Saturday, May 22, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పేరుకు మాత్రం మానవుడు

ప్రవర్తనకైతే  పశు సమానుడు

పుణికిపుచ్చుకున్నాడు అవలక్షణాలను

ఆవుతోలుకప్పుకున్న పులిగుణాలను


1.నక్క వినయాలు నత్త  నడకలు

కుక్కతోకవంకర బుద్ధులు కప్పదాటులు

గుడ్లగూబ చూపులు గబ్బిలంలా వ్రేలాడటాలు

నల్లికుట్ల చేష్టలు పిల్లిలా తోకముడవటాలు


2. ఎలుకలా దాగడాలు ఏనుగల్లె ఆగడాలు

వానపాము పౌరుషాలు కాకుల గోలలు

మేకపోతు గాంభీర్యాలు ఆంబోతు క్రౌర్యాలు

గొర్రెదాటు పోకడలు గంగిరెద్దు తల ఊపడాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అంతరించనీ నను తరించనీ  అంతకహరుడా

అవతరించనీ నీ పదపీఠిగ నీలకంఠుడా

వివరించనీ నా వెతలను త్రిపురాంతకుడా

సవరించరా నా గతులను సదానందుడా

శంభో హరా శంకరా సాంబసదాశివ అభయంకరా


1.తోసితివి నను భవసాగర తోయముల

వేసితివి చిక్కుల చిక్కెడు బంధనముల

మరచితివి కనికరమేలనో ఈ దీనుని ఎడల

చూసితివి చోద్యము నే మునుగ సుడుల

శంభో హరా శంకరా సాంబసదాశివ అభయంకరా


2.జాగిక సేయకు జాలిమాని  జాబిలితాల్పుడ

జటాఝూటధర జగడమ నాతో జంగమదేవర

జలధార ప్రియ జపమిక చేయుదు ఫాలనేత్రుడా

జింకతాల్పరి నా వంకలెంచకురు జయంతుడా

శంభో హరా శంకరా సాంబసదాశివ అభయంకరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తెల్లచీర రమ్మంటోంది

మల్లెపూలు తెమ్మంటోంది

దాగలేని పరువాలు ఆగం చేస్తున్నవి

ఆగలేని మరులన్ని మారాం చేస్తున్నవి

ఝాము గడిచిపోనీకు ప్రాణసఖా

జాగుచేసి చంపబోకు నా కోరిక


1.వలపునంత వండి పెట్టినాను

విందారగించ వేడిగ వడ్డించినాను

చల్లారిపోనీకు  నా మది సెగలు

తెల్లారిపోనీకు వగరైన వగలు

ఝాము గడిచిపోనీకు ప్రాణసఖా

జాగుచేసి చంపబోకు నా కోరిక


2.గులామునై పోయాను నీ మగటిమికి

సలామునే చేస్తాను నీ రసికతకు

నవాబుగా రమ్మంటిని పడకటింటికి

రివాజుగా దివి సవారికై తయారుంటిని

ఝాము గడిచిపోనీకు ప్రాణసఖా

జాగుచేసి చంపబోకు నా కోరిక


దివ్య మోహన విగ్రహం

అనూహ్యకరం పరానుగ్రహం

వేంకటాచల నిలయం వేదవేద్యం

వందే పంకజానన శోభితం పరమపూజితం


1.శంఖ చక్ర యుగధారిణం భవ తారణం

దశవిధావతారిణం రమా రమణం

భక్త వశీకరణం విష్ణుం ఆర్త త్రాణ పరాయణం

శరణాగత బిరుదాంకితం శరణం శరణం శరణం


2.శ్రీధరం ఇభరాజ వరదం మాధవం

గోవిందం గోవర్ధ గిరిధరం ముకుందం

సదానందం పరమానందం సచ్చిదానందం

హరిం మురహరిం నరహరిం కరుణాకరం