Friday, July 30, 2021


మెత్త'గా తాకావు నా హృదయాన్ని…

కొత్తగా పూచావు మధురమైన భావాన్ని…

మనసంతా నిండిపోయేలా

కలలన్నీ పండిపోయేలా


1.బదిలీ చెయ్యి నీ కోప తాపాలు

 రుద్దెయ్యి  నా మీద నీ అసహనాలు

అలకలు కినుకలు నా ఎడల ప్రయోగించు

భావోద్వేగాలన్నీ  కేవలం నాకే పంచు

నరికినా నవ్వుతాను తరువులాగా

తప్పులు సరిదిద్దుతాను గురువులాగా


2.అందగజేస్తాను నీకు ఆనందాలన్నీ

ఊరేగిస్తాను నిన్ను అందలమెక్కించీ

ఆసరాగ నేనుంటా  జీవితమంతా

ఆలంబన నేనౌతా ఒడిదుడుకుల చెంత

నిన్ను నీకు చూపుతాను  అద్దంగా

అహర్నిశలు నీసేవకె నే సంసిద్ధంగా


తాయిలాల జాతర-ప్రగతికి పాతర

ఉచితాల పంచన- మానవీయ వంచన

కులం పేర మతం పేర కించపరచగా

ముసలితనం మిషగనో వైకల్యపు జాలిగనో

 విధివక్రించిన సంగతికది హేళనగానో

రాజకీయ లబ్దికై- ఎన్నికలలొ సిద్ధికై


1.సోమరులను చేసే హీన సమాజమై

నిర్వీర్యులుగా మార్చేసే పచ్చి నిజమై

ఎవరో పడవేసే ఎంగిలిమెతుకులకై ఆశగా

ఎవరి దయాభిక్షకో పడిగాపుల దెసగా

ఓటును బేరం పెట్టే కట్టుబానిసలుగా చేస్తూ

ఆత్మను తాకట్టుపెట్టే దాసులుగా మార్చేస్తూ


2.పరాన్నజీవులుగా తయారుచేస్తూ

ఉత్పత్తికి పరోక్షంగ తిలోదకాలిస్తూ

కొందరి కష్టార్జితాన్ని పన్నులుగా లాగేస్తూ

తమ తాతసొమ్ముగా తేరగా పంచేస్తూ

బిచ్చమెత్తడాన్నే సమూలంగ రూపుమాపలేక

బిచ్చగాళ్ళుగా ఖాతాల్లోకె నేరుగా బిచ్చంవేస్తూ



ఎన్నాళ్ళని నాకింకా వేంకటేశ్వరా

యాంత్రికమైన ఈ భవబంధనాలు

ఎప్పటికని కడతేరు తిరుమలేశ్వరా

సంసార సంద్రాన రోజూ తలమునకలు

నిశ్చల భక్తి నాకు ప్రసాదించరా

నిర్మల ఆసక్తినే నీ ఎడ కలిగించరా

నమోనమో వేంకటేశా నమోనమో తిరుమలేశా


1.ఉత్తమమైనది ఈ మానుష జన్మం

జన్మజన్మాలుగా చేసిన పుణ్యాల ఫలం

నీ పదసన్నిధి అది ఎంతటి భాగ్యం

విమలమైన మానసం ప్రశాంత జీవనం

నిశ్చల భక్తి నాకు ప్రసాదించరా

నిర్మల ఆసక్తినే నీ ఎడ కలిగించరా

నమోనమో వేంకటేశా నమోనమో తిరుమలేశా


2.నిరంతరం నను నీ చింతనలో మననీ

చరాచరజగత్తులో నిను దర్శించనీ

నే చేసేడి ప్రతికర్మ నీకే అంకితమవనీ

నా ఎదలయ నీ నామమే సదా స్మరించనీ

నిశ్చల భక్తి నాకు ప్రసాదించరా

నిర్మల ఆసక్తినే నీ ఎడ కలిగించరా

నమోనమో వేంకటేశా నమోనమో తిరుమలేశా