Sunday, October 20, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:చక్రవాకం

ఎన్ని రూపాలలో ఎదురౌతావు
నా కెన్నివిధాలుగా స్వామీ తోడౌతావు
విశ్వమంత నా కొరకే సృష్టించావు
వినోదించ నాతోనే నాటకాలాడేవు
పరంధామా  పాహిపాహి శరణు
నీవే నావాడవైతె ఇంకేమి కోరను

1.అమ్మవు నీవయ్యీ కని పెంచావు
నాన్నవు నీవై నను పోషించావు
గురువుగాను మారి నను తీర్చిదిద్దావు
నేస్తానివై చేరి నన్ననుసరించేవు
అవసరాని కాదుకొనే దాతవైనావు
నా జీవిత గమనంలో ఊతమైనావు
పురుషోత్తమా పాహి శరణు శరణు
నా కొరకే నీవుంటే ఇంకేమి కోరను

2.సహధర్మచారిణిగా నన్నలరించేవు
నా సుందర నందునిగా సేవలు బడసేవు
నా జ్యేష్ట తనయుడివై ఆలంబన నిచ్చేవు
అనూజుల పాత్రల్లో అండదండవైనావు
నా సాటి మానవునిగా గుణ పాఠాలు నేర్పేవు
మమతతో మనగలిగేలా నాకు మనసునిచ్చావు
పరమాత్మా ప్రభో శరణు శరణు శరణు
నువ్వే నేనైనప్పుడు ఇంకేమి కోరను
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:తోడి

ఎందుకు నను నిర్దేశించావో
ఏపనికి ననుపురమాయించావో
అటుగానే సాగనీ నా అడుగులు హే ప్రభో
తేల్చుకోనీ సాధనలో నను చావో రేవో

1.వచ్చింది దేనికో వడియాలు పెట్టనా
పుట్టుకకు పరమార్థం దోచికూడబెట్టనా
సమయాన్ని జారవిడిచి శోకాలు పెట్టనా
ఖర్మ ఇంతేనంటూ నిత్యం నిన్ను తిట్టనా
ఒడిదుడుకుల పాల్బడనీ  నడవడిక నా పరమవనీ
తప్పనిదైనా సరే  తప్పుదారి నను తప్పించుకోనీ

2.తోచినంతలో నన్ను పరులకెపుడు సాయపడనీ
ఎదలొ ఎన్ని వెతలున్నా చిరునవ్వులు పూయనీ
తరులవోలె ఝరులకుమల్లే తనువును కడతేరనీ
తరతరాలు మరువని మనిషిగ నన్ను కీర్తిగొననీ
నన్ను నీకు ప్రతినిధిగా భావించుకోనీ
జన్మ సార్థకమయ్యేలా నన్ను తరియించనీ




రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎందులో దాగుందో అందం-ఎందరికి తెలుసు
అందమంటే తగు అర్థమేంటో-ఎరుగునది ఒకటే మనసు
కళ్ళలోనా చూసే కళ్ళలోనా-పడతిలోనా  పచ్చనీ ప్రకృతిలోనా
ఎక్కడని లేదు అందం-అంతటా ఆహ్లాదం
అభివ్యక్తం చేయలేనిది-అనుభూతికె అవగతమైనది

1.కొండలూ కోనల్లో-జలపాత హోరుల్లో
ఆరారు ఋతువుల్లో -కెరటాల నురగల్లో
తొలి ఉషస్సు వెలుగుల్లో-నిశీథినీ తారల్లో
దట్టమైన అడవుల్లో -ప్రశాంత సరోవరాల్లో
ఎక్కడని లేదు అందం-అంతటా ఆహ్లాదం
అభివ్యక్తం చేయలేనిది-అనుభూతికె అవగతమైనది

2.వనిత వదనంలో-నాతి నయనంలో
నారీమణినాసికలో-అతివ అధరంలో
ప్రమద పయ్యెదలో-ముదిత వాల్జడలో
కోమలి నడుములోనా-జాణ జఘనములోనా
ఎక్కడని లేదు అందం-అంతటా ఆహ్లాదం
అభివ్యక్తం చేయలేనిది-అనుభూతికె అవగతమైనది

3.భౌతికమైన అందం కొంతకాలముంటుంది
అలంకరణ ఉంటె మాత్రమే ఆకట్టుకొంటుంది
మది చూరగొనుటే అందమైతే
మంచితనం మించునదేది
దృష్టి కేంద్ర బిందువంద మంటే
సేవదృక్పథమే స్ఫూర్తి ఔతుంది
మానవత్వం కన్నా గొప్పగ సౌందర్యముంటుందా
ప్రేమతత్వం కన్నా మిన్నగ శోభిల్లుతుందా
రచన,స్వరకల్పన&గానం.:రాఖీ

