Thursday, September 26, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:దర్బార్ కానడ

కొఱవడుతున్నవి అనుబంధాలు
దిగజారుతున్నవి ప్రేమానురాగాలు
నేనూనాదను పరుగులాటలో
ఎండమావుల వెతుకులాటలో
గుండెలు బండబారుతున్నవి
బ్రతుకులు తెల్లవారుతున్నవి

1.విత్తిన చెట్టే మొలుచుట సహజం
గంజాయి మత్తులొ తూలుటే నైజం
కాళ్ళక్రింది నేలనొదిలితే రాలిపడడమే ఖాయం
విలువలనే గాలికొదిలితే మానవతే మటుమాయం
అత్యున్నత ఉత్తీర్ణతకై అనుభూతులు కర్పూరం
విదేశాల మోజులో కన్నవారు కడు దయనీయం

2.పసినాటి  వసతిగృహాలే పరిణమించి వృద్ధాశ్రమాలు
మితిమీరిన గారాబాలే తలకెక్కిన నిర్లక్ష్యాలు
తలిదండ్రులె ఆదర్శం బామ్మా తాతలనాదరించగా
ప్రభావమే ప్రాధాన్యం ప్రాప్తించినదే ప్రసాదించగా
వికాసం అభిలషణీయమే సర్వతోముఖవగా
విపరీతం అవనేకూడదు విడిపోయే దుర్దశగా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సహజమైన అందం-నిజమైన సౌందర్యం
పరుగెత్తే లేగదూడలా-బెదిరేటి లేడికూనలా
ఎగురుతున్న తూనీగలా-సీతాకోక చిలుకమ్మలా
తిలకించిన ప్రతి నయనం-చెప్పినారెప్పలే అల్లార్చదుగా
పులకించిన ప్రతి హృదయం-ఆనందడోలికల్లో తేలియాడుగా

1ఉషోదయ తుషార బిందువై
ఆహ్లాద పరచునులే
పడమటి సంధ్యారాగంలా
మోదాన్ని చేకూర్చునులే
సిరిమల్లెలా-చిరునవ్వులా
అనుభూతినొసగునులే సొగసు

2.ఎడారిలోని సరస్సులా
దాహాన్ని తీర్చును లే
చిరుజల్లుకు హరివిల్లులా
నింగికి వన్నెలు చేర్చునులే
ఎగిరే కొంగల జట్టులా-అందిన తేనె పట్టులా
పరవశింప జేస్తుంది సోయగం

3.ఊరికే ఉరికే కొండవాగులా
వయ్యారాలు పోతుంది
నోరూరించే పాలమీగడలా
లొట్టలేయజేస్తుంది
కోడి పిల్లలా-చిన్ని మేకలా
చిక్కీచిక్కకుంటుందీ చక్కదనం
https://youtu.be/QJJFlg-chbo?si=hy2wiO1ynd9JGL4m

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:భీంపలాసి

ఏమున్నది సాయినీలొ అంతటి ఆకర్షణ
ఎందుకయా జనులకు నీవంటే ఆదరణ
వేలంవెర్రిగా షిరిడీ పయనాలు
తామర తంపరగా ఎగబడి నీ దర్శనాలు

1.నీవేమో ఫకీరువు నివాసమో మసీదు
నిత్యబిచ్చగాడివి నీవే ఓ గరీబు
ఇవ్వడానికేముంది నీకడ ధునిబూడిది
ఆత్రమెంతనో పాపం అడిగేవాడిది
రెండురూకలడుగుతావు నీవొసగడమేమొగాని
గుండెలోన దూరుతావు మొండిగా తిష్ఠవేయ

2. చిరిగిన కఫిని పెరిగిన గడ్డము
మాసిన తలరుమాలు-చేతిలో సటకా
'అల్లాహ్ మాలిక్' అన్నదొకటె నీజపము
అందమా చందమా అతులిత నీ రూపము
కోట్లమంది కోరికలూ తీర్చావని ప్రతీతి
నాకొకటే కోరిక - కోరికనే చేయి నిహతి
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం: యమన్ కళ్యాణి

భావాలు పావురాలై ఎగిరేను స్వేఛ్ఛగా
అనుభవాలు పంజరాలై బంధీలు చేయునుగా
కలమెంత సహకరించినా
కాగితమే కదలనీదుగా
గొంతుతో చెలిమి కలుపుతూ
పాటగా పరిణమించుగా

1.కోయిలకు కూయాలని ఉన్నా
మావి చివురు కరువైతేనో
వెన్నెలకు కాయాలని ఉన్నా
రాహువే కమ్మేస్తేనో
ఎంతటి చైతన్యమైనా
ప్రకృతికి లోబడి ఉంటుంది
చాతుర్యమెంతటిదైనా
కాలానికి  కట్టుబడుతుంది

2.ఎన్నిముళ్ళు వేస్తే ఏమి
మనసులే ముడివడకుంటే
ఏడడుగులు వేస్తేఏమి
అడుగేసినా అడుగుతు ఉంటే
నమ్మకమే ఆయువుపట్టు
బ్రతుకునావ సాగడానికి
సర్దుబాటు బాటపట్టు
సుఖకరమౌ కాపురానికి