Wednesday, November 25, 2020



దేనికి   ననుదూరం చేసావు

ఎందుకు  క్రిందకు తోసావు

నువ్వు నేను ఇద్దరమే ఉన్న లోకం నుండి

నాలో నీవు నీలో నేను అన్న మైకం నుండి

ఈ శోకాల సంద్రంలో పడద్రోసావు

నాటకాల రంగంలో ఆడిస్తున్నావు

ఓం నమో నారాయణా ఆర్తత్రాణ పరాయణా

 ఓం నమో మాధవా రమాధవా ఆపద్బాంధవా


1.లంపటాలనేవేవో అంటగట్టావు

జంజాటాలలో నిండా ఇరికించావు

అంతా నేనే మొత్తంనాదే  అనుకునేలా చేసావు

వింతైన మాయలతో చింతలెన్నో రేపావు

కన్నులకే స్వార్థపు పొరలను కప్పావు

విజ్ఞతకే చీకటి తెరలను దింపావు

ఓం నమో దామోదరా పరమదయాళా ధరా

ఓం నమో చక్రధరా శ్రీధరా భక్తవత్సలా దొరా


2.ప్రలోభాలతో చిత్తమునే చెరిచావు

లోభత్వముతో విత్తములో ముంచావు

అంతా నీకోసం  నా  వెంటతెమ్మంటావా

ఇసుమంతా తేలేనని వెక్కిరిస్తుంటావా

కేళినింక ఆపరా పరాత్పరా తాళలేనురా

చేదుకోర వేగమే ఆగలేను వేగలేనురా

ఓం నమో భగవతే వాసుదేవాయ కావరా

ఓం నమో తిరుమల వేంకటేశాయ బ్రోవరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రుసుములు చెల్లించినా సేవలు మృగ్యము

ఖరీదైనదైనా వస్తువు నాణ్యతే హీనము

భారతావనిలో గతిలేక బ్రతుకెంతొ దుర్భరము

తాతలు తాగిన నేతుల చరితలైతె మధురము

కళ్ళు తెరువు పౌరుడా కనీస హక్కులకై

పోరాడర వినియోగదారుడా వస్తుసేవల లెక్కలకై


1.పన్నులు ఎగ్గొట్టే తత్వమే ఎచటైనా

బిల్లడిగితె ఖాతరే చేయరెప్పుడైనా

విలువను మించిన మూల్యమే వస్తువేదానికైనా

ఆనవాయితైన టిప్పులే సేవలు అంతంత మాత్రమైనా

కళ్ళు తెరువు పౌరుడా కనీస హక్కులకై

పోరాడర వినియోగదారుడా వస్తుసేవల లెక్కలకై


2.టికెట్ కొని బస్సెక్కినా సీటే దొరకదాయె

ఆటోలో వెళ్ళినా మీటర్ దాటి వసూలాయె

పర్యామరణమంటూ క్యారీబ్యాగుకు చోరీయే

తయారీ ఆపివేయ ప్రభుతకు చోద్యమాయే

కళ్ళు తెరువు పౌరుడా కనీస హక్కులకై

పోరాడర వినియోగదారుడా వస్తుసేవల లెక్కలకై


3.ఇంటి టాక్స్ కట్టినా డ్రైనేజి రోడ్డు కరువాయే

బిల్లులు చెల్లించినా కరెంటు నీటి కటకటాయే

పార్కింగ్ కు చోటులేక వాహనాల వెతలాయే

మితిమీరిన అనుమతులే కడగండ్లకు మిషలాయే

కళ్ళు తెరువు పౌరుడా కనీస హక్కులకై

పోరాడర వినియోగదారుడా వస్తుసేవల లెక్కలకై