రాగం:హిందోళం

ఓంకార రావం నా పూరకం
ఢమరుకా నాదం
నా హృదయ స్పందనం
కైలాస విలాసం నా దేహం
శివోహం శివోహం సదాశివోహం
శివోహం శివోహం సాంబశివోహం

1. ఓరిమి గల మౌనం నా ధ్యానం
కాలకూట విషపానం నా సహనం
ప్రక్షాళన కారకమే నా ఝటాజూటం
తిమిర హరణ సాధనం శశాంక ధారణం
శివోహం శివోహం సదాశివోహం
శివోహం శివోహం సాంబశివోహం

2.కాలమాన పాలనం నా వైనం
వసుధైక కుటుంబమే నా తత్వం
దుష్కర్మల నిర్మూలన నా లక్ష్యం
సద్గతుల దరిజేర సుగమం నా మార్గం
శివోహం శివోహం సదాశివోహం
శివోహం శివోహం సాంబశివోహం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:మోహన

నువు ఉన్నావనుకొంటే హాయి
నీ మనుగడ మనిషికెంతొ ఊరటనోయి
నా ఆత్మగతమైన ఏకైక మిత్రుడవు నీవే నోయి
అపరిమిత అజ్ఞానమంత నీ తత్వమోయి
పరమ దయాళా పరాత్పరా
పరసౌఖ్యమీయరా పరమేశ్వరా

1.జిజ్ఞాసను మదినిలుపర జగదీశ్వరా
బుద్ధిని జాగృత మొనరించర లోకేశ్వరా
మీమాంసను మేల్కొల్పర మధుసూధనా
నా జఢతను చైతన్య పరచు జనార్ధనా
పరమ దయాళా పరాత్పరా
పరసౌఖ్యమీయరా పరమేశ్వరా

2.తుషారమవనీ నను భవతామరపైనా
తలపున మననమవనీ తవ తారకమైనా
సమర్పితమవనీ నా కర్మఫలం నీకికనైనా
దర్శనమవనీ నీ దివ్యత్వం ఈ జన్మకైనా
పరమ దయాళా పరాత్పరా
పరసౌఖ్యమీయరా పరమేశ్వరా


రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:అభేరి
నా కవనం పంభక్ష్య పరమాన్న సమన్వితం
నా కవనం రసనరుచిర షడ్రసోపేత భోజనం
నా కవనం సప్తవర్ణ ఇంద్రచాప సమ్మోహనం
నా కవనం నవరసభావాత్మక నటనాలయం

1.సౌందర్యోపాసన నా కవన తత్వం
ప్రేమ పిపాసి తపన నా కవన చిత్రం
మిథున మథన తల్లీనత నా కవన ధర్మం
అష్టవిధనాయికా అభివ్యక్తి నా కవన చెక్కణం

2.సమసమాజ నిర్మాణం నా కవన ధ్యేయం
సాంఘిక రుగ్మత ఛేదన నాకవన లక్ష్యం
వాస్తవ దృశ్య ప్రతిపాదన నా కవన మర్మం
ఎక్కడిన అక్షర శరం నా కవన గమనం

3.అన్నార్తుల వేదనాశ్రు దర్పణం నాకవనం
పీడిత తాడిత జన మనోగతం నాకవనం
మానవీయకోణానికి ప్రతిరూపం నా కవనం
భక్తి పూర్వక భరతమాత కభివందనం నా కవనం



రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:సామ

అర్చించెదనయ్యా నిన్నూ అనంత శయనా
సమర్పించెదనయ్యా నన్నూ అరవింద లోచనా
కోట్లాది భక్తులకూ కొంగు బంగారమయ్యీ
దివారాత్రాలు నిల్చీ కాళ్ళనొప్పులయ్యీ
ఆదమరచి నిదురోయావో ఆనంద నిలయా
సతులిద్దరు సేవించగా సేదతీరుతున్నావో దయామృత హృదయా

1.చమరించిన నా నయనాల ఆహ్వాన ఆసనాలు
ఒలుకుతున్న ఈ కన్నీరే అర్ఘ్య పాద్య ఆచమనాలు
నిరతమునీ తలపుల స్వేదం నిత్యాభిషేకము
నా చూపుల వస్త్రాలే నీకు పీతాంబరాలు
ఉన్నవాటితోనె నిన్ను ఉన్నతంగ పూజించేను
పుష్కలంగ కలిగినవన్నీ నీకు ధారపోసేను

2.రోగాలు నొప్పులపూలతొ ఆష్టోత్తరమొనరించేను
 కష్టాలు వేదనల ధూపదీపాలు పెట్టెదను
నా ఈతిబాధలనే  స్వామీ హారతిగా పట్టెదను
బ్రతుకె నీకు నైవేద్యం తిరుపతి బాలాజీ గైకొను
ఉన్నవాటితోనె నిన్ను ఉన్నతంగ పూజించేను
పుష్కలంగ కలిగినవన్నీ నీకు ధారపోసేను