచకనూ
నీవులేనిదెక్కడ సర్వాంతర్యామివే
నాలో కొలువుండిన అంతర్యామివే

2.గొంతెమ్మ కోర్కెలేవి కలలోనూ కోరకుంటి
గుంజుకున్న వైభవమే తిరిగి నాకీయమంటి
నా తప్పుకు శిక్షనో నా ఓర్పు పరీక్షనో
ప్రతీక్షించలేను స్వామి నా అపేక్ష తీర్చమంటి
ప్రత్యక్షరమందున కావె కావ ప్రత్యక్షము
లక్ష్యపెట్టు నను స్వామి ప్రసాదించు మోక్షము