Wednesday, August 3, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చారుకేశి


ఉలికి ఉలికి పడుతున్నా 

నీ ఉనికిని కనుగొన కన్నయ్యా

ఉలికి సైతం చిక్కుతున్నా

ఈ కలికిని కానవేల చక్కనయ్యా


1.ఏ అమర సుధను పంచెనో ప్రియ రాధిక

ఎంత వెన్న ముద్దిచ్చెనో ఎలమి గోపిక

బృందావనమే నాడెందమది నిరతి వేదిక

బంధించితి నా మనమున నీకిక తావే లేదిక


2.అధర సుధల నందించెద నందకిషోరా

పాలు చిలికి వెన్నను పంచెద నవనీతచోరా

దేహవలువ వలిచి నన్నర్పించెద వేణుధరా

నేనంటూ లేనటుల లయమొందెద సుందరా


PIC courtesy:AGACHARYA artist Sir

 


మణులు వద్దు మాణిక్యాలొద్దు

మరి మరి పదవులు అధికారాలొద్దు

మిద్దెలూ మేడలొద్దు ఆస్తులు అంతస్తులొద్దు

ఉన్నదాన్ని అనుభవించు భాగ్యమీయవమ్మా

ఉన్నంతలో సంతృప్తిగా జీవించనీయవమ్మా


వరలక్ష్మీ కలవరమే కలుగజేయకమ్మా

భాగ్యలక్ష్మీ సర్వదా ఆరోగ్యమీయవమ్మా


1.సౌధమే ఐనా గదులెన్నిఉన్నా 

అవసరపడును ఆరడుగుల స్థలమే

ఎంతవండుకున్నా కమ్మనిరుచులున్నా

జిట్టెడు పొట్టకు పట్టేది పట్టెడే

కంటినిండ నిద్దురనే పోనీయవమ్మా

తిన్నతిండి కాస్తా ఒంటబట్టనీయవమ్మా


వరలక్ష్మీ కలవరమే కలుగజేయకమ్మా

భాగ్యలక్ష్మీ సర్వదా ఆరోగ్యమీయవమ్మా


2.వాహనాలు ఉంటే ఏమి వేళమించిపోతే

గమ్యాన్ని చేరుకొనే గతిగాన రాకుంటే

విలాసాలు ఎదురుగ ఉన్నా వీలుకాకపోతే

అనుభవించు దేహమే సహకరించకుంటే

నిలిచిపో మాఇంట వినోదాలు విరిసేనంటా

నిండిపో మనసంతా ఆనందాలు పండేనంటా


వరలక్ష్మీ కలవరమే కలుగజేయకమ్మా

భాగ్యలక్ష్మీ సర్వదా ఆరోగ్యమీయవమ్మా